ఎయిర్‌లైన్స్‌కు ఈ ఏడాది సూపర్!
ఇక్రా నివేదిక
ముంబై: విమానయాన రంగానికి ప్రస్తుత ఆర్థిక సంత్సరం ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుంది. ముడిచమురు ధరలు పెరుగుతున్నా దేశీ విమానయాన సంస్థలు 2016–17 ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచటమే దీనిక్కారణం. ఈ ఏడాది విమాన ప్రయాణికుల్లో 22–23 శాతం వృద్ధి నమోదు కానున్నట్లు రేటింగ్ సంస్థ ‘ఇక్రా’ అంచనా వేసింది. ‘‘తక్కువ విమాన టికెట్ ధరల వల్ల ఎయిర్‌లైన్స్‌కు ప్రయాణికుల రద్దీ బాగుంది. కానీ ముడిచమురు ధరలు పెరుగుతుండటం వల్ల క్యూ4లో లాభదాయకతపై ప్రతికూల ప్రభావం ఉంటుంది’’ అని ఇక్రా నివేదిక పేర్కొంది. దీని ప్రకారం ఈ ఏడాది 10 నెలల్లో విమానయాన స్థితిగతులను ఒకసారి చూస్తే..
⇔ ప్యాసెంజర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) 84.4 శాతంగా నమోదయ్యింది. అంటే ప్రపంచంలోని పలు ప్రధాన మార్కెట్ల కన్నా మనం మంచి వృద్ధిని సాధిస్తున్నాం. ఈ ఏడాది జనవరిలో పీఎల్‌ఎఫ్ 88.3 శాతంగా ఉంది.
⇔ వార్షిక ప్రాతిపదికన విమాన ప్రయాణికుల వృద్ది 23.2 శాతంగా ఉంది. గత ఐదేళ్లుగా దేశీ విమాన ప్రయాణికుల వృద్ధి 12.9%, 5.3%, 4.6%, 15.5%, 22.1 శాతంగా నమోదవుతూ వచ్చింది. ఈ సారి వృద్ధి ఈ గణాంకాలను అధిగమించొచ్చు. అంటే ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతోన్న దేశీ మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించనుంది. కాగా జనవరిలో దేశీ విమాన ప్రయాణికుల వృద్ధి 25.3%, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల వృద్ధి 8.8 శాతంగా నమోదయ్యింది.