partnerships
-
గ్రీన్ హైడ్రోజన్‌కు అదానీ జేవీ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా జపాన్ దిగ్గజం కోవా గ్రూప్‌తో చేతులు కలిపింది. సమాన వాటా(50:50)తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసింది. తద్వారా జపాన్, తైవాన్, హవాయ్ మార్కెట్లలో గ్రీన్ హైడ్రోజన్ విక్రయాలను చేపట్టనుంది. రానున్న దశాబ్ద కాలంలో దేశీయంగా సమీకృత గ్రీన్ హైడ్రోజన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే 50 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు ప్రకటించింది. దీనిలో భాగంగా తొలి దశలో మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తెరతీయనుంది. తదుపరి దశలో సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నులకు పెంచనుంది. ఈ బాటలో తాజాగా సింగపూర్ అనుబంధ సంస్థ ద్వారా కోవా హోల్డింగ్స్ ఏషియా పీటీఈతో జేవీని నెలకొలి్పంది. వెరసి గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్, వీటి డెరివేటివ్ అమ్మకాలు, మార్కెటింగ్ చేపట్టనుంది. శుద్ధ ఇంధన తయారీకి హైడ్రోజన్ ఉపయోగపడనుంది. ప్రధానంగా రిఫైనింగ్, కెమికల్ రంగాలలో వినియోగిస్తారు. అదానీ ఇప్పటికే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కంపెనీగా ఆవిర్భవించింది. గుజరాత్, ముంద్రా సెజ్‌లోని సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాలను వార్షికంగా 10 గిగావాట్లకు పెంచుకునే ప్రణాళికల్లో ఉంది. ఇక్కడ మెటలర్జికల్ గ్రేడ్(ఎంజీ) సిలికాన్, పాలీసిలికాన్, ఇన్గాట్స్, వేఫర్స్, సెల్స్ తదితరాలను రూపొందించేందుకు వీలుంది. వీటిని సౌర ఇంధనం ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టే ప్రక్రియలో వినియోగిస్తారు. -
ప్రమోటర్లు తప్పుకోవడం లేదు
ముంబై: నష్టాల్లో కూరుకుపోతున్న విమానయాన సంస్థ గో ఫస్ట్ నుంచి ప్రమోటర్లు తప్పుకునే యోచనలో ఉన్నారన్న వార్తలను కంపెనీ వర్గాలు తోసిపుచ్చాయి. గో ఫస్ట్ తగిన భాగస్వాముల కోసం అన్వేషిస్తోందని, ప్రమోటర్లు నిష్క్రమించడం లేదని స్పష్టం చేశాయి. రాబోయే కొన్ని వారాల్లో రూ. 600 కోట్ల మేర నిధులను సమకూర్చుకునే అవకాశం ఉందని మేనేజ్మెంట్కు సన్నిహితంగా ఉండే వ్యక్తి తెలిపారు. ‘మేం మంచి భాగస్వామ్యాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. కానీ దానర్ధం మేము వ్యాపారాన్ని అమ్మేస్తున్నామని కాదు. దేశీ విమానయాన రంగం క్రమంగా మెరుగుపడుతోంది. దీంతో కొన్ని ఎయిర్‌లైన్స్, కొందరు వ్యాపారవేత్తలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలాంటి ప్రతిపాదన ఏదైనా వస్తే మేము పరిశీలించవచ్చు‘ అని ఆయన వివరించారు. 2022–23లో కంపెనీ రూ. 1,800 కోట్ల నష్టం నమోదు చేసిందని తెలిపారు. కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు ప్రమోటర్లు దాదాపు రూ. 300 కోట్లు సమకూరుస్తున్నారని, అత్యవసర రుణ హామీ పథకం కింద మరో రూ. 300 కోట్ల వరకూ బ్యాంకుల నుంచి రానున్నాయని.. మొత్తం మీద 3–4 వారాల్లో దాదాపు రూ. 600 కోట్లు రాగలవని పేర్కొన్నారు. వివిధ కారణాలతో 25 విమానాలు నిల్చిపోగా.. కంపెనీ ప్రస్తుతం 36–37 విమానాలను మాత్రమే నడుపుతోంది. చాలాకాలంగా 8–10 శాతంగా ఉంటున్న గో ఫస్ట్ మార్కెట్ వాటా తాజా పరిణామాలతో మార్చిలో 6.9 శాతం స్థాయికి పడిపోయింది. -
చార్జ్‌నెట్ రూ.70 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ వసతుల కంపెనీ చార్జ్‌నెట్.. ఈవీ సొల్యూషన్స్ కంపెనీ బైక్‌వోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 50,000లకు పైగా చార్జింగ్, స్వాపింగ్ కేంద్రాలను ఏడాదిలో ఏర్పాటు చేస్తారు. విస్తరణకు రూ.70 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు చార్జ్‌నెట్ కో–ఫౌండర్ చక్రవర్తి అంబటి తెలిపారు. ‘చార్జింగ్ ఉపకరణాలను హైదరాబాద్‌లో తయారు చేస్తున్నాం. ప్లాంటు సామర్థ్యం నెలకు 20,000 యూనిట్లు. దీనిని 18 నెలల్లో రెండింతలకు పెంచుతాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 200లకుపైగా చార్జింగ్ స్టేషన్స్ అందుబాటులోకి తెచ్చాం’ అని వివరించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలతోసహా వన్‌స్టాప్ సొల్యూషన్స్ అందిస్తున్నట్టు బైక్‌వో కో–ఫౌండర్ విద్యాసాగర్ రెడ్డి చెప్పారు. చదవండి: వేలకోట్ల నష్టం..జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ కీలక నిర్ణయం! -
ఎయిర్టెల్, టెక్ మహీంద్రా జట్టు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్, ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా చేతులు కలిపాయి. 5జీ, ప్రైవేట్ నెట్‌వర్క్‌లు, క్లౌడ్ వంటి విభాగాల్లో కంపెనీలకు అవసరమయ్యే డిజిటల్ సొల్యూషన్స్‌ను సంయుక్తంగా అభివృద్ధి, మార్కెటింగ్ చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్టెల్ ఇప్పటికే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. అటు టెక్ మహీంద్రా 5జీ సర్వీసులకు సంబంధించిన అప్లికేషన్స్, ప్లాట్‌ఫామ్‌లను రూపొందించింది. ఒప్పందం ప్రకారం భారత్, అంతర్జాతీయ మార్కెట్లలో 5జీ సేవలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు ఇరు సంస్థలు సంయుక్తంగా ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తాయి. -
భారత నేవీకి ఎలక్ట్రిక్ యుద్ధ నౌకలు అందిస్తాం: రోల్స్‌రాయిస్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ యుద్ధనౌకలను అభివృద్ధి చేయడానికి సంబంధించి భారత నౌకాదళంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై ఏరో ఇంజిన్స్ తదితర ఉత్పత్తుల తయారీ దిగ్గజం రోల్స్–రాయిస్ ఆసక్తి వ్యక్తం చేసింది. భారత నేవీకి యుద్ధ నౌకలు మొదలైన వాటిని ఆధునికీకరించేందుకు అపార అనుభవం తమకుందని కంపెనీ నేవల్ సిస్టమ్స్ విభాగం చీఫ్ రిచర్డ్ పార్ట్రిడ్జ్ తెలిపారు. నౌకలను హైబ్రిడ్ ఎలక్ట్రిక్, పూర్తి ఎలక్ట్రిక్ విధానంలో నడిపించేందుకు అవసరమైన ఉత్పత్తులను తాము అందించగలమని వివరించారు. బ్రిటన్ నేవీ కోసం ప్రపంచంలోనే తొలి హైబ్రిడ్–ఎలక్ట్రిక్ నేవల్ సిస్టమ్ డిజైనింగ్ నుంచి తయారీ దాకా తామే చేసినట్లు రిచర్డ్ పేర్కొన్నారు. త్వరలో నిర్వహించే క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ టూర్లో తమ సామర్థ్యాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. -
భారత్, జర్మనీల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు
సాక్షి, న్యూఢిల్లీ : కృత్రిమ మేథ, విద్య, వ్యవసాయం, మెరైన్ టెక్నాలజీ సహా పలు రంగాల్లో భారత్, జర్మనీలు శుక్రవారం 20కి పైగా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌ల మధ్య చర్చల నేపథ్యంలో ఈ ఒప్పందాలు చోటుచేసుకున్నాయి. కృత్రిమ మేథలో పరిశోధన, అభివృద్ధి, గ్రీన్ అర్బన్ మొబిలిటీ సహా పలు వ్యూహాత్మక ప్రాజెక్టులకు సంబంధించి ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు ఖరారయ్యాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పౌర విమానయానం, స్మార్ట్ సిటీల నెట్వర్క్, వృత్తివిద్యా రంగంలో పరిశోధనలు వంటి రంగాల్లోనూ పరస్పర సహకారానికి అంగీకారం కుదిరిందని వెల్లడించింది. ఆయుర్వేదం, ధ్యానం, యోగా వంటి అంశాల్లోనూ ఇరు దేశాలు విద్యా పరమైన తోడ్పాటుకు అంగీకరించాయని తెలిపింది. -
అలా ఇచ్చి.. ఇలా లాక్కుంది!
హైదరాబాద్: రాష్ట్రాలకు సముచిత వాటా ఇస్తున్నట్లు ఘనంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం మొండిచెయ్యి చూపింది. ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి.. మరో చేత్తో లాక్కుంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను పది శాతం పెంచినట్లు ఊరించింది. అయితే ఆ మేరకు గ్రాంట్లలో భారీగా కత్తెర వేసింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే వాటా నిధులు ఈ ఏడాది తగ్గనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏటేటా కాస్తోకూస్తో పెరుగుతాయని అంచనా వేసుకున్న రాష్ర్ట ఆర్థిక శాఖ అసలు లెక్కలు చూసుకుని బిత్తరపోయింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పది శాతం నిధులు అదనంగా వస్తాయని, అలాగే నిర్దేశిత పథకాలకు కచ్చితంగా ఖర్చు చేయాలనే నిబంధనలు కూడా లేకపోవడం కలిసొస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సంబురపడింది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూశాక నివ్వెరపోయింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్లానింగ్ పద్దులో రాష్ట్రాలకు కేటాయించే గ్రాంట్లను కేంద్రం భారీగా తగ్గించింది. గత ఏడాది కేటాయింపులతో పోల్చితే దాదాపు 39 శాతం కోత పెట్టింది. దీంతో పన్నుల వాటాలో పెరుగుదల ఉన్నప్పటికీ.. ఆ మేరకు ప్రాయోజిత పథకాల గ్రాంట్లు భారీగా తగ్గిపోయాయి. మొత్తంగా రాష్ట్రానికి దక్కే నిధులను చూస్తే గతంలో కంటే తక్కువగానే వస్తాయని లెక్క తేలుతోంది. పథకాలకు భారీ కోత కేంద్ర పథకాల కుదింపు వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు పన్నుల వాటా పంపిణీ విషయంలో పాత జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం కూడా రాష్ట్రానికి నష్టం చేకూర్చింది. ప్రస్తుతమున్న 63 పథకాల్లో కేవలం 31 పథకాలను మాత్రమే కొనసాగించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 8 ప్రధాన పథకాలను ఉపసంహరించుకుంది. బీఆర్జీఎఫ్, మోడల్ స్కూళ్లు, జాతీయ ఈ-గవర్నెన్స్, రాజీవ్‌గాంధీ సశక్తీకరణ్ అభియాన్, ఆహార ఉత్పత్తుల జాతీయ మిషన్, పర్యాటక మౌలిక సదుపాయాల కల్పన, పోలీసు బలగాల ఆధునీకరణ, ఎగుమతులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పన పథకాలను విరమించుకుంది. దీంతో వీటి ద్వారా రావాల్సిన నిధులను రాష్ట్రాలు కోల్పోయాయి. బీఆర్జీఎఫ్ ద్వారా తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఏటా రావాల్సిన రూ. 250 కోట్లు నష్టపోయినట్లయింది. గ్రామ పంచాయతీల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు నిర్దేశించిన రాజీవ్ సశక్తీకరణ్ రద్దు కావటంతో ఏటా రూ. 150 కోట్ల మేర నిధులు తగ్గిపోయాయి. వీటితో పాటు 24 పథకాలకు కేటాయించే కేంద్ర నిధులు కూడా నిలిచిపోయాయి. అలాగే చిన్నారులు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యం, పౌష్టికాహారానికి ఇచ్చే నిధులను సగానికి సగం కుదించింది. ఐసీడీఎస్ ప్రాజెక్టులకు గత ఏడాది రూ. 16,316 కోట్లు మంజూరు చేయగా ఈసారి కేవలం రూ. 8 వేల కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు కింద గత ఏడాది తెలంగాణకు రూ. 1,172 కోట్లు మంజూరు కాగా, ఇప్పుడు అది రూ. 500 కోట్లు దాటే అవకాశం లేదని అధికారులు తలపట్టుకుంటున్నారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య పథకాల్లోనూ కేంద్రం తన వాటాను తగ్గించింది. స్వచ్ఛభారత్ అభియాన్ కింద అమలు చేసిన ఈ కార్యక్రమాలకు గత బడ్జెట్లో రూ. 11,938 కోట్లు ఖర్చు చేయగా.. ఈసారి కేవలం రూ. 6 వేల కోట్లను కేటాయించింది. ఫలితంగా కేంద్ర పథకాలకు సంబంధించి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు అదే దామాషాలో తగ్గిపోనున్నాయి. రాష్ట్రంలో భారీ అంచనాలతో తలపెట్టిన వాటర్‌గ్రిడ్‌కు భారీగా నిధులు వస్తాయని ఆశిస్తే.. ఆ శాఖకు నిధుల కోత పడటం గమనార్హం. ఈ లెక్కన రాష్ట్రాలకు వచ్చే కేంద్ర పన్నులు, గ్రాంట్లలో గత ఏడాదితో పోల్చితే పెద్ద మార్పేమీ లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంచనాలు తలకిందులు.. గత ఏడాది బడ్జెట్లో అప్పటి 13వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాను రూ. 3.82 లక్షల కోట్లుగా కేంద్రం లెక్కగట్టింది. తాజాగా 14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ఈ వాటాను రూ. 5.79 లక్షల కోట్లకు పెంచింది. దీంతో పన్నుల వాటా కింద తెలంగాణకు 14,185 కోట్లు వస్తాయని రాష్ర్ట ఆర్థిక శాఖ అంచనా వేసింది. అదే సమయంలో కేంద్ర పథకాలను పునర్వ్యవస్థీకరించడంతో రాష్ట్రానికి చేటు జరిగింది. ఈసారి కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రాలకు రూ. 2.04 లక్షల కోట్లు కేటాయించింది. జనాభా ప్రాతిపదికన 2.5 శాతం లెక్కన ఇందులో తెలంగాణకు రూ. 5,119 కోట్లు వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. పన్నుల వాటా, కేంద్ర పథకాల గ్రాంట్లు కలిపితే ఈసారి కేంద్రం నుంచి రూ. 19,304 కోట్లు వచ్చే అవకాశముంది. దీంతో రాష్ర్ట బడ్జెట్ తయారీలో ఈ పద్దును రూ. 20 వేల కోట్లలోపే చూపనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది రాష్ట్ర బడ్జెట్లో కేంద్ర పన్నులు, గ్రాంట్ల రూపంలో రూ. 21,720 కోట్ల పద్దును చూపింది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి దాదాపు రూ. 2,416 కోట్ల రాబడి తగ్గిపోనుంది. డబుల్ బెడ్రూం ఇళ్లపై డౌట్ రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం భారీ సాయం చేస్తుందన్న ఆశతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అరుణ్‌జైట్లీ ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే ఇళ్లకు కేంద్రం ఇందిరా ఆవాస్ యోజన(ఐఏవై) కింద భారీ కేటాయింపులు చేస్తూ వచ్చింది. దేశంలో మరే రాష్ట్రం పొందనన్ని ఐఏవై నిధులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పొందుతూ వచ్చింది. ఈసారి మరిన్ని నిధులు పొంది రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ భారం రాష్ట్ర ఖజానాపై పడకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కానీ కేంద్ర బడ్జెట్ కేటాయింపుల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఐఏవై కింద కేంద్రం ఈసారి కేవలం రూ. 10,025 కోట్లను కేటాయించింది. ఇది గత బడ్జెట్ కంటే ఏకంగా రూ. 6 వేల కోట్లు తక్కువ. ఫలితంగా రాష్ట్రాలకు కేటాయింపులు భారీగా తగ్గిపోనున్నాయి. ఇది రెండు పడక గదుల పథకానికి కచ్చితంగా శరాఘాతంగానే మారనుంది. దీంతో రాష్ట్ర బడ్జెట్ తయారీపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుల విషయంలో పునరాలోచనలో పడింది.