ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మంది | Indian flights carried 1.31 crore passengers in August | Sakshi
Sakshi News home page

ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మంది

Published Sat, Sep 14 2024 11:29 AM | Last Updated on Sat, Sep 14 2024 11:43 AM

Indian flights carried 1.31 crore passengers in August

భారతీయ విమానయాన సంస్థలు ఆగస్టు నెలలో 1.31 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చినట్లు గణాంకాలు వెల్లడయ్యాయి. అంటే రోజూ దాదాపు 4.3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. 2023 ఆగస్టులో విమాన ప్రయాణికుల సంఖ్య 1.24 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్య ఈసారి 5.7 శాతం పెరిగింది. జులైలో నమోదైన 1.29 కోట్లమంది ప్రయాణికులతో పోలిస్తే ఇది ఎక్కువే. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నివేదిక విడుదల చేసింది.

డీజీసీఏ నివేదికలోని వివరాల ప్రకారం..గత నెలలో విమానాల ఆలస్యం కారణంగా 1,79,744 మంది ప్రయాణికులు ప్రభావితం చెందారు. వీరికి పరిహారంగా విమానయాన కంపెనీలు సుమారు రూ.2.44 కోట్లు వెచ్చించాయి. విమానాల రద్దు కారణంగా 38,599 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వీరికి రూ.1.14 కోట్లు నష్టపరిహారం ఇచ్చారు. ఆగస్టులో మొత్తం 728 మంది ప్రయాణికులకు వివిధ కారణాల వల్ల బోర్డింగ్ సదుపాయాన్ని అందించలేదు. దాంతో రూ.77.96 లక్షలు పరిహారం చెల్లించారు.

2024 జనవరి-ఆగస్టులో దేశీయ విమానయాన సంస్థల్లో 10.5 కోట్లమంది ప్రయాణించారు. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య 10.06 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 4.82 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. సమయపాలన పరంగా ఆగస్టులో ఆకాసా ఎయిర్ 71.2 శాతం కచ్చితత్వంతో విమానాలు నడిపి మొదటిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో విస్తారా (68.6 శాతం), ఏఐఎక్స్‌ కనెక్ట్ (66.8 శాతం), ఇండిగో, ఎయిర్ ఇండియా(66 శాతం), అలయన్స్ ఎయిర్(55.3 శాతం), స్పైస్‌జెట్ (31 శాతం) నిలిచాయి. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాల నిర్వహణ ఆధారంగా ఆన్‌టైమ్‌ ఫర్ఫార్మెన్స్‌ (ఓటీపీ)ను లెక్కించారు.

జూన్‌తో పోలిస్తే జులైలో 3.1 శాతం పెరిగిన మార్కెట్‌ వాటా ఆగస్టులో 2.3 శాతానికి పడిపోయింది. గతనెలలో ఇండిగో 62.4 శాతం, ఎయిర్ ఇండియా 14.7 శాతం, విస్తారా 10.3 శాతం, ఏఐఎక్స్‌ కనెక్ట్ 4.5 శాతం, ఆకాసా ఎయిర్ 4.4 శాతం, అలయన్స్ ఎయిర్ 0.9 శాతం మార్కెట్‌ వాటా నమోదు చేశాయి.

ఇదీ చదవండి: ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

విమాన ప్రయాణాలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం టైర్‌ 2, 3 నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. దాంతో విమాన ప్రయాణికులు పెరుగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాంతోపాటు విమానయాన కంపెనీల మధ్య పోటీ ఏర్పడి టికెట్‌ ధరలో రాయితీలు, ఆఫర్లు ప్రకటిస్తుండడంతో ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement