ఢిల్లీ: పొగమంచు కారణంగా రాష్ట్ర రాజధానిలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పదుల సంఖ్యలో విమానాలు రద్దు అవుతుండగా.. చాలామట్టుకు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో సహనం కోల్పోతున్న ప్రయాణికులు.. విమానయాన సంస్థల సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్నారు. ఇండిగో ఫ్లైట్ సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటనా చూశాం. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దిద్దుబాటు చర్యకు దిగింది.
మూడు గంటలకు మించి ఆలస్యమయ్యే అవకాశం ఉన్న సమయంలో వాటిని ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని విమానయాన సంస్థలకు చెబుతూనే.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెబుతూ కొన్ని డీజీసీఏ సిఫార్సులు విడుదల చేసింది.
తాజాగా పొగమంచు ఎఫెక్ట్‌తో విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. లాంజ్, భోజనం వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బోర్డింగ్ ఏరియాలో పడిగాపులు కాస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో.. విమానం గనుక మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే ముందుగానే రద్దు చేసుకోవచ్చని DGCA తెలిపింది. అయితే.. ఫ్లైట్ రద్దు, ముందస్తు నోటీసు లేకుండా ఆలస్యం, బోర్డింగ్ నిరాకరించబడిన సందర్భంలో ప్రయాణీకులకు పూర్తి రక్షణ, ఇతర సౌకర్యాల్ని అందించాలి. ఈ నిబంధనలను వెంటనే పాటించాలని అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది.
విమానాశ్రయంలో రద్దీని నివారించడం, ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడం లక్ష్యంగా డీజీసీఏ ఈ సిఫార్సులు చేసినట్లు వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, విమాన రద్దును పరిగణించాలి. ఈ సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. విమాన సంబంధిత విమానయాన సంస్థ వెబ్‌సైట్‌లో విమాన ఆలస్యం గురించి ఖచ్చితమైన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి. ముందస్తు సమాచారం తప్పనిసరిగా ప్రయాణీకులకు ఎస్సెమ్మెస్‌గానీ, వాట్సాప్ ద్వారాగానీ, లేదంటే ఈ-మెయిల్ రూపంలో గానీ తెలియజేయాలి. ప్రయాణీకులకు ఆలస్యం గురించి నిర్దిష్ట సమాచారం అందించాలి. ప్రయాణికులకు సలహాలు, సూచనలు అందించడానికి సిబ్బందిని ఏర్పాటు చేయాలి అని DGCA పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment