ఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భారీ జరిమానా విధించింది. వీల్‌చైర్ సౌకర్యం కల్పించకపోవటంతో 80 ఏళ్ల ప్రయాణికుడు మృతి చెందిన ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఫిబ్రవరి 16న ముంబైలో చోటు చేసుకుంది.
ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం నుంచి టెర్మినల్ వరకు ఆ ప్రయాణికుడికి వీల్ ఛైర్ సౌకర్యం కల్పించపోవటంపై డీజీసీఏ సీరియస్ అయింది. ఈ ఘటనపై ఎయిరిండియాకు డీజీసీఏ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఏడు రోజుల్లో ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పూర్తి వివరణ ఇవ్వాలంది. అదే విధంగా ఎయిర్ ఇండియా రూ. 30 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
‘ ఇద్దరు ప్రయాణికులు ఫిబ్రవరి 12న న్యూయార్క్ నుంచి ముంబైకి వచ్చారు. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడు, ఆయన భార్య ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. అయితే వీల్ చైర్‌లకు అధిక డిమాండ్ ఉండటంతో ఆయన భార్యకు వీల్ చైర్ సౌకర్యం కల్పిచాం. ఆయనకు సైతం కల్పిస్తామని సిబ్బంది విజ్ఞప్తి చేసింది. కానీ ఆయన వినకుండా తన భార్యతో పాటు నడుచుకుంటూ వెళ్లారు’ అని ఎయిరిండియా తెలిపింది.
అయితే డీజీసీఏ చేపట్టిన విచారణలో ఎయిరిండియా దివ్యాంగులు, వృద్ధులకు కల్పించాల్సిన వీల్ చైర్ సౌకర్య నిబంధనలు సరిగ్గా పాటించటం లేదని తేలింది. ఈ ఘటన నేపథ్యంలో.. ప్రయాణికులకు అవసరమైన వీల్ చైర్లను అందుబాటులో ఉంచాల్సిందేనని విమాన సంస్థలకు డీజీసీఏ నొక్కి చెప్పింది.
చదవండి: 1993 రైలు బాంబు పేలుళ్ల కేసులో ‘డాక్టర్ బాంబ్’ తుండాకు ఊరట!
Comments
Please login to add a commentAdd a comment