దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 2024 అక్టోబరులో 1.36 కోట్లు నమోదైందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ప్యాసింజర్ల సంఖ్య 5.3 శాతం పెరిగిందని వివరించింది.
డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం.. 2023 అక్టోబరులో 1.26 కోట్ల మంది దేశీయంగా వివిధ నగరాలకు విమాన ప్రయాణాలు సాగించారు. 2024 అక్టోబరులో బడ్జెట్ క్యారియర్ ఇండిగో 86.40 లక్షల మందిని వివిధ గమ్య స్థానాలకు చేర్చింది. తద్వారా 63.3 శాతం మార్కెట్ వాటాను సాధించింది. టాటా గ్రూప్ నడుపుతున్న ఎయిరిండియా 26.48 లక్షలు, విస్తారా 12.43 లక్షల మందికి సేవలు అందించాయి. ఎయిరిండియా గణాంకాల్లో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ల సంఖ్య కలిసే ఉంది.
ఇదీ చదవండి: మళ్లీ అవకాశం రాదేమో! తగ్గిన బంగారం ధరలు..
ఎయిరిండియా తన అనుబంధ సంస్థ ఏఐఎక్స్ కనెక్ట్‌ను తన అంతర్జాతీయ బడ్జెట్ విభాగం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తో 2024 అక్టోబర్ 1న విలీనం చేసింది. గత నెలలో టాటా గ్రూప్ విమాన సంస్థ మార్కెట్ వాటా 19.4 శాతం కాగా, విస్తారా 9.1 శాతంగా ఉంది. గతంలో టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య 51:49 శాతం జాయింట్ వెంచర్ అయిన విస్తారా కూడా నవంబర్ 12న ఎయిరిండియాలో విలీనం అయింది. రెండు టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ (ఎయిరిండియా, విస్తారా) గత నెలలో మొత్తం దేశీయ ప్రయాణికుల రద్దీలో 28.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆకాసా ఎయిర్ 6.16 లక్షల మందితో 5.4 శాతం, స్పైస్‌జెట్ 3.35 లక్షల మందితో 2.4 శాతం వాటా దక్కించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment