న్యూఢిల్లీ: ప్రముఖ దేశీ ఫార్మా కంపెనీల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24)లో 7–9 శాతం మధ్య పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయ మార్కెట్ 8–10 శాతం మేర, అమెరికా మార్కెట్ 6–8 శాతం మేర విస్తరించడం ఆదాయ వృద్ధికి అనుకూలిస్తుందని పేర్కొంది. ఇక ఐరోపా మార్కెట్ల నుంచి ఆదాయం 3–5 శాతం వరకు, వర్ధమాన మార్కెట్ల నుంచి 8–10 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది.
25 దేశీ ఔషధ కంపెనీల గణాంకాలను ఇక్రా విశ్లేషించింది. దేశ ఫార్మా మార్కెట్‌లో ఈ కంపెనీల వాటా 60 శాతంగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) దేశీ ఫార్మా కంపెనీల ఆదాయాలు 10 శాతం మేర పెరగడం గమనార్హం. కాంప్లెక్స్ జనరిక్స్, స్పెషాలిటీ ఫార్ములేషన్లను యూఎస్ మార్కెట్లలో విడుదల చేయడంపై కంపెనీలు ప్రత్యేక దృష్టి సారించడం పరిశ్రమ మార్జిన్లకు అనుకూలిస్తుందని వివరించింది.
దేశ ఫార్మా కంపెనీల పరపతి ప్రొఫైల్ (రుణ స్థితిగతులు) ఆరోగ్యకరంగా ఉన్నట్టు తెలిపింది. ‘‘జాతీయ ముఖ్య ఔషధాల జాబితాలోని వాటి ధరలను టోకు ద్రవ్యోల్బణం ఆధారితంగా 12.1 శాతం పెంచడం, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, ముఖ్య ఔషధ జాబితాలో లేని వాటి ధరలను వార్షికంగా కంపెనీలు పెంచడం అనేవి దేశీ మార్కెట్లో 8–10 శాతం ఆదాయ వృద్ధికి మద్దతుగా నిలుస్తాయి’’అని ఇక్రా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మైత్రి మాచర్ల తెలిపారు.
యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీల రిస్క్.
యూఎస్ మార్కెట్లో వృద్ధి అనేది ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో 6–8 శాతం మధ్య ఉంటుందని ఇక్రా తెలిపింది. యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు ఇటీవల మళ్లీ పెరిగాయని, కనుక నియంత్రఫరమైన రిస్క్‌ను పర్యవేక్షించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఇటీవల కొన్ని ఫార్మా కంపెనీలపై సైబర్ దాడులను ప్రస్తావిస్తూ, ఇవి కార్యకలాపాలకు తాత్కాలిక అవరోధం కలిగించొచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా కంపెనీల మూలధన వ్యయాలు రూ.20,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment