న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాకు కష్టాలు వెన్నంటే ఉన్నట్టు ఉన్నాయి. విమాన ఆలస్యమైనందున ఈ విమానయాన సంస్థ భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తోంది. మే 9న ఢిల్లీ నుంచి చికాగో బయలుదేరిన విమానం ఆలస్యమైనందుకు 323 మంది ప్రయాణికులకు 8.8మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.59కోట్లు చెల్లించాల్సి వస్తోంది. విమాన సిబ్బందికి సంబంధించిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ వల్ల ఈ ఆలస్యం ఏర్పడింది.
మే 9న ఢిల్లీ నుంచి చికాగో బయలుదేరిన ఏఐ 127 విమానం 16 గంటల్లో చికాగో చేరుకోవాల్సి ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల విమానాన్ని చికాగోకు సమీపంలోని మిల్‌వాకీ ప్రాంతానికి తరలించారు. మిల్‌వాకీ నుంచి చికాగోకు విమానంలో వెళ్లడానికి 19 నిమిషాలే సమయం పడుతుంది. ఆ సమయానికే ఆ విమానం 16 గంటలు ప్రయాణించింది. డీజీసీఏ నిబంధలన ప్రకారం విమానంలోని సిబ్బంది డ్యూటీ గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదు. దీంతో విమానంలోని సిబ్బంది డ్యూటీ గంటలు అయిపోయాయి. మరోవైపు నిబంధనలనుసరించి వారికి ఆ రోజుకు ఒక్కసారి మాత్రమే ల్యాండింగ్‌కు అనుమతి ఉంది. ఈ కారణాలతో మరో మార్గం లేక ఎయిరిండియా ఆ విమానం కోసం కొత్త సిబ్బందిని రోడ్డుమార్గంలో మిల్‌వాకీకి తరలించింది.
ఈ మొత్తం ప్రక్రియ వల్ల ఆ విమానం చికాగో చేరుకోవడానికి దాదాపు ఆరు గంటలు ఆలస్యమైంది. ఇన్ని గంటల పాటు కూడా ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు. ఆరు గంటల ఆలస్యంగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చింది. అంతటితో సమస్య ముగిసిపోయిందనుకున్న ఎయిరిండియా మరో పెద్ద సమస్యే ఎదురైంది. అమెరికా నిబంధనల ప్రకారం ప్రయాణికులు విమానంలో ఉండగా నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం నిలిపి ఉంచితే విమాన ఆలస్యంపై ఆ విమానయాన సంస్థ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఒక్కో ప్రయాణికుడికి 27,500డాలర్ల పరిహారం చెల్లించాలి. అంటే ఆ విమానంలో 323 మంది ప్రయాణికులు ఉన్నందున మొత్తం కలిపి 8.8మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారీ మొత్తంలో పెనాల్టీ చెల్లించాల్సి వస్తున్నందున డీజీసీఏ నిబంధనల్లో కొన్ని మార్పులు కోరుతూ ఎయిరిండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ ఫిర్యాదు మే 15న ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణలో తాము వాతావరణ ప్రతికూలతతోనే విమానాన్ని దారి మరలించాల్సి వచ్చిందని ఎయిరిండియా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment