10 శాతం పెరిగిన ఎయిర్ ట్రాఫిక్
న్యూఢిల్లీ: దేశీయ విమానయానం అక్టోబర్‌లో పుంజుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లో ఎయిర్‌ట్రాఫిక్ 10 శాతం వృద్ధి చెందింది. మొత్తం ప్రయాణికుల్లో మూడో వంతు ప్రయాణికులు ఇండిగో విమానయాన సంస్థ ద్వారా ప్రయాణించారని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాలు వెల్లడించాయి. దేశీయ విమానయానానికి సంబంధించిన ఈ వివరాల ప్రకారం...,
2012లో 4.83 కోట్ల మంది విమానయానం చేయగా, ఈ ఏడాది జనవరి-అక్టోబర్ కాలానికి 5.07 కోట్ల మంది విమానయానం చేశారు. 5 శాతం వృద్ధి నమోదైంది.
సెప్టెంబర్‌లో 45.55 లక్షలుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య అక్టోబర్‌లో 9.9 శాతం వృద్ధితో 50.08 లక్షలకు పెరిగింది. 30.2 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది.
20 శాతం మార్కెట్ వాటాతో స్పైస్ జెట్ రెండో స్థానంలో నిలిచింది. జెట్ ఎయిర్‌వేస్-జెట్‌లైట్‌లు సంయుక్తంగా 23.8 శాతం మార్కెట్ వాటాను సాధించాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఎయిర్ ఇండియా(డొమెస్టిక్)(18.4 శాతం), గో ఎయిర్(7.7 శాతం), ఎయిర్ కోస్టా(0.1 శాతం) ఉన్నాయి.