న్యూఢిల్లీ: రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా దేశీ విమానయాన రంగం ఔట్‌లుక్‌ను స్థిరత్వానికి ఎగువముఖంగా సవరించింది. గతంలో ప్రకటించిన ప్రతికూల రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య(ట్రాఫిక్) వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ రంగం భవిష్యత్‌పట్ల ఆశావహంగా స్పందించింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో విమానయాన రంగం నష్టాల అంచనాలు రూ. 11,000 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లకు తగ్గించింది.
వచ్చే ఏడాది(2023–24)కి సైతం తొలుత వేసిన నష్టం రూ. 7,000 కోట్ల అంచనాలలోనూ రూ. 5,000 కోట్లకు కోత పెట్టింది. వచ్చే ఏడాదిలోనూ ప్రయాణికుల ట్రాఫిక్ కొనసాగనున్నట్లు తాజా నివేదికలో ఇక్రా అభిప్రాయపడింది. దీంతో విమానయాన కంపెనీలు టికెట్ ధరల నిర్ణయంలో మరింత శక్తివంతంగా వ్యవహరించేందుకు వీలు చిక్కగలదని పేర్కొంది. ఇది మెరుగుపడుతున్న ఈల్డ్స్ ద్వారా ప్రతిఫలిస్తున్నట్లు తెలియజేసింది. 2022 జూన్‌లో గరిష్టానికి చేరిన వైమానిక ఇంధన(ఏటీఎఫ్) ధరలు క్రమంగా తగ్గుతుండటం, విదేశీ మారక రేట్లు స్థిరంగా ఉండటం లాభదాయకతకు సహకరించనున్నట్లు అంచనా వేసింది.
8–13 శాతం వృద్ధి: ఏప్రిల్ నుంచి ప్రారంభంకానున్న వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీ ప్యాసింజర్ ట్రాఫిక్ 8–13 శాతం స్థాయిలో పురోగమించనున్నట్లు నివేదికలో ఇక్రా అభిప్రాయపడింది. ఈ ఏడాది 55–60 శాతం వృద్ధి తదుపరి వచ్చే ఏడాదిలో ప్రయాణికుల సంఖ్య 14.5–15 కోట్లకు చేరగలదని అంచనా వేసింది. కరోనా మహమ్మారికి ముందుస్థాయికంటే ఇది అధికంకావడం గమనార్హం!
దేశీ విమానయాన కంపెనీల ద్వారా విదేశీ ప్రయాణికుల సంఖ్య సైతం వృద్ధి బాటలో సాగుతున్నట్లు ఇక్రా పేర్కొంది. 2022 మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు తిరిగి మొదలుకావడంతో ఈ ఏడాది తొలి 9 నెలల్లో (ఏప్రిల్–డిసెంబర్) కోవిడ్–19 ముందుస్థాయికంటే కేవలం 2.4 శాతం తక్కువగా ఇంటర్నేషనల్ ట్రాఫిక్ నమోదైనట్లు వెల్లడించింది. వార్షికంగా చూస్తే దేశీ కంపెనీల అంతర్జాతీయ ట్రాఫిక్ 10–15 శాతం ఎగసినట్లు తెలియజేసింది. గతేడాది 125–130 వృద్ధి తదుపరి ఇది అధికమేనని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment