దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పర్వత ప్రాంతాలు మొదలుకొని మైదాన ప్రాంతాల వరకు అన్నిచోట్లా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాజస్థాన్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు సంభవించిన పలు ప్రమాదాలలో మరో ఎనిమిది మంది మృతి చెందారు. గడచిన రెండు రోజుల్లో 22 మంది వర్ష సంబంధిత ప్రమాదాల్లో మృతిచెందారు. కరౌలి, హిందౌన్‌లలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్యామ్‌లు, నదులు పొంగిపొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. విపత్తు సహాయక దళాలు కరౌలి, హిందౌన్‌లలో 100 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా రెండు జాతీయ రహదారులతో సహా మొత్తం 197 రోడ్లు మూసుకుపోయాయి. బీహార్‌లో గంగా నది సహా అన్ని ప్రధాన నదుల నీటిమట్టం పెరిగింది. రాజధాని పట్నాలో గంగ, పున్‌పున్ నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. గంగా నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది.
గంగానది నీటిమట్టం పెరగడంతో ముంగేర్, భాగల్పూర్, పట్నా తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
Comments
Please login to add a commentAdd a comment