అలా ఇచ్చి.. ఇలా లాక్కుంది! | state partnerships in central taxes | Sakshi
Sakshi News home page

అలా ఇచ్చి.. ఇలా లాక్కుంది!

Published Tue, Mar 3 2015 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

అలా ఇచ్చి..  ఇలా లాక్కుంది!

అలా ఇచ్చి.. ఇలా లాక్కుంది!

హైదరాబాద్: రాష్ట్రాలకు సముచిత వాటా ఇస్తున్నట్లు ఘనంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం మొండిచెయ్యి చూపింది. ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి.. మరో చేత్తో లాక్కుంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను పది శాతం పెంచినట్లు ఊరించింది. అయితే ఆ మేరకు గ్రాంట్లలో భారీగా కత్తెర వేసింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే వాటా నిధులు ఈ ఏడాది తగ్గనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏటేటా కాస్తోకూస్తో పెరుగుతాయని అంచనా వేసుకున్న రాష్ర్ట ఆర్థిక శాఖ అసలు లెక్కలు చూసుకుని బిత్తరపోయింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

దీంతో పది శాతం నిధులు అదనంగా వస్తాయని, అలాగే నిర్దేశిత పథకాలకు కచ్చితంగా ఖర్చు చేయాలనే నిబంధనలు కూడా లేకపోవడం కలిసొస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సంబురపడింది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూశాక నివ్వెరపోయింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్లానింగ్ పద్దులో రాష్ట్రాలకు కేటాయించే గ్రాంట్లను కేంద్రం భారీగా తగ్గించింది. గత ఏడాది కేటాయింపులతో పోల్చితే దాదాపు 39 శాతం కోత పెట్టింది. దీంతో పన్నుల వాటాలో పెరుగుదల ఉన్నప్పటికీ.. ఆ మేరకు ప్రాయోజిత పథకాల గ్రాంట్లు భారీగా తగ్గిపోయాయి. మొత్తంగా రాష్ట్రానికి దక్కే నిధులను చూస్తే గతంలో కంటే తక్కువగానే వస్తాయని లెక్క తేలుతోంది.
 
పథకాలకు భారీ కోత
కేంద్ర పథకాల కుదింపు వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు పన్నుల వాటా పంపిణీ విషయంలో పాత జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం కూడా రాష్ట్రానికి నష్టం చేకూర్చింది. ప్రస్తుతమున్న 63 పథకాల్లో కేవలం 31 పథకాలను మాత్రమే కొనసాగించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 8 ప్రధాన పథకాలను ఉపసంహరించుకుంది. బీఆర్‌జీఎఫ్, మోడల్ స్కూళ్లు, జాతీయ ఈ-గవర్నెన్స్, రాజీవ్‌గాంధీ సశక్తీకరణ్ అభియాన్, ఆహార ఉత్పత్తుల జాతీయ మిషన్, పర్యాటక మౌలిక సదుపాయాల కల్పన, పోలీసు బలగాల ఆధునీకరణ, ఎగుమతులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పన పథకాలను విరమించుకుంది. దీంతో వీటి ద్వారా రావాల్సిన నిధులను రాష్ట్రాలు కోల్పోయాయి. బీఆర్‌జీఎఫ్ ద్వారా తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఏటా రావాల్సిన రూ. 250 కోట్లు నష్టపోయినట్లయింది. గ్రామ పంచాయతీల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు నిర్దేశించిన రాజీవ్ సశక్తీకరణ్ రద్దు కావటంతో ఏటా రూ. 150 కోట్ల మేర నిధులు తగ్గిపోయాయి. వీటితో పాటు 24 పథకాలకు కేటాయించే కేంద్ర నిధులు కూడా నిలిచిపోయాయి.

అలాగే చిన్నారులు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యం, పౌష్టికాహారానికి ఇచ్చే నిధులను సగానికి సగం కుదించింది. ఐసీడీఎస్ ప్రాజెక్టులకు గత ఏడాది రూ. 16,316 కోట్లు మంజూరు చేయగా ఈసారి కేవలం రూ. 8 వేల కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు కింద గత ఏడాది తెలంగాణకు రూ. 1,172 కోట్లు మంజూరు కాగా, ఇప్పుడు అది రూ. 500 కోట్లు దాటే అవకాశం లేదని అధికారులు తలపట్టుకుంటున్నారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య పథకాల్లోనూ కేంద్రం తన వాటాను తగ్గించింది. స్వచ్ఛభారత్ అభియాన్ కింద అమలు చేసిన ఈ కార్యక్రమాలకు గత బడ్జెట్‌లో రూ. 11,938 కోట్లు ఖర్చు చేయగా.. ఈసారి కేవలం రూ. 6 వేల కోట్లను కేటాయించింది. ఫలితంగా కేంద్ర పథకాలకు సంబంధించి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు అదే దామాషాలో తగ్గిపోనున్నాయి. రాష్ట్రంలో భారీ అంచనాలతో తలపెట్టిన వాటర్‌గ్రిడ్‌కు భారీగా నిధులు వస్తాయని ఆశిస్తే.. ఆ శాఖకు నిధుల కోత పడటం గమనార్హం. ఈ లెక్కన రాష్ట్రాలకు వచ్చే కేంద్ర పన్నులు, గ్రాంట్లలో గత ఏడాదితో పోల్చితే పెద్ద మార్పేమీ లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
 
అంచనాలు తలకిందులు..
గత ఏడాది బడ్జెట్‌లో అప్పటి 13వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాను రూ. 3.82 లక్షల కోట్లుగా కేంద్రం లెక్కగట్టింది. తాజాగా 14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ఈ వాటాను రూ. 5.79 లక్షల కోట్లకు పెంచింది. దీంతో పన్నుల వాటా కింద తెలంగాణకు 14,185 కోట్లు వస్తాయని రాష్ర్ట ఆర్థిక శాఖ అంచనా వేసింది. అదే సమయంలో కేంద్ర పథకాలను పునర్వ్యవస్థీకరించడంతో రాష్ట్రానికి చేటు జరిగింది. ఈసారి కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రాలకు రూ. 2.04 లక్షల కోట్లు కేటాయించింది. జనాభా ప్రాతిపదికన 2.5 శాతం లెక్కన ఇందులో తెలంగాణకు రూ. 5,119 కోట్లు వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. పన్నుల వాటా, కేంద్ర పథకాల గ్రాంట్లు కలిపితే ఈసారి కేంద్రం నుంచి రూ. 19,304 కోట్లు వచ్చే అవకాశముంది. దీంతో రాష్ర్ట బడ్జెట్ తయారీలో ఈ పద్దును రూ. 20 వేల కోట్లలోపే చూపనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్ర పన్నులు, గ్రాంట్ల రూపంలో రూ. 21,720 కోట్ల పద్దును చూపింది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి దాదాపు రూ. 2,416 కోట్ల రాబడి తగ్గిపోనుంది.
 
డబుల్ బెడ్రూం ఇళ్లపై డౌట్
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం భారీ సాయం చేస్తుందన్న ఆశతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అరుణ్‌జైట్లీ ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే ఇళ్లకు కేంద్రం ఇందిరా ఆవాస్ యోజన(ఐఏవై) కింద భారీ కేటాయింపులు చేస్తూ వచ్చింది. దేశంలో మరే రాష్ట్రం పొందనన్ని ఐఏవై నిధులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పొందుతూ వచ్చింది. ఈసారి మరిన్ని నిధులు పొంది రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ భారం రాష్ట్ర ఖజానాపై పడకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కానీ కేంద్ర బడ్జెట్ కేటాయింపుల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఐఏవై కింద కేంద్రం ఈసారి కేవలం రూ. 10,025 కోట్లను కేటాయించింది. ఇది గత బడ్జెట్ కంటే ఏకంగా రూ. 6 వేల కోట్లు తక్కువ. ఫలితంగా రాష్ట్రాలకు కేటాయింపులు భారీగా తగ్గిపోనున్నాయి. ఇది రెండు పడక గదుల పథకానికి కచ్చితంగా శరాఘాతంగానే మారనుంది. దీంతో రాష్ట్ర బడ్జెట్ తయారీపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుల విషయంలో పునరాలోచనలో పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement