దూసుకుపోతున్న దేశీ విమానయానం
♦ 2015లో భారత్‌లో వేగవంతమైన వృద్ధి
♦ దేశీ ప్రయాణికుల్లో 18.8% పెరుగుదల
♦ మార్కెట్ పరంగా ప్రపంచంలో మూడో స్థానం: ఐఏటీఏ
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగానికి మంచి రోజులొచ్చాయి. 2015వ సంవత్సరంలో దేశీయంగా విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య 18.8 శాతం వృద్ధి చెందింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిన మార్కెట్‌గా భారత్ నిలిచింది. చైనా, అమెరికాల తర్వాత ప్రపంచంలో ప్రయాణికుల సంఖ్య పరంగా భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. 2015లో విమానయాన రంగం వృద్ధిపై ఐఏటీఏ మరిన్ని వివరాలు వెల్లడించింది.
♦ 2015లో ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌లైన్స్ సంస్థలు షెడ్యూల్డ్ సర్వీసుల ద్వారా 360 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చా యి. 2014లో ప్రయాణించిన వారితో పోల్చి చూ స్తే 7.2% పెరుగుదల కనిపిస్తోంది. అలాగే ఆరు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన 5.22 కోట్ల టన్నుల వస్తువులను కూడా రవాణా చేశాయి.
♦ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 2015లో దేశీయ విమాన ప్రయాణికుల పరంగా భారత్ అత్యంత వేగవంతంగా వృద్ధి చెందిన మార్కెట్. వార్షిక వృద్ధి 18.8 శాతంగా ఉంది. దేశీయ విమానయాన మార్కెట్లో ప్రయాణికులు 8 కోట్ల మంది ఉన్నారు.
♦ భారత్ తర్వాత దేశీయ ప్రయాణికుల వృద్ధి పరంగా 11.9 శాతంతో రష్యా రెండో స్థానంలో ఉంది. ఇక్కడి విమాన ప్రయాణికుల మార్కెట్ 4.7 కోట్ల మందితో ఉంది.
♦ వృద్ధి పరంగా రష్యా తర్వాత చైనా మూడో స్థానా న్ని సొంతం చేసుకుంది. చైనాలో విమాన ప్రయాణికుల్లో వృద్ధి 9.7% ఉంది. ఇక్కడ దేశీయ విమాన ప్రయాణికులు 39.4 కోట్ల మంది ఉన్నారు.
♦ అమెరికా దేశీయ విమానయాన ప్రయాణికుల్లో వృద్ధి 5.4 శాతం నమోదైంది. ఇక్కడ 70.8 కోట్ల మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు.