ikra
-
జూన్ క్వార్టర్లో జీడీపీ 20% క్షీణత: ఇక్రా
ముంబై: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) అసలు వృద్ధినే నమోదుచేసుకోకపోగా, 16 నుంచి 20 శాతం క్షీణత (మైనస్)లోకి జారిపోయే అవకాశం ఉందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా అంచనావేసింది. ఇక ఆర్థిక సంవత్సరం మొత్తంలో (2020 ఏప్రిల్–2021 మార్చి) మధ్య కూడా 2 శాతం వరకూ క్షీణరేటే నమోదయ్యే వీలుందని ఇక్రా పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా ఒకశాతంగానే ఉండడం గమనార్హం. వరుసగా మూడవ విడత లాక్‌డౌన్‌ను మే 17 వరకూ పొడిగించడం, తిరిగి ఆర్థిక క్రియాశీలతకు కొంతమేర సడలింపుల ప్రకటన నేపథ్యంలో ఇక్రా తాజా ప్రకటన చేసింది. ఆంక్షల సడలింపు ఆర్థిక వృద్ధి విషయంలో కొంత సానుకూలమైనదే అయినప్పటికీ, కార్మిక లభ్యతలో అసమతౌల్యతల వల్ల తయారీ, నిర్మాణం, వాణిజ్యం, హోటెల్స్, రవాణా రంగాలపై ప్రతికూలత కొనసాగే అవకాశం ఉందని ఇక్రా అభిప్రాయపడింది. -
నాల్గవ త్రైమాసికంలో వృద్ధి 7.4 శాతం: ఇక్రా
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2017–18 నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) 7.4 శాతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. మూడవ త్రైమాసికంలో 7.2 శాతంగా జీడీపీ వృద్ధి రేటు నమోదయ్యింది. రబీ పంట దిగుబడులు, కార్పొరేట్ ఆదాయాలు పెరిగే అవకాశాలు క్యూ4 ఫలితం మెరుగుదలకు కారణంగా పేర్కొంది. మే 31వ తేదీన నాల్గవ త్రైమాసికం జీడీపీ గణాంకాలతో పాటు 2017–18 ఆర్థిక సంవత్సరం జీడీపీ తొలి అంచనాలను అధికారికంగా కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేయనుంది. -
ఎన్బీఎఫ్సీ రిటైల్ క్రెడిట్లో భారీ వృద్ధి
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిటైల్ రుణాల్లో 17–19 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఈ వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. ఎన్బీఎఫ్సీ సంస్థల మొత్తం రిటైల్ రుణాల పరిమాణం 2017 డిసెంబర్ నాటికి రూ.7 లక్షల కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 18.3 శాతం అధికం. ‘‘వాణిజ్య వాహనాలు, అన్సెక్యూర్డ్ క్రెడిట్ (సూక్ష్మ రుణాలు), చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు ఇచ్చిన రుణాలు ఆరోగ్యకర స్థాయిలో పుంజుకోవడం వృద్ధికి కారణాలుగా పేర్కొంది. ఈ రుణాలు ఎన్బీఎఫ్సీ సంస్థల మొత్తం రుణాల్లో 60 శాతంగా ఉంటాయని ఇక్రా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఏఎం కార్తీక్ తెలిపారు. రుణాలకు వృద్ధి డీమోనిటైజేషన్ తర్వాత పడిపోయిన విషయాన్ని గుర్తు చేసింది. ఎన్బీఎఫ్సీ సంస్థలకు స్వయం ఉపాధిలో ఉన్నవారు, చిన్న వ్యాపారులు ప్రధాన కస్టమర్లు అన్న విషయం తెలిసిందే. -
ఎయిర్‌లైన్స్‌కు ఈ ఏడాది సూపర్!
ఇక్రా నివేదిక ముంబై: విమానయాన రంగానికి ప్రస్తుత ఆర్థిక సంత్సరం ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుంది. ముడిచమురు ధరలు పెరుగుతున్నా దేశీ విమానయాన సంస్థలు 2016–17 ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచటమే దీనిక్కారణం. ఈ ఏడాది విమాన ప్రయాణికుల్లో 22–23 శాతం వృద్ధి నమోదు కానున్నట్లు రేటింగ్ సంస్థ ‘ఇక్రా’ అంచనా వేసింది. ‘‘తక్కువ విమాన టికెట్ ధరల వల్ల ఎయిర్‌లైన్స్‌కు ప్రయాణికుల రద్దీ బాగుంది. కానీ ముడిచమురు ధరలు పెరుగుతుండటం వల్ల క్యూ4లో లాభదాయకతపై ప్రతికూల ప్రభావం ఉంటుంది’’ అని ఇక్రా నివేదిక పేర్కొంది. దీని ప్రకారం ఈ ఏడాది 10 నెలల్లో విమానయాన స్థితిగతులను ఒకసారి చూస్తే.. ⇔ ప్యాసెంజర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 84.4 శాతంగా నమోదయ్యింది. అంటే ప్రపంచంలోని పలు ప్రధాన మార్కెట్ల కన్నా మనం మంచి వృద్ధిని సాధిస్తున్నాం. ఈ ఏడాది జనవరిలో పీఎల్ఎఫ్ 88.3 శాతంగా ఉంది. ⇔ వార్షిక ప్రాతిపదికన విమాన ప్రయాణికుల వృద్ది 23.2 శాతంగా ఉంది. గత ఐదేళ్లుగా దేశీ విమాన ప్రయాణికుల వృద్ధి 12.9%, 5.3%, 4.6%, 15.5%, 22.1 శాతంగా నమోదవుతూ వచ్చింది. ఈ సారి వృద్ధి ఈ గణాంకాలను అధిగమించొచ్చు. అంటే ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతోన్న దేశీ మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించనుంది. కాగా జనవరిలో దేశీ విమాన ప్రయాణికుల వృద్ధి 25.3%, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల వృద్ధి 8.8 శాతంగా నమోదయ్యింది. -
లోటు 2,000 కోట్ల డాలర్లలోపే
• గత ఏడాది కంటే తక్కువ ఉండొచ్చు • క్యాడ్‌పై రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా ముంబై: భారత కరంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,000 కోట్ల డాలర్లలోపే ఉండొచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం కన్నా (2,200 కోట్ల డాలర్ల) తక్కువగానే ఉండగలదని పేర్కొంది. ఈ ఏడాది మిగిలిన కాలంలో పుత్తడికి ఉండే డిమాండ్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థబాగం క్యాడ్‌పై ప్రభావం చూపుతాయని వివరించింది. అంతర్జాతీయ పోకడలను పరిగణనలోకి తీసుకుంటే ఔన్స బంగారం 1,150-1,250 (ప్రస్తుతం 1,165 డాలర్లుగా ఉంది) డాలర్ల రేంజ్లో ఉండగలదని అంచనా వేస్తోంది. ఇక్రా వెల్లడించిన వివరాల ప్రకారం.., ⇔ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ కాలానికి పుత్తడి దిగుమతి బిల్లు అంతకు ముందటి ఆరు నెలల కంటే అధికంగా ఉండొచ్చు. ⇔ {పస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల క్యాడ్ కన్నా రెండో అర్థభాగం క్యాడ్ అధికంగా ఉండే అవకాశాలున్నారుు. ⇔ ఆదాయపన్ను చట్టానికి ఇటీవల చేసిన సవరణలు పుత్తడికి డిమాండ్‌ను తగ్గిస్తారుు. దీంతో రానున్న నెలల్లో పుత్తడి దిగుమతులు తగ్గవచ్చు. ⇔ ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ కాలానికి పుత్తడి దిగుమతులు నెలకు సగటున 45 టన్నులుగా ఉన్నారుు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకూ బంగారం దిగుమతులు ఇదే స్థారుులో ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరంట్ అకౌంట్ లోటు 1,500 కోట్ల డాలర్లలోపే ఉండొచ్చు. ⇔ గత ఏడాది ఏప్రిల్-అక్టోబర్ కాలానికి 2,310 కోట్ల డాలర్లుగా ఉన్న రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఈ ఏడాది ఇదే కాలానికి 2,640 కోట్ల డాలర్లకు పెరిగారుు. ⇔ పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, పెళ్లిళ్లు, పండగుల సీజన్ తదితర కారణాల వల్ల గత నెలలో పుత్తడి దిగుమతులు పెరిగారుు. ⇔ గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో 610 కోట్ల డాలర్లుగా ఉన్న కరంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 30 కోట్ల డాలర్లకు తగ్గింది. ⇔ గత క్యూ2లో 850 కోట్ల డాలర్లుగా ఉన్న క్యాడ్ ఈ క్యూ2లో సగానికి పైగా తగ్గి 250-350 కోట్ల డాలర్లకు తగ్గవచ్చు. -
తగ్గనున్న చక్కెర ఉత్పత్తి: ఇక్రా
11 శాతం మేర పడిపోతాయంటూ జోస్యం ముంబై: వర్షపాతం హెచ్చుతగ్గుల వల్ల చె రకు పంట దిగుబడి తక్కువగా వుండటంతో ఈ ఏడాది చక్కెర ఉత్పత్తి 11 శాతం మేర తగ్గనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈ సంవత్సరం 25.2 మిలియన్ టన్నుల లోటు ఉండొచ్చునని, ధరలు మాత్రం స్థిరంగా కొనసాగే వీలుందని పేర్కొంది. తద్వారా చ క్కెర ఎగుమతులపైన ప్రభావం చూపనుందని తెలిపింది. గత ఏడాది 9.5 మిలియన్ టన్నులు(ఎంటీ) ఎగుమతి కాగా ఇప్పుడు 7.6 ఎంటీలకు పడిపోయే ప్రమాదముందని చెప్పింది. స్టాక్ దిద్దుబాట్లు, తప్పనిసరి ఎగుమతులు, చెరకు పంట దిగుబడి పై సబ్సిడీ పుణ్యమా అని గత ఆగస్టు నుంచి చక్కెర ధరలుపెరిగాయని గుర్తు చేసింది. చెరకు పండించే ప్రధాన ప్రాంతాల్లో కరువు సంభవించటం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని వెల్లడించింది. చ క్కెర ధరలు అమాంతం పెరిగి 2016 మే నాటికి టన్నుకు రూ.34 వేలకు చేరుకుంది. గత ఏడాది ధరతో పోలిస్తే 50 శాతం పెరిగిందని సంస్థ సీనియర్ సీనియర్ ఉపాధ్యక్షులు సబ్యసాచి మజుందర్ తెలిపారు. -
సిమెంటుకు మంచి రోజులు
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన నిర్మాణ పనులు - 10 శాతం పెరిగిన ప్లాంట్ల వినియోగం - 2015-16లో పరిశ్రమ వృద్ధి 7 శాతం: ఇక్రా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు విక్రయాలు దేశవ్యాప్తంగా పుంజుకున్నాయి. మౌలిక రంగం, పెట్టుబడులతోపాటు మొత్తంగా ఎకానమీ రికవరీ ఇందుకు కారణమని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మార్కెట్లో స్తబ్దత తొలగిపోవడంతో నిర్మాణ రంగంలో కదలిక వచ్చిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ రియల్టీ రంగంలో కొత్త ప్రాజెక్టులు మొదలయ్యాయని చెబుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్ల వినియోగం 2014తో పోలిస్తే ప్రస్తుతం 10 శాతం పెరిగింది. ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టులు మొదలు కానున్నాయి కాబట్టి మంచి రోజులు రానున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా 2015-16లో దేశవ్యాప్తంగా సిమెంటు పరిశ్రమ 6.8-7 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ఇక్రా వెల్లడించింది. ప్రభుత్వ ప్రాజెక్టులతో.. తెలంగాణలోని సిమెంటు ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం సుమారు 2.9 కోట్ల టన్నులు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 3.6 కోట్ల టన్నులు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ 2014లో ప్లాంట్ల వినియోగం 40-50 శాతం మాత్రమే నమోదైంది. 2010-14 కాలంలో సంయుక్త రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా నిర్మాణ రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. అమ్మకాలు లేక సిమెంటు పరిశ్రమ నష్టాలను చవిచూసింది. సాధారణంగా ఎన్నికలకు ముందు ప్రభుత్వ సంబంధిత నిర్మాణ పనుల వల్ల సిమెంటుకు గిరాకీ పెరుగుతుంది. అయితే 2013-14లో ఆ తరహా పనులేవీ జరగలేదు. కాగా, ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా నిర్మాణ పనులు తిరిగి మొదలయ్యాయి. సిమెంటు ప్లాంట్ల వినియోగం 10 శాతం పెరిగి ఇప్పుడు మొత్తం సామర్థ్యంలో 45-55 శాతానికి చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పలు నిర్మాణ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపట్టేందుకు రెడీ అయ్యాయి. దీంతో సిమెంటుకు డిమాండ్ మరింత పెరగనుందని ప్రముఖ కంపెనీకి చెందిన ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో సిమెంటు వార్షిక వినియోగం 10 లక్షల టన్నులు అధికమవుతుందని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఇలా.. మహారాష్ట్రలో సిమెంటు ప్లాంట్ల వినియోగం 100 శాతం ఉంది. 2014లో 2.6 కోట్ల టన్నులు అమ్ముడైంది. 2015లో విక్రయాలు 2.8 కోట్ల టన్నులు ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. కర్ణాటకలో వినియోగం 1.5 కోట్ల టన్నుల నుంచి 1.6 కోట్ల టన్నులకు చేరనుంది. ఉత్తర, తూర్పు, పశ్చిమ భారత్‌లో ప్లాంట్ల వినియోగం 70-80 శాతం ఉందని కంపెనీలు చెబుతున్నాయి. గతేడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వినియోగం 1.7 కోట్ల టన్నులుంది. ఈ ఏడాది స్వల్ప వృద్ధి ఉంటుందని కంపెనీలు చెబుతున్నాయి. అలాగే ఈ రెండు రాష్ట్రాల నుంచి పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశాలకు సిమెంటు సరఫరా అవుతోంది. కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి నెలా 1-2 లక్షల టన్నుల సిమెంటు, క్లింకర్‌ను శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్‌కు ఎగుమతి చేస్తున్నాయి. ఇక్కడే ధర తక్కువ.. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లోనే సిమెంటు ధర తక్కువగా ఉందని కంపెనీలు వెల్లడించాయి. హైదరాబాద్‌లో 50 కిలోల బస్తా ధర వేరియంట్‌నుబట్టి ప్రస్తుతం రూ.320-355 మధ్య ఉంది. వైజాగ్‌లో ఇది రూ.340-370 పలుకుతోంది. తమిళనాడులో రూ.385-405, బెంగళూరులో రూ.380-410, కేరళలో రూ.400-430 మధ్య ఉంది. అయితే వడ్డీరేట్లు తగ్గితే నిర్మాణ రంగం గణనీయంగా పుంజుకుంటుందని ఒక ప్రముఖ కంపెనీ డెరైక్టర్ తెలిపారు. 2014-15లో దేశంలో సిమెంటు ఉత్పత్తి 5.6 శాతం పెరిగింది. అంత క్రితం కాలంలో ఇది 3 శాతమే.