సిమెంటుకు మంచి రోజులు
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన నిర్మాణ పనులు
- 10 శాతం పెరిగిన ప్లాంట్ల వినియోగం
- 2015-16లో పరిశ్రమ వృద్ధి 7 శాతం: ఇక్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు విక్రయాలు దేశవ్యాప్తంగా పుంజుకున్నాయి. మౌలిక రంగం, పెట్టుబడులతోపాటు మొత్తంగా ఎకానమీ రికవరీ ఇందుకు కారణమని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మార్కెట్లో స్తబ్దత తొలగిపోవడంతో నిర్మాణ రంగంలో కదలిక వచ్చిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ రియల్టీ రంగంలో కొత్త ప్రాజెక్టులు మొదలయ్యాయని చెబుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్ల వినియోగం 2014తో పోలిస్తే ప్రస్తుతం 10 శాతం పెరిగింది. ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టులు మొదలు కానున్నాయి కాబట్టి మంచి రోజులు రానున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా 2015-16లో దేశవ్యాప్తంగా సిమెంటు పరిశ్రమ 6.8-7 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ఇక్రా వెల్లడించింది.
ప్రభుత్వ ప్రాజెక్టులతో..
తెలంగాణలోని సిమెంటు ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం సుమారు 2.9 కోట్ల టన్నులు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 3.6 కోట్ల టన్నులు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ 2014లో ప్లాంట్ల వినియోగం 40-50 శాతం మాత్రమే నమోదైంది. 2010-14 కాలంలో సంయుక్త రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా నిర్మాణ రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. అమ్మకాలు లేక సిమెంటు పరిశ్రమ నష్టాలను చవిచూసింది. సాధారణంగా ఎన్నికలకు ముందు ప్రభుత్వ సంబంధిత నిర్మాణ పనుల వల్ల సిమెంటుకు గిరాకీ పెరుగుతుంది.
అయితే 2013-14లో ఆ తరహా పనులేవీ జరగలేదు. కాగా, ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా నిర్మాణ పనులు తిరిగి మొదలయ్యాయి. సిమెంటు ప్లాంట్ల వినియోగం 10 శాతం పెరిగి ఇప్పుడు మొత్తం సామర్థ్యంలో 45-55 శాతానికి చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పలు నిర్మాణ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపట్టేందుకు రెడీ అయ్యాయి. దీంతో సిమెంటుకు డిమాండ్ మరింత పెరగనుందని ప్రముఖ కంపెనీకి చెందిన ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో సిమెంటు వార్షిక వినియోగం 10 లక్షల టన్నులు అధికమవుతుందని ఆయన చెప్పారు.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
మహారాష్ట్రలో సిమెంటు ప్లాంట్ల వినియోగం 100 శాతం ఉంది. 2014లో 2.6 కోట్ల టన్నులు అమ్ముడైంది. 2015లో విక్రయాలు 2.8 కోట్ల టన్నులు ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. కర్ణాటకలో వినియోగం 1.5 కోట్ల టన్నుల నుంచి 1.6 కోట్ల టన్నులకు చేరనుంది. ఉత్తర, తూర్పు, పశ్చిమ భారత్‌లో ప్లాంట్ల వినియోగం 70-80 శాతం ఉందని కంపెనీలు చెబుతున్నాయి. గతేడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వినియోగం 1.7 కోట్ల టన్నులుంది. ఈ ఏడాది స్వల్ప వృద్ధి ఉంటుందని కంపెనీలు చెబుతున్నాయి. అలాగే ఈ రెండు రాష్ట్రాల నుంచి పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశాలకు సిమెంటు సరఫరా అవుతోంది. కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి నెలా 1-2 లక్షల టన్నుల సిమెంటు, క్లింకర్‌ను శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్‌కు ఎగుమతి చేస్తున్నాయి.
ఇక్కడే ధర తక్కువ..
దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లోనే సిమెంటు ధర తక్కువగా ఉందని కంపెనీలు వెల్లడించాయి. హైదరాబాద్‌లో 50 కిలోల బస్తా ధర వేరియంట్‌నుబట్టి ప్రస్తుతం రూ.320-355 మధ్య ఉంది. వైజాగ్‌లో ఇది రూ.340-370 పలుకుతోంది. తమిళనాడులో రూ.385-405, బెంగళూరులో రూ.380-410, కేరళలో రూ.400-430 మధ్య ఉంది. అయితే వడ్డీరేట్లు తగ్గితే నిర్మాణ రంగం గణనీయంగా పుంజుకుంటుందని ఒక ప్రముఖ కంపెనీ డెరైక్టర్ తెలిపారు. 2014-15లో దేశంలో సిమెంటు ఉత్పత్తి 5.6 శాతం పెరిగింది. అంత క్రితం కాలంలో ఇది 3 శాతమే.