ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి పరిణామాలతో దేశీ విమానయాన రంగం కుదేలవుతోంది. లాక్‌డౌన్ దెబ్బతో దాదాపు రెండు వారాలుగా ఫ్లయిట్లు నిల్చిపోగా, ఇప్పట్లో విమాన సర్వీసులు ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మార్చి, జూన్ త్రైమాసికాల్లో అన్ని ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థల నష్టాలు సుమారు రూ. 5,800–6,500 కోట్ల దాకా ఉంటాయని అంచనా. మే, జూన్, జూలైల్లో దేశీయంగా ప్రయాణాలకు సంబంధించిన బుకింగ్స్ వార్షిక ప్రాతిపదికన చూస్తే 80 శాతం పడిపోయాయి. దీంతో ఎయిర్‌లైన్స్‌కు నిధులపరమైన సమస్యలు మరింత తీవ్రం కానున్నాయి.
వ్యయాల భారం..
ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా పలు ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం, వేతనాలు కుదించడం వంటి చర్యలు తీసుకున్నాయని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ సెక్యూరిటీస్ వర్గాలు తెలిపాయి. అయితే, లీజుకి సంబంధించిన అద్దెల చెల్లింపులు, ఇతరత్రా కార్పొరేట్ ఖర్చులు మొదలైన ఫిక్స్‌డ్ వ్యయాలు తప్పనిసరిగా ఉంటాయని పేర్కొన్నాయి. వచ్చే మూడు నెలల్లో ఇండిగో స్థిర వ్యయాలు రూ. 2,400–4,500 కోట్ల మేర ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, దేశీయంగా అతి పెద్ద విమానయాన సంస్థగా ఎదిగిన ఇండిగోకి ఇది మరీ సమస్యాత్మకం కాకపోవచ్చన్న అభిప్రాయం ఉంది.
గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి ఇండిగో వద్ద మిగులు నిధులు రూ. 9,412 కోట్లుగా ఉండటమే ఇందుకు కారణం. వీటి ఊతంతో ఇండిగో ఆరు నెలల నుంచి ఏడాది దాకా నిలబడగలదని అంచనా. అయితే, మరో ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్ దగ్గర చెప్పుకోతగ్గ స్థాయిలో మిగులు నిధులు లేవు. మార్చి ఆఖరు నాటికి స్పైస్‌జెట్ చేతిలో ఉన్నది సుమారు రూ. 86 కోట్లే. మూడు నెలల పాటు నిలదొక్కుకోవాలంటే స్పైస్‌జెట్‌కు సుమారు రూ. 1,350 – 1,500 కోట్ల దాకా అవసరమవుతుంది. అటు వచ్చే మూడు నెలల్లో గోఎయిర్ స్థిర వ్యయాలు దాదాపు రూ. 500–750 కోట్లుగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment