
ఢిల్లీ: ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో.. చలిగాలుల ప్రభావం దేశమంతటా కనిపిస్తోంది. దేశ రాజధానిలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దట్టంగా పొగమంచు కమ్మేయడంతో(zero visibility) రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సుమారు 100 దాకా విమానాలు, పలు రైళ్లు రద్దు అయ్యాయి. ఇక రెండు వారాల తర్వాత ఇవాళ స్కూల్స్ తెరుచుకోవాల్సి ఉండగా.. చలి కారణంగా వేళల్లో మార్పులు చేశారు.
ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి.. పొగ మంచు తోడు కావడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఉదయం 11 గంటలకైనా సూర్యుడి కనిపించడం లేదు. పొగమంచుతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. సోమవారం ఉదయం వంద విమాన సర్వీసులు రద్దు కాగా.. మరో 128 సర్వీసులు గంటకు తక్కువ కాకుండా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో సంయమనం పాటించాలని ప్రయాణికులను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కోరుతోంది. మరోవైపు ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
దేశ రాజధాని ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ వద్ద కొనసాగుతోంది. శుక్రవారం అది రికార్డు స్థాయిలో 3.9గా.. శనివారం ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్ నమోదు అయిన సంగతి తెలిసిందే. మరోవైపు వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment