air traffic
-
మైక్రోసాఫ్ట్ బగ్ ప్రభావం .... అమెరికా గగనతలం ఖాళీ!
న్యూయార్క్: అమెరికా గగనతలంలో ప్రతి రోజు విమానాల ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ ట్రాఫిక్ ఒక్కసారిగా తగ్గిపోతే ఎలాఉంటుందో శుక్రవారం(జులై 19) అర్థమైంది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో బగ్ సమస్య తలెత్తి అమెరికాలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీలైన అమెరికన్ ఎయిర్‌లైన్స్,డెల్టా,యునైటెడ్ సంస్థల విమానాలు ఎక్కడికక్కడే ఎయిర్‌పోర్టుల్లో నిలిచిపోయాయి. దీంతో అగ్రదేశ గగనతలంలో విమానాల ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ సాధారణ సమయంలో విమానాల రద్దీ ఎలా ఉంటుంది.. శుక్రవారం విమానాల రద్దీ తగ్గిన తర్వాత ఎలా ఉందనే 12 గంటల ఆసక్తికర టైమ్‌లాప్స్ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విమానాల ట్రాఫిక్ టైమ్‌లాప్స్ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. 12-hour timelapse of American Airlines, Delta, and United plane traffic after what was likely the biggest IT outage in history forced a nationwide ground stop of the three airlines. pic.twitter.com/wwcQeiEtVe— Colin McCarthy (@US_Stormwatch) July 19, 2024 -
విమానయానం భవిష్యత్ సుస్థిరం
న్యూఢిల్లీ: రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా దేశీ విమానయాన రంగం ఔట్‌లుక్‌ను స్థిరత్వానికి ఎగువముఖంగా సవరించింది. గతంలో ప్రకటించిన ప్రతికూల రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య(ట్రాఫిక్) వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ రంగం భవిష్యత్‌పట్ల ఆశావహంగా స్పందించింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో విమానయాన రంగం నష్టాల అంచనాలు రూ. 11,000 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లకు తగ్గించింది. వచ్చే ఏడాది(2023–24)కి సైతం తొలుత వేసిన నష్టం రూ. 7,000 కోట్ల అంచనాలలోనూ రూ. 5,000 కోట్లకు కోత పెట్టింది. వచ్చే ఏడాదిలోనూ ప్రయాణికుల ట్రాఫిక్ కొనసాగనున్నట్లు తాజా నివేదికలో ఇక్రా అభిప్రాయపడింది. దీంతో విమానయాన కంపెనీలు టికెట్ ధరల నిర్ణయంలో మరింత శక్తివంతంగా వ్యవహరించేందుకు వీలు చిక్కగలదని పేర్కొంది. ఇది మెరుగుపడుతున్న ఈల్డ్స్ ద్వారా ప్రతిఫలిస్తున్నట్లు తెలియజేసింది. 2022 జూన్‌లో గరిష్టానికి చేరిన వైమానిక ఇంధన(ఏటీఎఫ్) ధరలు క్రమంగా తగ్గుతుండటం, విదేశీ మారక రేట్లు స్థిరంగా ఉండటం లాభదాయకతకు సహకరించనున్నట్లు అంచనా వేసింది. 8–13 శాతం వృద్ధి: ఏప్రిల్ నుంచి ప్రారంభంకానున్న వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీ ప్యాసింజర్ ట్రాఫిక్ 8–13 శాతం స్థాయిలో పురోగమించనున్నట్లు నివేదికలో ఇక్రా అభిప్రాయపడింది. ఈ ఏడాది 55–60 శాతం వృద్ధి తదుపరి వచ్చే ఏడాదిలో ప్రయాణికుల సంఖ్య 14.5–15 కోట్లకు చేరగలదని అంచనా వేసింది. కరోనా మహమ్మారికి ముందుస్థాయికంటే ఇది అధికంకావడం గమనార్హం! దేశీ విమానయాన కంపెనీల ద్వారా విదేశీ ప్రయాణికుల సంఖ్య సైతం వృద్ధి బాటలో సాగుతున్నట్లు ఇక్రా పేర్కొంది. 2022 మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు తిరిగి మొదలుకావడంతో ఈ ఏడాది తొలి 9 నెలల్లో (ఏప్రిల్–డిసెంబర్) కోవిడ్–19 ముందుస్థాయికంటే కేవలం 2.4 శాతం తక్కువగా ఇంటర్నేషనల్ ట్రాఫిక్ నమోదైనట్లు వెల్లడించింది. వార్షికంగా చూస్తే దేశీ కంపెనీల అంతర్జాతీయ ట్రాఫిక్ 10–15 శాతం ఎగసినట్లు తెలియజేసింది. గతేడాది 125–130 వృద్ధి తదుపరి ఇది అధికమేనని స్పష్టం చేసింది. -
అదానీ గ్రూప్‌లో మరిన్ని పెట్టుబడులు
సిడ్నీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ కంపెనీలలో మరిన్ని పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు జీక్యూజీ పార్ట్నర్స్ వ్యవస్థాపకుడు రాజీవ్ జైన్ తాజాగా స్పష్టం చేశారు. భారత్‌లో 25 శాతం ఎయిర్ ట్రాఫిక్ అదానీ నిర్వహిస్తున్న ఎయిర్‌పోర్టుల ద్వారానే నమోదవుతున్నట్లు జైన్ పేర్కొన్నారు. అంతేకాకుండా దేశీ సరుకు రవాణా(కార్గో)లో అదానీ గ్రూప్ పోర్టులు 25 నుంచి 40 శాతం పరిమాణాన్ని సాధిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి ఐదేళ్లుగా అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు చేపట్టేందుకు వేచిచూస్తున్నట్లు విలేకర్ల సమావేశంలో జైన్ తెలియజేశారు. స్థానిక ఇన్వెస్టర్లతో జైన్ సమావేశమ వుతున్నారు. అయితే షేర్ల ధరలు అందుబాటులో లేకపోవడంతో దీర్ఘకాలం వేచి చూసినట్లు వెల్లడించారు. కాగా.. ఇటీవల అదానీ గ్రూప్‌లోని 4 కంపెనీలలో అమెరికా ఈక్విటీ పెట్టుబడుల కంపెనీ జీక్యూజీ పార్ట్నర్స్ 1.87 బిలియన్ డాలర్లు(రూ. 15,446 కోట్లు) ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇకపైన కూడా అదానీ గ్రూప్‌లో పెట్టుబడులను మరింత విస్తరించనున్నట్లు జైన్ స్పష్టం చేశారు. ఇటీవల సెకండరీ మార్కెట్లో బ్లాక్ డీల్స్ ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్(ఏపీసెజ్), అదానీ గ్రీన్ ఎనర్జీ(ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్(ఏటీఎల్)లకు చెందిన మైనారిటీ వాటాలను జీక్యూజీ పార్ట్నర్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. అదానీ పవర్ అనుబంధ సంస్థల విలీనం పూర్తిస్థాయి అనుబంధ సంస్థలు ఆరింటిని విలీనం చేసుకున్నట్లు అదానీ పవర్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. వీటిలో అదానీ పవర్ మహారాష్ట్ర, అదానీ పవర్ రాజస్తాన్, ఉడుపి పవర్ కార్పొరేషన్, రాయ్‌పూర్ ఎనర్జెన్, రాయ్‌గఢ్ ఎనర్జీ జనరేషన్, అదానీ పవర్ ముంద్రా లిమిటెడ్ ఉన్నట్లు పేర్కొంది. గత నెల(ఫిబ్రవరి) 8న జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అహ్మదాబాద్ బెంచ్ ఇందుకు అనుమతించినట్లు తెలియజేసింది. -
9 ఎయిర్‌పోర్టులు .. 50 శాతం వృద్ధి
ముంబై: విమాన ప్రయాణీలకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన నడుస్తున్న తొమ్మిది ఎయిర్‌పోర్టులు ఈ ఆర్థిక సంవత్సరంలో 50 శాతం వృద్ధి సాధించనున్నాయి. వాటి ఆదాయాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,450 కోట్లుగా ఉండగా ఈసారి రూ. 9,650 కోట్లకు చేరనున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ఎడ్జ్ రేటింగ్స్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్యాసింజర్ ట్రాఫిక్ ఈసారి 70 శాతం వృద్ధి చెందనుంది. కరోనా పూర్వ స్థాయిలో 93 శాతానికి చేరనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది కోవిడ్ పూర్వ స్థాయికి 1.12 రెట్లు అధికంగా నమోదు కావచ్చని అంచనాలు ఉన్నాయి. దేశీయంగా మొత్తం ప్యాసింజర్ ట్రాఫిక్‌లో 50 శాతం వాటా ఉన్న తొమ్మిది పీపీపీ విమానాశ్రయాల ఆర్థిక పరిస్థితిని మదింపు చేసిన మీదట ఈ అంచనాలకు వచ్చినట్లు కేర్ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. కోవిడ్ సమయంలో ఎయిర్పోర్ట్ ఆపరేటర్లకు ఆదాయ పంపకంపరంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఊరటనివ్వడంతో 2021–22లో వాటి స్థూల మార్జిన్లు మెరుగ్గా 56 శాతం స్థాయిలో నమోదయ్యాయి. అయితే, ఆదాయ పంపకాన్ని పునరుద్ధరించడంతో ఈసారి ఇవి 37 శాతానికి తగ్గనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కార్యకలాపాల స్థాయి పెరగడం వల్ల ఈ మార్జిన్లు సుమారు 45 శాతం వద్ద స్థిరపడవచ్చని కేర్ఎడ్జ్ రేటింగ్స్ పేర్కొంది. ప్రైవేటీకరణలో మరింత జాప్యం.. విమానాశ్రయాల ప్రైవేటీకరణలోనూ, జాయింట్ వెంచర్ ఎయిర్‌పోర్టుల నుంచి తప్పుకోవాలన్న ప్రభుత్వ ప్రణాళికల అమల్లోనూ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) కింద 25 ఎయిర్‌పోర్టులను మానిటైజ్ చేయాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ ఆ దిశగా ఇంకా పటిష్టమైన చర్యలేమీ అమలవుతున్నట్లు లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిర్దిష్ట గడువులను మరింత ముందుకు జరపవచ్చని, కేంద్రం జోక్యం చేసుకోవాల్సి రావచ్చని నివేదిక అభిప్రాయపడింది. భారత జీడీపీ వృద్ధి, విమాన ప్రయాణీకుల పెరుగుదలపై దాని ప్రభావం.. పని చేయగలిగే వయస్సు గల జనాభా సంఖ్య పెరుగుతుండటం తదితర అంశాలు భారతీయ ఎయిర్పోర్ట్ ఆపరేటర్లకు సానుకూలంగా ఉండగలవని వివరించింది. సకాలంలో టారిఫ్ ఆర్డర్లను జారీ చేస్తూ నియంత్రణపరమైన పరిస్థితులను మెరుగుపర్చగలిగితే ఆపరేటర్లకు ఆదాయ అంచనాలపరంగా ఊరటగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ’లో బేస్ ఎఫెక్ట్’ కారణంగా 2023–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఎయిర్ ట్రాఫిక్ వృద్ధి రేటు .. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుకన్నా 2.25 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు కేర్ఎడ్జ్ రేటింగ్స్ డైరెక్టర్ మౌలేష్ దేశాయ్ పేర్కొన్నారు. -
ఎగిరిపోదాం ఎంచక్కా..
సాక్షి, కర్నూలు(సెంట్రల్): విమానయానంపై కర్నూలు జిల్లా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రయాణ సమయం ఆదా అవుతుందనే ఉద్దేశం, నూతన ప్రయాణ అనుభూతి పొందాలన్న ఉత్సుకతతో విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో కర్నూలు ఎయిర్‌పోర్టు (ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం – ఓర్వకల్లు) నుంచి రాకపోకలు ఊపందుకున్నాయి. నగరాలకు చలో చలో కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి ఈ ఏడాది మార్చి 28న విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ ఉడాన్ పథకం కింద ఇక్కడి నుంచి విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు సర్వీసులు నడుస్తున్నాయి. దీంతో ఆయా నగరాల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులు అధికశాతం విమాన ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీకెండ్లో రెండు రోజుల సెలవు ఉంటుండడంతో విమానంలో సొంతూళ్లకు వచ్చి వెళుతున్నారు. విశాఖపట్నం అందాలను తిలకించడానికి జిల్లా నుంచి వెళ్లే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. గోవాకు వెళ్లే వారు వయా బెంగళూరు మీదుగా ప్రయాణిస్తున్నారు. విశాఖ – కర్నూలు మధ్య నడిచే సర్వీసుల్లో 72 సీట్లకు గాను ప్రతిసారి 55–60 మంది ప్రయాణిస్తున్నారు. బెంగళూరుకు కూడా 50 మందికి తగ్గకుండా వెళ్తున్నారు. చెన్నైకి వెళ్లే వారి సంఖ్య మాత్రం కాస్త తక్కువగానే ఉంటోంది. ప్రస్తుతం ఆ నగరానికి రాకపోకలు సాగిస్తున్న వారిలో వ్యాపారులు ఎక్కువగా ఉంటున్నారు. కర్నూలు– చెన్నై సర్వీసుల్లో 72 సీట్లకు గాను 40–45 సీట్లు భర్తీ అవుతున్నాయి. క్రమంగా పెరుగుదల కరోనా రెండో దశ ప్రభావం విమాన ప్రయాణాలపైనా బాగానే పడింది. బెంగళూరు, చెన్నై నగరాల్లో లాక్డౌన్ విధించడం, ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ పెట్టడంతో ఆ సమయంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. విమాన రాకపోకలపై నిషేధం లేకున్నా లాక్డౌన్, కర్ఫ్యూ కారణంగా చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. మే మాసంలో ఒక్కో ట్రిప్పులో 10–15 మంది కూడా ప్రయాణించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే కరోనా కేసులు తగ్గిపోవడం, లాక్డౌన్ ఎత్తేయడం, కర్ఫ్యూ నిబంధనలు సడలించడంతో విమాన ప్రయాణాలు మళ్లీ పుంజుకున్నాయి. విద్యా సంస్థలు పునః ప్రారంభమై, వ్యాపారాలు కూడా పూర్తి స్థాయిలో ఊపందుకుంటే ఇక్కడి నుంచి విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది కరోనా సెకండ్ వేవ్‌తో మే మాసంలో విమాన ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. అయితే ప్రస్తుతం అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కర్నూలు నుంచి విశాఖపట్నం వెళ్లేవారు..వచ్చే వారు అధికంగా ఉంటున్నారు. – కైలాస్ మండల్, ఏడీ, ఎయిర్‌పోర్టు అథారిటీ విమానాల టైం టేబుల్ ఫ్లైట్ నంబర్ సర్వీసు అందుబాటులో బయలుదేరు సమయం చేరుకునే సమయం ఉండే రోజులు ఎయిర్‌పోర్టు ఎయిర్‌పోర్టు 6ఈ7911 సోమ, బుధ, శుక్ర, ఆది బెంగళూరు 09.05 కర్నూలు 10.10 6ఈ7912 సోమ, బుధ, శుక్ర, ఆది కర్నూలు 10.30 విశాఖపట్నం 12.40 6ఈ7913 సోమ, బుధ, శుక్ర, ఆది విశాఖపట్నం 13.00 కర్నూలు 14.55 6ఈ7914 సోమ, బుధ, శుక్ర, ఆది కర్నూలు 15.15 బెంగళూరు 16.25 6ఈ7915 మంగళ, గురు, శని, ఆది చెన్నై 14.50 కర్నూలు 16.10 6ఈ7916 మంగళ, గురు,శని, ఆది కర్నూలు 16.30 చెన్నై 17.50 విమాన టికెట్ ధరలు (రూ.లలో) కర్నూలు – బెంగళూరు 2,077 కర్నూలు – చెన్నై 2,555 కర్నూలు– విశాఖపట్నం 3.077 -
విమానానికి సెగ
ముంబై: కరోనా వైరస్ కల్లోలానికి దేశీయ విమానయాన రంగం తీవ్రంగా ప్రభావితం కానున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ఎయిర్ ట్రాఫిక్ 8–9 కోట్ల ప్రయాణికులకే పరిమితం కానున్నదని విమానయాన కన్సల్టింగ్ సంస్థ, కాపా ఇండియా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20)లో 14 కోట్ల మంది విమానాల ద్వారా ప్రయాణించారని అంచనా. విమాన ప్రయాణికుల సంఖ్య భారీగానే తగ్గడమే కాకుండా భారత విమానయాన సంస్థలకు రెండేళ్లలో అందాల్సిన 200కు పైగా విమానాలు మరో రెండేళ్ల జాప్యం తర్వాతే అందుతాయని పేర్కొంది. ఈ సంస్థ ఇంకా ఏం చెప్పిందంటే... ► కరోనా వైరస్ కల్లోలంతో పర్యాటకంపై ఆంక్షలు, ఆర్థిక మందగమనం... ఈ రెండు అంశాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారత విమానయానంపై ప్రభావం తీవ్రంగా ఉండనున్నది. ► సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలం(జూలై–సెప్టెంబర్)లో విమానయాన రంగంలో డిమాండ్ బలహీనంగా ఉంటుంది. ఈసారి ఇంకా బలహీనంగా ఉండొచ్చు. ► ఏతావాతా ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో అవసరానికి మించి విమానాలు అందుబాటులో ఉంటాయి. ► ఇక ఈ ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసిక కాలాల నుంచి సాధారణ స్థాయికి రావచ్చు. ► ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కూడా భారీగానే తగ్గనున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 7 కోట్ల మంది విదేశాలకు విమానాల ద్వారా ప్రయాణించారని అంచనాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 3.5–4 కోట్లకే పరిమితం కానున్నది. -
ఎగిరే లోహ విహంగం ఈ నగరం!
సాక్షి, హైదరాబాద్ భాగ్యనగరం నుంచి గగన ప్రయాణం చేసే వారి సంఖ్య ఏటేటా భారీగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా విమానాల రాకపోకలూ పెరుగుతున్నాయి. నిత్యం హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 400 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తుండగా.. సగటున 50 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే 2016–17లో ఎయిర్ ట్రాఫిక్ 23 శాతం, ప్రయాణికుల సంఖ్య 21.9 శాతం పెరిగినట్లు తెలిపాయి. ఆ ఏడాదిలో 1.52 కోట్ల మంది ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారని పేర్కొన్నాయి. అదే 2002–03లో హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించిన దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య 19.10 లక్షలు మాత్రమేనని, ఈ లెక్కన 15 ఏళ్లలో విమాన ప్రయాణీకులు ఎనిమిది రెట్లు పెరిగారని వెల్లడించాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభమైన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అప్పటినుంచి శరవేగంగా అభివృద్ధి చెందుతూనే ఉండడం గమనార్హం. దిగొచ్చిన ధరలతో.. విమాన టికెట్ల ధరలు మధ్య తరగతికి కూడా అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు, విమాన సర్వీసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు అసలు భరించలేని స్థాయిలో ఉన్న విమాన టికెట్ల ధరలు.. ప్రస్తుతం రైల్లో ఏసీ కోచ్‌లో చార్జీల స్థాయికి తగ్గాయి. కొంచెం ముందుగా బుక్ చేసుకుని ప్రయాణిస్తే.. తక్కువ ధరలోనే విమాన ప్రయాణం చేసే వీలు దొరికింది. మరోవైపు హైదరాబాద్ పర్యాటక, వాణిజ్య హబ్‌గా మారడం కూడా విమానాల ట్రాఫిక్ పెరిగేందుకు కారణమవుతోంది. వ్యాపార, వాణిజ్యాలు కూడా వేగంగా విస్తరిస్తుండడంతో దేశ, విదేశాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు పెరిగాయి. విమానాశ్రయం విస్తరణకు ప్రణాళికలు ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో.. అందుకు తగినట్లుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విస్తరించే పనులు చేపట్టారు. జీఎంఆర్ సంస్థ వర్గాలు ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలసిన సందర్భంగా విమానాశ్రయంలో అదనపు టెర్మినల్, మరో రన్‌వేలను నిర్మించేదిశగా ప్రతిపాదనలు సమర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నుంచి ఏటా 1.52 కోట్ల మంది ప్రయాణిస్తుండగా.. త్వరలో రెండు కోట్ల మంది ప్రయాణించేందుకు వీలుగా విమానాశ్రయ నిర్వహణ సంస్థ జీఎంఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయం నుంచి 9 దేశీయ, 17 అంతర్జాతీయ విమానయాన సంస్థలు విమానాలను నడుపుతున్నాయి. దేశంలోని 39 నగరాలకు, అంతర్జాతీయంగా 17 ప్రధాన నగరాలకు హైదరాబాద్ నుంచి విమాన కనెక్టివిటీ ఉంది. ‘ఫ్లై వయా హైదరాబాద్’నినాదంతో దేశంలోని పలు నగరాల మధ్య విమాన సర్వీసులు నడుపుతుండడం గమనార్హం. అంతేకాదు ఇక్కడి నుంచి నేరుగా విదేశాలకు వెళ్లే సర్వీసులు కూడా ఏటా పెరుగుతున్నాయి. ఎయిర్ ట్రాఫిక్‌తో ఏరోసాల్ కాలుష్యం! ఏటేటా విమానాల రాకపోకలు పెరుగుతుండడంతో వాటివల్ల ‘ఏరోసాల్’కాలుష్యం కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. విమానాల్లో ఇంధనంగా వినియోగించే గ్యాసోలిన్, పలు రసాయన పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, సరిగా మండని పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలు, జీవ ఇంధనాలు, బయోమాస్‌ను బహిరంగంగా తగలబెట్టడం వంటివాటితో ఏరోసాల్స్ కాలుష్యం ఉత్పన్నమౌతుంది. బ్లాక్ కార్బన్, ఇతర హానికారక వాయువులు, ఆవిరులు, ధూళి కణాలను కలిపి ఏరోసాల్స్‌గా చెప్పవచ్చు. ఈ కాలుష్యాన్ని గణించేందుకు హైదరాబాద్‌లో ‘సిస్టం ఆఫ్ ఏరోసాల్ మానిటరింగ్ అండ్ రీసెర్చి–ఎస్ఏఎంఏఆర్’ను ఏర్పాటు చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖను వాతావరణ శాఖ కోరినట్లు తెలిసింది. 16 ఎథలోమీటర్స్, 12 స్కై రేడియోమీటర్స్, 12 నెఫిలో మీటర్లను హైదరాబాద్ నలుమూలలా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. గాలిలో ఏరోసాల్స్ మోతాదు పెరగడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని.. శ్వాసకోశ వ్యాధులు, ఇతర అనారోగ్యాలు తలెత్తే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఏటా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, ప్రయాణీకుల సంఖ్య.. సంవత్సరం సర్వీసులు ప్రయాణికులు 2012–13 200 83.66 లక్షలు 2013–14 250 87.28 లక్షలు 2014–15 300 1.05 కోట్లు 2015–16 350 1.24 కోట్లు 2016–17 400 1.52 కోట్లు పలు మెట్రో నగరాల్లో రోజూ విమాన సర్వీసుల తీరు... దేశంలో టాప్–10 విమానాశ్రయాలివీ.. -
19 శాతం పెరిగిన దేశీయ ఎయిర్ ట్రాఫిక్
- కొనసాగుతున్న ఇండిగో అగ్రస్థానం - ఆగస్టు గణాంకాలను వెల్లడించిన డీజీసీఏ న్యూఢిల్లీ: దేశీయ ఎయిర్ ట్రాఫిక్ గత నెలలో 19 శాతం వృద్ధి సాధించిందని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. గత ఏడాది ఆగస్టులో 56.97 లక్షలుగా ఉన్న దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య ఈ ఏడాది ఆగస్టులో 67.60 లక్ష లకు పెరిగిందని పేర్కొంది. డీజీసీఏ వెల్లడించిన వివరాల ప్రకారం.. - ప్రయాణికుల సంఖ్య పెరిగినా, ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ మాత్రం ఈ ఏడాది జూలైతో పోల్చితే గత నెలలో తగ్గింది. టూరిస్ట్ సీజన్ ముగియడమే దీనికి ప్రధాన కారణం. - దేశీయ మార్కెట్లో ఇండిగో అగ్రస్థానం కొనసాగుతోంది. గత నెలలో మొత్తం విమాన ప్రయాణికుల్లో మూడవ వంతు(23.85 లక్షల మంది) ఇండిగో ద్వారానే ప్రయాణించారు. ఇండిగో తర్వాతి స్థానాల్లో జెట్ ఎయిర్వేస్ జెట్లైట్తో కలిసి(15.9 లక్షలు), ఎయిర్ ఇండియా(11.25 లక్షలు), స్పైస్‌జెట్ (8.3 లక్షలు), గో ఎయిర్( 5.48 లక్షలు) నిలిచాయి. - సీట్ ఫ్యాక్టర్ విషయంలో 92 శాతంతో స్పైస్‌జెట్ మొదటి స్థానంలో నిలిచింది. జెట్ ఎయిర్వేస్(81 శాతం), ఎయిర్ ఇండియా(79 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. - గత ఏడాది ఆగస్టులో కంటే ఈ ఏడాది ఆగస్టులో ఎయిర్ ఇండియా ప్రయాణికుల సంఖ్య రెండు లక్షలు పెరిగింది. - ఇక దేశీయ ఎయిర్ ట్రాఫిల్లో 35.3 శాతం వాటాతో ఇండిగో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జెట్, జెట్ లైట్(23 శాతం), ఎయిర్ ఇండియా(17 శాతం), స్పైస్ జెట్(12 శాతం), గో ఎయిర్ (8 శాతం) ఉన్నాయి. -
పొరపడిన పైలట్
సముద్రంపై దించబోయి.. టోక్యో: ఓ పైలట్ పొరపాటుగా విమానాన్ని సముద్రంపై దించబోయాడు. చివరి క్షణంలో తప్పును గ్రహించడంతో ప్రమాదం తప్పింది. పైలట్ చర్య ప్రయాణికులను, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లను కంగారు పెట్టించింది. జపాన్‌లోని ఇషిగాకి ఐలాండ్ నుంచి 59 మందితో సోమవారం నాహాకు బయల్దేరిన విమానం... గమ్యస్థానానికి చేరువైంది. ఇంతలో ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్ల నుంచి సూచనలు అందాయి. వాటిని పైలట్ పొరపాటుగా అర్థం చేసుకున్నాడు. దాంతో విమానాశ్రయం రాకముందే... సముద్రంపైనే దించబోయాడు. విమానం 75 మీటర్ల ఎత్తు వరకు కిందికి వచ్చేసింది. చివరికి గ్రౌండ్ ప్రాక్సిమిటీ నుంచి హెచ్చరికలు రావడంతో పైలట్ విమానాన్ని పైకి మళ్లించి... విమానాశ్రయంలో సురక్షితంగా దింపాడు. -
రాత్రికి రెక్కలు
విశాఖ నుంచి సర్వీసులు నడిపేందుకు వివిధ దేశాల ఆసక్తి సాక్షి, విశాఖపట్నం: మన విమానాశ్రయంలో రాత్రి వేళ విమానాలు తిరిగేందుకు రంగం సిద్ధమైంది. ఐఎన్‌ఎస్‌డేగాలో సిబ్బంది కొరత, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో శిక్షణ పొందిన సిబ్బంది లేకపోవడం కారణంగా 24+7సేవలు ఆరంభం కాలేదు. ఈనెల 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో సేవలు ప్రారంభమైనప్పటికీ రన్‌వే నిర్వహణ పనుల కారణంగా 15రోజులు ఆలస్యమైంది. ప్రస్తుతం ఏ విమాన సంస్థ ముందుకు వచ్చినా సౌకర్యాలు కల్పించేందుకు సిద్దంగా ఉన్నామని ఎయిర్పోర్ట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు దేశాల విమాన సంస్థలు గతంలో విశాఖ వచ్చి ఇక్కడి పరిస్థితిని పరిశీలించి వెళ్లారు. విశాఖలో రాత్రి వేళ విమానాలు నడిపేందుకు సౌకర్యాలు కల్పిస్తే వీలైనంత తొందర్లోనే సేవలు ప్రారంభిస్తామని ప్రకటించడంతో ఇక్కడి పలు విమాన ప్రయాణికుల సంఘాలు ఆ దిశగా ప్రయత్నించాయి. గతంలో సింగపూర్ విమానం వారంలో మూడు రోజులు మాత్రమే సర్వీసులుండగా ప్రస్తుతం ప్రతి బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో విమానాలు నడుస్తున్నాయి. తక్కువ ధరల కే విదేశాలకు వచ్చేనెలలో ఎయిర్‌లైన్స్ సంస్థలతో సమావేశం పెట్టదలిచాం. ట్రా వెల్స్, టూర్ సంస్థల్నీ ఆహ్వానిస్తాం. మంత్రుల్నీ పిలుస్తాం. లంక, థాయ్‌లాండ్, మలేషియా, దుబాయ్ ఎమిరేట్స్ విమాన సంస్థల్ని సంప్రదిస్తాం. టైగర్ ఎయిర్వేస్ అందుబాట్లోకి వస్తే తక్కువ ధరలకే వివిధ దేశాలకు వెళ్లొచ్చు. విశాఖ-కొలంబో విమానం త్వరలోనే రాబోతోంది. - పి. విష్ణుకుమార్‌రాజు, విశాఖ డెవలెప్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్ని విమానాలొచ్చినా సిద్ధమే వచ్చే నెల నుంచి ఎయిర్ కోస్టా సేవలు ప్రారంభ మవుతున్నాయి. డీజీసీఏ నుంచి వివరాలు అం దాల్సి ఉంది. నిత్యం ఉదయం 11గంటలకు విశాఖ నుంచి బెంగళూరుకు సర్వీసు నడిపేందుకు సిద్ధం గా ఉన్నారు. చెన్నయ్‌కు కూడా సర్వీసులు నడిపే అవకాశం ఉంది. ఎయిర్‌కోస్టాకు బుకింగ్ కార్యాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పాత టెర్మినల్‌లో కార్గో సేవలు ప్రారంభిం చేందుకు వీలుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రామన్. ఎయిర్పోర్ట్ టెర్మినల్ మేనేజర్. -
10 శాతం పెరిగిన ఎయిర్ ట్రాఫిక్
న్యూఢిల్లీ: దేశీయ విమానయానం అక్టోబర్‌లో పుంజుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లో ఎయిర్‌ట్రాఫిక్ 10 శాతం వృద్ధి చెందింది. మొత్తం ప్రయాణికుల్లో మూడో వంతు ప్రయాణికులు ఇండిగో విమానయాన సంస్థ ద్వారా ప్రయాణించారని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాలు వెల్లడించాయి. దేశీయ విమానయానానికి సంబంధించిన ఈ వివరాల ప్రకారం..., 2012లో 4.83 కోట్ల మంది విమానయానం చేయగా, ఈ ఏడాది జనవరి-అక్టోబర్ కాలానికి 5.07 కోట్ల మంది విమానయానం చేశారు. 5 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్‌లో 45.55 లక్షలుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య అక్టోబర్‌లో 9.9 శాతం వృద్ధితో 50.08 లక్షలకు పెరిగింది. 30.2 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. 20 శాతం మార్కెట్ వాటాతో స్పైస్ జెట్ రెండో స్థానంలో నిలిచింది. జెట్ ఎయిర్వేస్-జెట్‌లైట్‌లు సంయుక్తంగా 23.8 శాతం మార్కెట్ వాటాను సాధించాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఎయిర్ ఇండియా(డొమెస్టిక్)(18.4 శాతం), గో ఎయిర్(7.7 శాతం), ఎయిర్ కోస్టా(0.1 శాతం) ఉన్నాయి.