Domestic aviation sector
-
ప్రమోటర్లు తప్పుకోవడం లేదు
ముంబై: నష్టాల్లో కూరుకుపోతున్న విమానయాన సంస్థ గో ఫస్ట్ నుంచి ప్రమోటర్లు తప్పుకునే యోచనలో ఉన్నారన్న వార్తలను కంపెనీ వర్గాలు తోసిపుచ్చాయి. గో ఫస్ట్ తగిన భాగస్వాముల కోసం అన్వేషిస్తోందని, ప్రమోటర్లు నిష్క్రమించడం లేదని స్పష్టం చేశాయి. రాబోయే కొన్ని వారాల్లో రూ. 600 కోట్ల మేర నిధులను సమకూర్చుకునే అవకాశం ఉందని మేనేజ్మెంట్కు సన్నిహితంగా ఉండే వ్యక్తి తెలిపారు. ‘మేం మంచి భాగస్వామ్యాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. కానీ దానర్ధం మేము వ్యాపారాన్ని అమ్మేస్తున్నామని కాదు. దేశీ విమానయాన రంగం క్రమంగా మెరుగుపడుతోంది. దీంతో కొన్ని ఎయిర్‌లైన్స్, కొందరు వ్యాపారవేత్తలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలాంటి ప్రతిపాదన ఏదైనా వస్తే మేము పరిశీలించవచ్చు‘ అని ఆయన వివరించారు. 2022–23లో కంపెనీ రూ. 1,800 కోట్ల నష్టం నమోదు చేసిందని తెలిపారు. కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు ప్రమోటర్లు దాదాపు రూ. 300 కోట్లు సమకూరుస్తున్నారని, అత్యవసర రుణ హామీ పథకం కింద మరో రూ. 300 కోట్ల వరకూ బ్యాంకుల నుంచి రానున్నాయని.. మొత్తం మీద 3–4 వారాల్లో దాదాపు రూ. 600 కోట్లు రాగలవని పేర్కొన్నారు. వివిధ కారణాలతో 25 విమానాలు నిల్చిపోగా.. కంపెనీ ప్రస్తుతం 36–37 విమానాలను మాత్రమే నడుపుతోంది. చాలాకాలంగా 8–10 శాతంగా ఉంటున్న గో ఫస్ట్ మార్కెట్ వాటా తాజా పరిణామాలతో మార్చిలో 6.9 శాతం స్థాయికి పడిపోయింది. -
విమానయానం భవిష్యత్ సుస్థిరం
న్యూఢిల్లీ: రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా దేశీ విమానయాన రంగం ఔట్‌లుక్‌ను స్థిరత్వానికి ఎగువముఖంగా సవరించింది. గతంలో ప్రకటించిన ప్రతికూల రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య(ట్రాఫిక్) వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ రంగం భవిష్యత్‌పట్ల ఆశావహంగా స్పందించింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో విమానయాన రంగం నష్టాల అంచనాలు రూ. 11,000 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లకు తగ్గించింది. వచ్చే ఏడాది(2023–24)కి సైతం తొలుత వేసిన నష్టం రూ. 7,000 కోట్ల అంచనాలలోనూ రూ. 5,000 కోట్లకు కోత పెట్టింది. వచ్చే ఏడాదిలోనూ ప్రయాణికుల ట్రాఫిక్ కొనసాగనున్నట్లు తాజా నివేదికలో ఇక్రా అభిప్రాయపడింది. దీంతో విమానయాన కంపెనీలు టికెట్ ధరల నిర్ణయంలో మరింత శక్తివంతంగా వ్యవహరించేందుకు వీలు చిక్కగలదని పేర్కొంది. ఇది మెరుగుపడుతున్న ఈల్డ్స్ ద్వారా ప్రతిఫలిస్తున్నట్లు తెలియజేసింది. 2022 జూన్‌లో గరిష్టానికి చేరిన వైమానిక ఇంధన(ఏటీఎఫ్) ధరలు క్రమంగా తగ్గుతుండటం, విదేశీ మారక రేట్లు స్థిరంగా ఉండటం లాభదాయకతకు సహకరించనున్నట్లు అంచనా వేసింది. 8–13 శాతం వృద్ధి: ఏప్రిల్ నుంచి ప్రారంభంకానున్న వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీ ప్యాసింజర్ ట్రాఫిక్ 8–13 శాతం స్థాయిలో పురోగమించనున్నట్లు నివేదికలో ఇక్రా అభిప్రాయపడింది. ఈ ఏడాది 55–60 శాతం వృద్ధి తదుపరి వచ్చే ఏడాదిలో ప్రయాణికుల సంఖ్య 14.5–15 కోట్లకు చేరగలదని అంచనా వేసింది. కరోనా మహమ్మారికి ముందుస్థాయికంటే ఇది అధికంకావడం గమనార్హం! దేశీ విమానయాన కంపెనీల ద్వారా విదేశీ ప్రయాణికుల సంఖ్య సైతం వృద్ధి బాటలో సాగుతున్నట్లు ఇక్రా పేర్కొంది. 2022 మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు తిరిగి మొదలుకావడంతో ఈ ఏడాది తొలి 9 నెలల్లో (ఏప్రిల్–డిసెంబర్) కోవిడ్–19 ముందుస్థాయికంటే కేవలం 2.4 శాతం తక్కువగా ఇంటర్నేషనల్ ట్రాఫిక్ నమోదైనట్లు వెల్లడించింది. వార్షికంగా చూస్తే దేశీ కంపెనీల అంతర్జాతీయ ట్రాఫిక్ 10–15 శాతం ఎగసినట్లు తెలియజేసింది. గతేడాది 125–130 వృద్ధి తదుపరి ఇది అధికమేనని స్పష్టం చేసింది. -
ఎయిర్‌లైన్స్‌కు రూ. 17 వేల కోట్ల నష్టాలు
ముంబై: అధిక ఇంధన ధరలు, ఆర్థిక పరిస్థితిపై ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీ విమానయాన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులోనూ వాటి ఆర్థిక పనితీరుపై ఒత్తిడి కొనసాగనుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం .. దేశీయంగా ప్రయాణికుల ట్రాఫిక్ కోలుకుంటున్న తీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు భారీ స్థాయిలో ఉండటమనేది స్వల్పకాలికంగా, మధ్యకాలికంగా ఎయిర్‌లైన్స్ ఆదాయాలకు, లిక్విడిటీకి ప్రధాన ముప్పుగా కొనసాగనుంది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ అక్టోబర్‌లో దేశీ ప్రయాణికుల సంఖ్య 26 శాతం పెరిగి 90 లక్షల నుంచి 1.14 కోట్లకు చేరింది. అయినప్పటికీ కరోనా పూర్వం అక్టోబర్‌తో పోలిస్తే ఇది 8 శాతం తక్కువే. ఈ నేపథ్యంలో దేశీ ఏవియేషన్ పరిశ్రమకు ఇక్రా నెగటివ్ అవుట్‌లుక్ ఇచ్చింది. నివేదికలోని మరిన్ని ముఖ్య అంశాలు.. ► డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటమనేది ఎయిర్‌లైన్స్ వ్యయాల స్వరూపంపై గట్టి ప్రభావం చూపనుంది. రుణాల స్థాయిలు, లీజుల వ్యయాలు మొదలైన వాటి భారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,00,000 కోట్ల మేర ఉండవచ్చని అంచనా. ► మార్కెట్ వాటాను నిలబెట్టుకునేందుకు/పెంచుకునేందుకు ఎయిర్‌లైన్స్ ప్రయత్నాలు కొనసాగినా .. విమానయాన సంస్థలకు మార్జిన్లు పెంచుకునే సామర్థ్యాలు పరిమితంగానే ఉండనున్నాయి. ఇంధన ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటమే ఇందుకు కారణం. పరిశ్రమ ఆదాయాలు మెరుగుపడటానికి ఈ అంశాలు పెను సవాలుగా ఉండనున్నాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం అర్ధవంతమైన స్థాయిలోనే ఉంటుందనే అంచనాలున్నా, పరిశ్రమ ఆదాయాల రికవరీ నెమ్మదించవచ్చు. వ్యయాలు భారీ స్థాయిలో ఉంటున్నందున పరిశ్రమ నికరంగా రూ.15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది‘ అని ఇక్రా పేర్కొంది. అయితే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నికర నష్టాలు తక్కువగానే ఉండవచ్చని తెలిపింది. ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం, వడ్డీల భారం తగ్గడం (ఎయిరిండియా విక్రయానికి ముందు దాని రుణభారాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించడం) వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. ► విమానాల విడిభాగాలు, ఇంజిన్ల సరఫరాలో జాప్యం జరుగుతుండటం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనితో కొన్ని దేశీ ఎయిర్‌లైన్స్ పలు విమానాలను నిలిపివేయాల్సి వస్తోంది. సరఫరాపరమైన సమస్యల పరిష్కారం కోసం తయారీ కంపెనీలతో ఎయిర్‌లైన్స్ చర్చలు జరుపుతున్నాయి. డిమాండ్‌కి అనుగుణంగా ఫ్లయిట్ సర్వీసులను పెంచుకునేందుకు విమానాలను వెట్ లీజింగ్‌కు (విమానంతో పాటు సిబ్బందిని కూడా లీజుకు తీసుకోవడం) తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. -
పుంజుకుంటున్న దేశీయ విమానయానం
ముంబై: దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ ఏడాది నవంబర్‌లో పాసింజర్స్ సంఖ్య 62 లక్షలకు చేరింది. క్రితం నెలతో పోలిస్తే ఇది 19 శాతం వృద్ధి అని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. అయితే వార్షిక ప్రయాణీకుల పరిమాణంతో పోలిస్తే మాత్రం ఇది 52 శాతం క్షీణతని పేర్కొంది. లాక్‌డాన్ నేపథ్యంలో రెండు నెలల విరామం అనంతరం మేలో 416 దేశీయ విమాన సర్వీస్‌లతో పునఃప్రారంభం కాగా.. ప్రస్తుతం విమానాల సంఖ్య 2,065కు పెరిగింది. నవంబర్‌లో సగటున రోజుకు 1,806 డిపార్చర్స్ జరుగుతున్నాయని.. గతేడాది ఇదే సమయంలో డిపార్చర్స్ 3,080గా ఉన్నాయి. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో మాత్రం డిపార్చర్స్ సంఖ్య 1,574గా ఉంది. ఈ ఏడాది నవంబర్‌లో ఒక్కో విమానంలో సగటున ప్రయాణీకుల సంఖ్య 115గా ఉంది. గతేడాది ఇది 140గా ఉంది. ఇక అంతర్జాతీయ విమాన ప్రయాణీల డిమాండ్‌ను చూస్తే.. ఈ ఏడాది నవంబర్‌లో 83 శాతం క్షీణతతో 3.6 లక్షలకు చేరింది. అంతర్జాతీయ విమాన సర్వీస్‌ల షెడ్యూల్స్ రద్దు ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ప్రస్తుతం వందే భారత్ మిషన్, ఎయిర్ బబుల్ ఒప్పందాల వంటి ప్రత్యేక ఏర్పాట్ల కింద విదేశీ మార్గాల్లో విమాన సర్వీస్‌లు నడుస్తున్న విషయం తెలిసిందే. అనేక దేశాల్లో దీర్ఘకాలం ఉత్పాదక కార్యకలాపాలు నిలుపుదల చేయడం, ప్రపంచ ఆర్ధిక కార్యకలాపాలపై కోవిడ్–19 వైరస్ ప్రభావం వంటి కారణాలతో ముడి చమురు ధరల ప్రభావం చూపించిందని.. దీంతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు నవంబర్‌లో 4.6 శాతం, డిసెంబర్లో 9.1 శాతం పెరిగాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కింజల్ షా తెలిపారు. ప్రయాణికులకు రూ.3,200 కోట్ల వాపసు లాక్డౌన్ కారణంగా విమానాల రద్దుతో చెల్లింపులు న్యూఢిల్లీ: ఎయిర్‌లైన్ సంస్థలు ప్రయాణికులకు రూ.3,200 కోట్ల మేర చెల్లింపులు చేశాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం ఈ ఏడాది మార్చి చివరి వారంలో కేంద్రం లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సుమారు రెండు నెలల పాటు విమానాలు కదల్లేదు. దీంతో ఆయా రోజుల్లో ప్రయాణాల కోసం ముందుగానే ఫ్లయిట్ టికెట్లను బుక్ చేసుకున్న వారు ప్రయాణించలేకపోయారు. దీంతో మార్చి 25 నుంచి మే 24 మధ్య రద్దయిన విమానాలకు సంబంధించి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తక్షణమే, పూర్తి డబ్బును వాపసు చేయాలంటూ అక్టోబర్ 1న సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం ప్రయాణికుల్లో 74.3 శాతం మందికి (55,23,940 పీఎన్ఆర్లు) రూ.3,200 కోట్లను తిరిగి చెల్లించేసినట్టు, మిగిలిన వారికి చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోందని పౌర విమానయాన శాఖా శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. -
విమాన సేవలు ప్రారంభం.. కీలక విషయాలు
న్యూఢిల్లీ : కరోనా కారణంగా భారత్‌లో నిలిచిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఈనెల 25 నుంచి దేశీయ విమానాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విమాన టికెట్లను ధరలను నియంత్రిస్తున్నామని పౌర, విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు. 40 శాతం టికెట్లు మధ్య రకంగా రూ. 6,750 కే అమ్ముకోవాలని, టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేవలం మూడో వంతు విమానాలు మాత్రమే నడుస్తాయని, మధ్య సీటును ఖాళీగా ఉంచమని స్పష్టం చేశారు. దీనివల్ల సోషల్ డిస్టెన్స్ పూర్తికాదని, ప్రతి ప్రయాణానికి ముందు విమానాన్ని పూర్తిస్థాయిలో డిస్ ఇన్ఫెక్షన్ చేస్తామని పేర్కొన్నారు. మధ్య సీటు ఖాళీగా ఉంచితే 33 శాతం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని, అందుకే విమానంలోని అన్ని సీట్లకు టికెట్లు అమ్ముతామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా కూడా మధ్య సీటు ఖాళీగా ఉంచరని మంత్రి అన్నారు. (దేశీయ విమానయానం: పాటించాల్సిన నిబంధనలు ఇవే!) చైనా నుంచి విమానాల రాకపోకలను తొలుత భారత్‌యే ఆపేసిందని కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు. జీవితం, జీవనోపాధి మధ్య సమన్వయం ఉండాలని. చాలా కాలం విమానాలను నడపకుండా ఉండలేమనన్నారు. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసుల రాకపోకలను సమీక్షిస్తున్నామని, ఏవైనా సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అధిగమిస్తామని పేర్కొన్నారు. పరిస్థితులు మెరుగైన కొద్దీ విమాన సర్వీసుల సంఖ్యను పెంచుతామన్నారు. విమాన సర్వీసులు నడిపే అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రులతో కూడా చర్చించామని తెలిపారు. (25 నుంచి దేశీయ విమానయానం) వందే భారత్ మిషన్ కింద విదేశాలలో ఉన్న భారతీయులందరిని తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. వందే భారత్ ద్వారా ఇప్పటికే 20 వేల మంది ప్రయాణికులను తీసుకువచ్చామని, ఇక నుంచి ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా ఈ మిషన్ లో భాగస్వామ్యం అవుతాయని పేర్కొన్నారు. ఫేస్ మాస్కులు, బ్లౌజు, ఫేస్ షీల్డ్‌లు ఇచ్చామని ఇచ్చామన్నారు. మొత్తం విమానయాన సర్వీసులలో 1/3 వంతు సోమవారం (25 మే)నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు. కేవలం వెబ్ చెక్ ఇన్ సౌకర్యం మాత్రమే ఉంటుందని, ఒక చెక్ ఇన్ బ్యాగేజికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. (ఉంపన్: నీట మునిగిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు ) విమానాలలో ప్రయాణించే వారికి ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి అని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. విమానాలలో భోజన సౌకర్యం ఉండదని, రెండు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు మాత్రమే వసూలు చేయాలని పేర్కొన్నారు. విమానాలు నడిచే మార్గాలను, ప్రయాణానికి పట్టే సమయాన్ని బట్టి ఏడు భాగాలుగా విభజించినట్లు మంత్రి తెలిపారు. (బిగ్‌బాస్ కంటెస్టెంట్ తండ్రిపై అత్యాచారం కేసు) ► రూట్ 1: 40 నిమిషాలలోపు ప్రయాణం ► రూట్ 2: 40 నుండి 70 నిమిషాలలోపు ► రూట్ 3 : 70 నుండి 90 నిమిషాలు వరకు ► రూట్ 4: 90 నుండి 120 నిమిషాల వరకు ► రూట్ 5: 120 నుండి 150 నిమిషాల వరకు ► రూట్ 6: 150 నుండి 180 నిమిషా వరకు ► రూట్ 7: 180 నిమిషాల పైన ⇒ దేశ రాజధానికి వివిధ ప్రాంతాల నుంచి కనిష్ట ధర 3.5 వేలు, గరిష్ట ధర 10 వేలు. ⇒ ఢిల్లీ - ముంబాయి కనిష్ట ధర 3.5 వేలు, గరిష్ట ధర 10 వేలు ⇒ విమానాలలో 40 శాతం టికెట్ లను సరాసరి ధరలకు అమ్మాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆదేశించారు. -
ఎయిర్‌పోర్టుల్లో పాటించాల్సిన నిబంధనలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా రద్దయిన దేశీయ ప్రయాణికుల విమాన సర్వీసులు సరిగ్గా రెండునెలల తర్వాత తిరిగి ప్రారంభం కానున్నాయి. లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో మే 25 నుంచి ఆయా సర్వీసులు మళ్లీ మొదలవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ ట్విటర్ ద్వారా తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో రాకపోకల విషయంలో ప్రయాణికులు పాటించాల్సిన విధివిధానాలను ప్రభుత్వం గురువారం జారీ చేసింది.(25 నుంచి దేశీయ విమానయానం) ఎయిర్‌పోర్టులు, విమానాల్లో పాటించాల్సిన నిబంధనలు ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. ఆరోగ్య సేతు యాప్ ప్రతీ ఒక్కరూ విధిగా డౌన్లోడ్ చేసుకోవాలి(14 ఏళ్ల లోపు పిల్లలు ఇందుకు మినహాయింపు). లేనిపక్షంలో వారిని లోపలికి అనుమతించరు. రెండు గంటలకు ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విమాన ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజా రవాణా, ప్రైవేటు టాక్సీలను అందుబాటులో ఉంచాలి. ప్రయాణీకులు, సిబ్బంది బయటకు వెళ్లేందుకు వ్యక్తిగత, ఎంపిక చేసిన క్యాబ్ సర్వీసులకు మాత్రమే అనుమతి ప్రయాణీకులంతా తప్పనిసరిగా మాస్కులు, గ్లోవ్స్ ధరించాలి సీటింగ్ విషయంలో భౌతిక నిబంధనలు తప్పక పాటించాలి.(మార్కింగ్‌ను అనుసరించి) సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాలి. శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలి. అరైవల్, డిపార్చర్ సెక్షన్ల వద్ద ట్రాలీలకు అనుమతి లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో రసాయనాల పిచికారీ అనంతరం మాత్రమే వాటిని వాడాల్సి ఉంటుంది ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించే ముందే బ్యాగేజీని శానిటైజ్ చేసేందుకు ఆపరేటర్లు ఏర్పాట్లు చేయాలి. గుంపులు గుంపులుగా లోపలకు రావడం నిషిద్ధం ప్రవేశ ద్వారాలు, స్క్రీనింగ్ జోన్లు, టెర్మినల్స్ వద్ద కనీసం మీటరు దూరం పాటించాలి ప్రవేశద్వారాల వద్ద బ్లీచులో నానబెట్టిన మ్యాట్లు, కార్పెట్లు పరచాలి. కౌంటర్ల వద్ద ఫేస్‌షీల్డులు లేదా ప్లెక్సీగ్లాసు ఉపయోగించాలి. లాంజ్‌లు, టర్మినల్ బిల్డింగుల వద్ద న్యూస్ పేపర్లు, మ్యాగజీన్లు అందుబాటులో ఉండవు జ్వరం, శ్వాసకోశ సమస్యలు, దగ్గుతో బాధపడుతున్న ఉద్యోగులను ఎయిర్‌పోర్టులోకి అనుమతించరు. విమానం దిగిన తర్వాత బ్యాచ్‌ల వారీగా క్రమపద్ధతిని అనుసరించి ప్రయాణీకులు ఎయిర్‌పోర్టులోపలికి వెళ్లాలి. -
25 నుంచి దేశీయ విమానయానం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 25వ తేదీ నుంచి రద్దయిన దేశీయ ప్రయాణికుల విమాన సర్వీసులు సరిగ్గా రెండునెలల తర్వాత పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 25వ తేదీ(సోమవారం) నుంచి ఆయా సర్వీసులు మళ్లీ మొదలవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. కార్యకలాపాలు సాగించేందుకు సన్నద్ధం కావాలని అన్ని ఎయిర్‌పోర్టులకు, విమానయాన సంస్థలకు సమాచారం ఇచ్చామని తెలిపారు.(నేటి నుంచే రైల్వే బుకింగ్స్) ప్రయాణికుల రాకపోకల విషయంలో పాటించాల్సిన విధివిధానాలను పౌర విమానయాన శాఖ జారీ చేస్తుందని వివరించారు. అయితే, అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో మంత్రి ప్రకటించలేదు. దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించాలన్న కేంద్ర సర్కారు నిర్ణయాన్ని స్పైస్‌జెట్ సంస్థ చైర్మన్, ఎండీ అజయ్‌సింగ్ స్వాగతించారు. దీనివల్ల ఆర్థిక రంగానికి ఊపు వస్తుందని అభిప్రాయపడ్డారు. విధివిధానాల కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు.(కొత్త కేసులు 5,611) విమానయాన రంగంలో కరోనా కుదుపు కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా కీలక రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. భారత్‌లోనూ ఈ రంగం కుదేలైంది. చాలా సంస్థలు పైలట్లను విధుల నుంచి తొలగించాయి. సిబ్బంది జీతాల్లో కోత విధించాయి. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను సెలవుపై పంపాయి. సెలవు కాలంలో జీతాలిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. ఇప్పుడు దేశీయ ప్రయాణికుల సర్వీసులను పునఃప్రారంభించడం వల్ల విమానయాన రంగం కొంత కుదుట పడేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
కరోనాతో ఏవియేషన్ కుదేలు..
ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి పరిణామాలతో దేశీ విమానయాన రంగం కుదేలవుతోంది. లాక్డౌన్ దెబ్బతో దాదాపు రెండు వారాలుగా ఫ్లయిట్లు నిల్చిపోగా, ఇప్పట్లో విమాన సర్వీసులు ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మార్చి, జూన్ త్రైమాసికాల్లో అన్ని ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థల నష్టాలు సుమారు రూ. 5,800–6,500 కోట్ల దాకా ఉంటాయని అంచనా. మే, జూన్, జూలైల్లో దేశీయంగా ప్రయాణాలకు సంబంధించిన బుకింగ్స్ వార్షిక ప్రాతిపదికన చూస్తే 80 శాతం పడిపోయాయి. దీంతో ఎయిర్‌లైన్స్‌కు నిధులపరమైన సమస్యలు మరింత తీవ్రం కానున్నాయి. వ్యయాల భారం.. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా పలు ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం, వేతనాలు కుదించడం వంటి చర్యలు తీసుకున్నాయని కోటక్ ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీస్ వర్గాలు తెలిపాయి. అయితే, లీజుకి సంబంధించిన అద్దెల చెల్లింపులు, ఇతరత్రా కార్పొరేట్ ఖర్చులు మొదలైన ఫిక్స్డ్ వ్యయాలు తప్పనిసరిగా ఉంటాయని పేర్కొన్నాయి. వచ్చే మూడు నెలల్లో ఇండిగో స్థిర వ్యయాలు రూ. 2,400–4,500 కోట్ల మేర ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, దేశీయంగా అతి పెద్ద విమానయాన సంస్థగా ఎదిగిన ఇండిగోకి ఇది మరీ సమస్యాత్మకం కాకపోవచ్చన్న అభిప్రాయం ఉంది. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి ఇండిగో వద్ద మిగులు నిధులు రూ. 9,412 కోట్లుగా ఉండటమే ఇందుకు కారణం. వీటి ఊతంతో ఇండిగో ఆరు నెలల నుంచి ఏడాది దాకా నిలబడగలదని అంచనా. అయితే, మరో ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్ దగ్గర చెప్పుకోతగ్గ స్థాయిలో మిగులు నిధులు లేవు. మార్చి ఆఖరు నాటికి స్పైస్‌జెట్ చేతిలో ఉన్నది సుమారు రూ. 86 కోట్లే. మూడు నెలల పాటు నిలదొక్కుకోవాలంటే స్పైస్‌జెట్‌కు సుమారు రూ. 1,350 – 1,500 కోట్ల దాకా అవసరమవుతుంది. అటు వచ్చే మూడు నెలల్లో గోఎయిర్ స్థిర వ్యయాలు దాదాపు రూ. 500–750 కోట్లుగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. -
దూసుకుపోతున్న దేశీ విమానయానం
♦ 2015లో భారత్‌లో వేగవంతమైన వృద్ధి ♦ దేశీ ప్రయాణికుల్లో 18.8% పెరుగుదల ♦ మార్కెట్ పరంగా ప్రపంచంలో మూడో స్థానం: ఐఏటీఏ న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగానికి మంచి రోజులొచ్చాయి. 2015వ సంవత్సరంలో దేశీయంగా విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య 18.8 శాతం వృద్ధి చెందింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిన మార్కెట్‌గా భారత్ నిలిచింది. చైనా, అమెరికాల తర్వాత ప్రపంచంలో ప్రయాణికుల సంఖ్య పరంగా భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. 2015లో విమానయాన రంగం వృద్ధిపై ఐఏటీఏ మరిన్ని వివరాలు వెల్లడించింది. ♦ 2015లో ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌లైన్స్ సంస్థలు షెడ్యూల్డ్ సర్వీసుల ద్వారా 360 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చా యి. 2014లో ప్రయాణించిన వారితో పోల్చి చూ స్తే 7.2% పెరుగుదల కనిపిస్తోంది. అలాగే ఆరు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన 5.22 కోట్ల టన్నుల వస్తువులను కూడా రవాణా చేశాయి. ♦ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 2015లో దేశీయ విమాన ప్రయాణికుల పరంగా భారత్ అత్యంత వేగవంతంగా వృద్ధి చెందిన మార్కెట్. వార్షిక వృద్ధి 18.8 శాతంగా ఉంది. దేశీయ విమానయాన మార్కెట్లో ప్రయాణికులు 8 కోట్ల మంది ఉన్నారు. ♦ భారత్ తర్వాత దేశీయ ప్రయాణికుల వృద్ధి పరంగా 11.9 శాతంతో రష్యా రెండో స్థానంలో ఉంది. ఇక్కడి విమాన ప్రయాణికుల మార్కెట్ 4.7 కోట్ల మందితో ఉంది. ♦ వృద్ధి పరంగా రష్యా తర్వాత చైనా మూడో స్థానా న్ని సొంతం చేసుకుంది. చైనాలో విమాన ప్రయాణికుల్లో వృద్ధి 9.7% ఉంది. ఇక్కడ దేశీయ విమాన ప్రయాణికులు 39.4 కోట్ల మంది ఉన్నారు. ♦ అమెరికా దేశీయ విమానయాన ప్రయాణికుల్లో వృద్ధి 5.4 శాతం నమోదైంది. ఇక్కడ 70.8 కోట్ల మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. -
హైదరాబాద్‌లో ప్రాట్ అండ్ విట్నీ శిక్షణ కేంద్రం
అమెరికా, చైనా కేంద్రాల తర్వాత ఇది మూడోది - ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ - ఇండియా నుంచి 600 విమాన ఇంజిన్ల ఆర్డరు : ప్రాట్ అండ్ విట్నీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన రంగంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు అంతర్జాతీయ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ ప్రకటించింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 7,000 విమాన ఇంజిన్లకు ఆర్డర్లు రాగా అందులో కేవలం 600 ఇండియా నుంచే వచ్చినట్లు ప్రాట్ అండ్ విట్నీ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్ ఇంజిన్స్ -ఏషియా పసిఫిక్) మేరీ ఎల్లెన్ ఎస్ జోన్స్ తెలిపారు. మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరగడం, ఇంధన ధరలు తగ్గడంతో దేశీయ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, ఇండిగో, గోఎయిర్, ఎయిర్కోస్టా వంటి దేశీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు రావడమే దీనికి నిదర్శనమన్నారు. అంతకుముందు ప్రాట్ అండ్ విట్నీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వినియోగదారుల (ఇంజిన్లు ఉపయోగించే ఎయిర్‌లైన్స్ కంపెనీల సిబ్బంది) శిక్షణ కేంద్రాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అమెరికా, చైనా తర్వాత ఇది మూడవ కేంద్రమని, ఈ కేంద్రంలో జీటీఎఫ్, వీ2500 ఇంజిన్లపై వినియోగదారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కేంద్రంలో 2,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వవచ్చని, దీన్ని త్వరలోనే 4,000 మందికి విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ సంస్థలో 1500 మంది పనిచేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పరిశీలన దశలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు దేశీయ విమానయాన రంగాన్ని ప్రోత్సహించే విధంగా కొత్త విమానయాన విధానం ఉంటుందని అశోక్ గజపతి రాజు తెలిపారు. ఇప్పటికే ఉన్న సంస్థలతో పాటు కొత్త సంస్థలను ప్రోత్సహించే విధంగా ఈ పాలసీ ఉంటుందన్నారు. 5/20 నిబంధనను రద్దు చేయాలన్న ఆలోచనపై చెలరేగుతున్న వివాదంపై స్పందిస్తూ... పరిశ్రమ వృద్ధిని నియంత్రించే చర్యలను తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తానన్నారు. ఐదేళ్లు దేశీయంగా విమానాలు నడిపి, కనీసం విమానాల సంఖ్య 20 వున్న సంస్థలకే విదేశీ సర్వీసులు నిర్వహించేందుకు అనుమతివ్వడానికి నిర్దేశించిన నిబంధనను 5/20గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం పౌర విమానయానరంగంలో వృద్ధి బాగానే ఉందని, సరుకు రవాణాలో కూడా వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నం సమీపంలో నిర్మించతలపెట్టిన భోగాపురం ఎయిర్‌పోర్టు ఇంకా పరిశీలన దశలోనే ఉందని, దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు.