విమానంలో ఫొటోలకు డీజీసీఏ బ్రేక్!
తొలిసారి విమానం ఎక్కినప్పుడు సరదాగా ఉంటుంది. ఆ విషయాన్ని పది మందితో పంచుకోవాలని కూడా ఉంటుంది. అందుకోసం విమానం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, ప్రయాణంలో కూడా సెల్ఫీలు లేదా ఫొటోలు తీసుకుంటారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. కానీ ఇలాంటి చర్యలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బ్రేక్ వేసింది. విమాన ప్రయాణంలో ఏ దశలోనూ ఫొటోలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది కూడా ప్రయాణంలోని ఏ దశలో కూడా ఫొటోలు తీయొద్దని స్పష్టం చేసింది.
ఇటీవలి కాలంలో విమానాల్లో సెల్ఫీల సంస్కృతి ఎక్కువైందని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రధానంగా ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది, పైలట్లు కూడా తెగ సెల్ఫీలు తీసుకుంటున్నారని పలువురు అంటున్నారు. కాక్‌పిట్‌లో సైతం సెల్ఫీలు తీస్తున్నట్లు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తెలిసింది. ఆగస్టు 29వ తేదీన దీనిపై డీజీసీఏ ఒక సర్క్యులర్ జారీ చేసింది. దాని ప్రకారం విమాన ప్రయాణం సమయంలో ఫొటోలు తీసుకోవడం నిషేధం అని చెప్పారు.