19 శాతం పెరిగిన దేశీయ ఎయిర్ ట్రాఫిక్
- కొనసాగుతున్న ఇండిగో అగ్రస్థానం
- ఆగస్టు గణాంకాలను వెల్లడించిన డీజీసీఏ
న్యూఢిల్లీ: దేశీయ ఎయిర్ ట్రాఫిక్ గత నెలలో 19 శాతం వృద్ధి సాధించిందని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. గత ఏడాది ఆగస్టులో 56.97 లక్షలుగా ఉన్న దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య ఈ ఏడాది ఆగస్టులో 67.60 లక్ష లకు పెరిగిందని పేర్కొంది. డీజీసీఏ వెల్లడించిన వివరాల ప్రకారం..
- ప్రయాణికుల సంఖ్య పెరిగినా, ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ మాత్రం ఈ ఏడాది జూలైతో పోల్చితే గత నెలలో తగ్గింది. టూరిస్ట్ సీజన్ ముగియడమే దీనికి ప్రధాన కారణం.
- దేశీయ మార్కెట్లో ఇండిగో అగ్రస్థానం కొనసాగుతోంది. గత నెలలో మొత్తం విమాన ప్రయాణికుల్లో మూడవ వంతు(23.85 లక్షల మంది) ఇండిగో ద్వారానే ప్రయాణించారు. ఇండిగో తర్వాతి స్థానాల్లో జెట్ ఎయిర్‌వేస్ జెట్‌లైట్‌తో కలిసి(15.9 లక్షలు), ఎయిర్ ఇండియా(11.25 లక్షలు), స్పైస్‌జెట్ (8.3 లక్షలు), గో ఎయిర్( 5.48 లక్షలు) నిలిచాయి.
- సీట్ ఫ్యాక్టర్ విషయంలో 92 శాతంతో స్పైస్‌జెట్ మొదటి స్థానంలో నిలిచింది. జెట్ ఎయిర్‌వేస్(81 శాతం), ఎయిర్ ఇండియా(79 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- గత ఏడాది ఆగస్టులో కంటే ఈ ఏడాది ఆగస్టులో ఎయిర్ ఇండియా ప్రయాణికుల సంఖ్య రెండు లక్షలు పెరిగింది.
- ఇక దేశీయ ఎయిర్ ట్రాఫిల్‌లో 35.3 శాతం వాటాతో ఇండిగో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జెట్, జెట్ లైట్(23 శాతం), ఎయిర్ ఇండియా(17 శాతం), స్పైస్ జెట్(12 శాతం), గో ఎయిర్ (8 శాతం) ఉన్నాయి.