ముంబై: నష్టాల్లో కూరుకుపోతున్న విమానయాన సంస్థ గో ఫస్ట్ నుంచి ప్రమోటర్లు తప్పుకునే యోచనలో ఉన్నారన్న వార్తలను కంపెనీ వర్గాలు తోసిపుచ్చాయి. గో ఫస్ట్ తగిన భాగస్వాముల కోసం అన్వేషిస్తోందని, ప్రమోటర్లు నిష్క్రమించడం లేదని స్పష్టం చేశాయి. రాబోయే కొన్ని వారాల్లో రూ. 600 కోట్ల మేర నిధులను సమకూర్చుకునే అవకాశం ఉందని మేనేజ్‌మెంట్‌కు సన్నిహితంగా ఉండే వ్యక్తి తెలిపారు. ‘మేం మంచి భాగస్వామ్యాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. కానీ దానర్ధం మేము వ్యాపారాన్ని అమ్మేస్తున్నామని కాదు. దేశీ విమానయాన రంగం క్రమంగా మెరుగుపడుతోంది.
దీంతో కొన్ని ఎయిర్‌లైన్స్, కొందరు వ్యాపారవేత్తలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలాంటి ప్రతిపాదన ఏదైనా వస్తే మేము పరిశీలించవచ్చు‘ అని ఆయన వివరించారు. 2022–23లో కంపెనీ రూ. 1,800 కోట్ల నష్టం నమోదు చేసిందని తెలిపారు. కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు ప్రమోటర్లు దాదాపు రూ. 300 కోట్లు సమకూరుస్తున్నారని, అత్యవసర రుణ హామీ పథకం కింద మరో రూ. 300 కోట్ల వరకూ బ్యాంకుల నుంచి రానున్నాయని.. మొత్తం మీద 3–4 వారాల్లో దాదాపు రూ. 600 కోట్లు రాగలవని పేర్కొన్నారు. వివిధ కారణాలతో 25 విమానాలు నిల్చిపోగా.. కంపెనీ ప్రస్తుతం 36–37 విమానాలను మాత్రమే నడుపుతోంది. చాలాకాలంగా 8–10 శాతంగా ఉంటున్న గో ఫస్ట్ మార్కెట్ వాటా తాజా పరిణామాలతో మార్చిలో 6.9 శాతం స్థాయికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment