flights delayed
-
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమానాల రాకపోకలపై ప్రభావం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. ఓ వైపు వాయు కాలుష్యం.. మరోవైపు యమన నదిలో విషపునురగతో దేశ రాజధాని సతమతమవుతోంది. రెండు రోజులుగా తీవ్రమైన కేటగిరిలో గాలి నాణ్యత కొనసాగుతోంది. గురువారం ఉదయం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవరించింది.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 500 స్థాయికి దగ్గరవుతుంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 473గా నమోదైంది. ఫలితంగా విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. దాంతో రోడ్లపై వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించకపోవడంతో ఇబ్బందులుపడ్డారు.దేశ రాజధానిలో కాలుష్యం పెరిగి, దట్టమైన పొగ కమ్ముకోవడంతో విజిబిలిటీ తగ్గింది. ఇది విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్‌కు రాకపోకలు సాగించే సుమారు 300కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఫ్లైట్ రాడార్ 24 సంస్థ తెలిపింది. వీటిలో 115 విమానాలు ఢిల్లీకి వచ్చేవి ఉండగా.. రాజధాని నుంచి బయలు దేరాల్సిన 226 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు పేర్కొంది. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు పేర్కొంది. సగటున 17 నుంచి 54 నిమిషాలు ఆలస్యంగా విమానాలు నడుస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ పొగమంచు రైళ్ల రాకపోలకపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. -
ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపు
ముంబయిలో కురిసిన భారీ వర్షానికి విమాన సర్వీసులను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసందానంగా ఉన్న రైలు రోడ్డు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా విమానాశ్రయంలో నీరు చేరడంతో సర్వీసులను ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలుమొత్తం 14 విమానాలను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇండిగోకు చెందిన తొమ్మిది విమానాలు, విస్తారా-రెండు, ఎయిరిండియా, ఆకాసా ఎయిర్, గల్ఫ్ ఎయిర్ ఒక్కోటి చొప్పున ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఆయా విమానాలను హైదరాబాద్‌కు ఏడు, అహ్మదాబాద్‌కు నాలుగు, గోవాకు రెండు, ఉదయపూర్(1)కు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబయికు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం నగరంలో కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. -
ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: మంత్రి రామ్మోహన్ నాయుడు
సాక్షి, ఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సాంకేతిక సమస్య భారత్ సహా ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని చోట్ల ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల ఇబ్బందులకు దృష్టిపెట్టుకుని వారికి తగిన ఏర్పాట్లు చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.ఇక, మైక్రోసాఫ్ట్ సర్వర్ సమస్య నేపథ్యంలో రామ్మెహన్ నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల పట్ల విమానాశ్రయ అధికారులు, విమానయాన సంస్థలు సానుభూతితో వ్యవహరించాలి. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణికులకు అదనపు సీటింగ్, వాటర్, ఆహారాన్ని అందించండి. ప్రయాణీకుల సురక్షిత ప్రయాణం కోసం టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. ఇలాంటి సమాయాల్లో ప్రయాణీకుల సహకారం కూడా తప్పకుండా అవసరం. టెక్నికల్ సమస్య, విమాన సర్వీసుల రాకపోకలపై ఎలాంటి అప్డేట్ ఉన్నా ప్రయాణీకులకు వెంటనే తెలియజేయాలని ఆదేశించినట్టు తెలిపారు.విమానాశ్రయాల్లో ప్రయాణీకుల అవసరాల కోసం అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థతో అధికారులు టచ్‌లోనే ఉన్నారు. వీలైనంత త్వరగా మామూలు పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. విశాఖ, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణీకులకు టెన్షన్!
సాక్షి, హైదరాబాద్/విశాఖ: మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ సమస్య కాస్తా ఎయిర్‌లైన్స్ సర్వర్లపై ప్రభావం చూపించడంతో పలు విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి.కాగా, విశాఖలో ఎయిర్ లైన్స్‌లో సాంకేతిక సమస్య కారణంగా విమానాల ఆపరేషన్‌లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో, ఎయిర్‌పోర్టు సిబ్బంది మాన్యువల్‌గా బోర్డింగ్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ కారణంగా ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు రద్దీ పెరిగింది. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణం ఆలస్యమవుతోంది.ఇదిలా ఉండగా.. ఇటు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సర్వర్‌లో టెక్నికల్ సమస్య కారణంగా దాదాపు 35 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు సంబంధించిన డిస్ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో అధికారులు మాన్యువల్‌గా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక, వివిధ రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గన్నవరంలో ఇదీ పరిస్థితి..మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్యతో గన్నవరం విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గన్నవరం నుండి ప్రతీరోజూ 23 విమాన సర్వీసులు వివిధ ప్రాంతాలకు నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపంతో 13 సర్వీసులు మాత్రమే గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లాయి. మరో ఏడు సర్వీసులు ఆలస్యంగా బయలుదేరి వెళ్లాయి. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులో ఇదే పరిస్థితి ఉంది. గన్నవరంలో టికెట్ కౌంటర్లో ప్రయాణీకులకు టికెట్లు ఇవ్వడం నిలిపివేయడం జరిగింది. మాన్యువల్‌గా బోర్డింగ్ పాస్ ఇచ్చి ప్రయాణికులను పంపిస్తున్నామని తెలిపారు. -
గన్నవరం: పొగమంచు ఎఫెక్ట్.. గాల్లోనే విమానాల చక్కర్లు
సాక్షి,కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు ఎఫెక్ట్‌తో విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. షార్జా నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం పది రౌండ్లు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు ఏటీసీ అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించకపోవడంతో విమానం హైదరాబాద్ వైపు మళ్లింది. పొగమంచు కారణంగా రన్ వే కనిపించకపోవడంతో విమానాల ల్యాండింగ్‌కు ఆలస్యం అవుతోంది. దీంతో విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో ఇటీవలి కాలంలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తరచు అంతరాయం ఏర్పడుతోంది. ఇదీ చదవండి.. మిలాన్ విన్యాసాలు ప్రారంభం -
గన్నవరం: దట్టమైన పొగ మంచు ఎఫెక్ట్.. గాల్లోనే విమానాల చక్కర్లు
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. ఇక, దట్టమైన పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, గన్నవరంలో ల్యాండ్ అవాల్సిన విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల ప్రకారం.. గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా రన్ వే కనిపించకపోవడంతో విమానాల ల్యాండింగ్‌కు ఆలస్యం అవుతోంది. గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. దట్టమైన పొగ మంచు కారణంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చిన విమానాల్లు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. ఇక, ఉదయం తొమ్మిది గంటల సమయం దాటిన తర్వాత పొగ మంచు వీడిపోవడంతో 10 రౌండ్లు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం, ఇండిగో విమానాలు సేఫ్‌గా ల్యాండ్ అయ్యాయి. దీంతో, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఇండిగో, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు జరిమానా
ముంబై: విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్‌వే పక్కనే నేలపై కూర్చుని భోజనంచేసిన ఘటనలో ఇండిగో విమానయాన సంస్థ, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఆగ్రహం వ్యక్తంచేసి జరిమానా విధించాయి. ప్రయాణికుల అసౌకర్యానికి కారణమైన ఇండిగో సంస్థపై రూ.1.5 కోట్ల జరిమానా, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై రూ.90 లక్షల జరిమానా విధించాయి. ఒక పౌరవిమానయాన సంస్థపై ఇంతటి భారీ జరిమానా పడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారికావడం గమనార్హం. జనవరి 15వ తేదీన గోవా నుంచి బయల్దేరిన విమానం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగమంచు కారణంగా ఢిల్లీకి బదులు ముంబైలో దిగింది. చాలాసేపు విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులు విసిగిపోయి కిందకు దిగొచ్చి రన్‌వే పక్కనే కూర్చుని భోజనాలు చేశారు. ఈ ఘటనను పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. బీసీఏఎస్ అడిగేదాకా ఈ విషయంలో ఇండిగో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. రన్‌వేపై ప్రయాణికుల కదలికలను నియంత్రించకుండా ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారని డీజీసీఏ ఆక్షేపించింది. -
Flight Delays: శశి థరూర్‌కు సింధియా కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా ఇటీవల పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. విమానాల రద్దు, కొన్ని ఆలస్యంగా బయలుదేరటంతో విమానా ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కౌంటర్ ఇచ్చారు. డేటా మైనింగ్ వలే ఇంటర్నెట్ నుంచి కేవలం కొన్ని ప్రెస్ ఆర్టీకల్స్‌ను సేకరించి ‘పరిశోధన’ అంటే ఎలా? అని ఎద్దేవా చేశారు. వాస్తవ నిజాలు.. సాంకేతిక రంగం వంటి విమానయానం గురించి శశిథరూర్, కాంగ్రెస్ ఐటీ సెల్ వాళ్లకు అర్థం చేసుకోవడానికి సహయ పడతాయని అన్నారు. విమానయానం వంటి రంగంలోని సంక్లిష్టత అర్థం చేసుకోకపోవటం థరూర్, కాంగ్రెస్ ఐటీసెల్ వెనకబాటుతనానికి నిదర్శనమని సింధియా ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. 1/6 It is for someone who is lost in his esoteric world of thesaurus that data mining of selective press articles from the internet qualifies as “research”. Here are some actual facts for arm-chair critic @ShashiTharoor and the Cong IT Cell that might help tackle their lack of… https://t.co/hA3sijtjr8 — Jyotiraditya M. Scindia (@JM_Scindia) January 17, 2024 ఇటీవల ఢిల్లీలో కప్పేసిన పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు, ఆసల్యం కావటంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాశారు. నిరసనగా రన్‌వే పైనే విమాన ప్రయాణికులు భోజనం చేశారు. దీనికంటే ముందు విమానం ఆసల్యం ఉందని ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన ఓ ప్రయానికుడు ఏకంగా విమానం పైలట్‌పైకే దాడికి యత్నించాడు. ఈ విషయంపై స్పందించిన విమానయాన శాఖ మంత్రి సింధియా.. పొగ మంచు నేపథ్యంలో విమానాల ఆలస్యంపై చర్యలు తీసుకుంటామని, ప్రయాణికుల రక్షణ కోసమే విమానాలు కొంత ఆలస్యం అవుతున్నాయని ఆయన వివరణ కూడా ఇచ్చారు. అయితే.. విమానాల ఆలస్యంపై శశి థరూర్ స్పందిస్తూ.. సంకాంత్రి పండగ సమయంలో విమాన ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడటం ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శమని విమర్శలు గుప్పించారు. చదవండి: అమ్మాయి మీద వెకిలి జోకు.. ఒకరు బలి -
విమానాల ఆలస్యంపై ఆందోళనలు.. దిద్దుబాటు చర్యలు!
ఢిల్లీ: పొగమంచు కారణంగా రాష్ట్ర రాజధానిలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పదుల సంఖ్యలో విమానాలు రద్దు అవుతుండగా.. చాలామట్టుకు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో సహనం కోల్పోతున్న ప్రయాణికులు.. విమానయాన సంస్థల సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్నారు. ఇండిగో ఫ్లైట్ సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటనా చూశాం. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దిద్దుబాటు చర్యకు దిగింది. మూడు గంటలకు మించి ఆలస్యమయ్యే అవకాశం ఉన్న సమయంలో వాటిని ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని విమానయాన సంస్థలకు చెబుతూనే.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెబుతూ కొన్ని డీజీసీఏ సిఫార్సులు విడుదల చేసింది. తాజాగా పొగమంచు ఎఫెక్ట్‌తో విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. లాంజ్, భోజనం వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బోర్డింగ్ ఏరియాలో పడిగాపులు కాస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో.. విమానం గనుక మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే ముందుగానే రద్దు చేసుకోవచ్చని DGCA తెలిపింది. అయితే.. ఫ్లైట్ రద్దు, ముందస్తు నోటీసు లేకుండా ఆలస్యం, బోర్డింగ్ నిరాకరించబడిన సందర్భంలో ప్రయాణీకులకు పూర్తి రక్షణ, ఇతర సౌకర్యాల్ని అందించాలి. ఈ నిబంధనలను వెంటనే పాటించాలని అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. విమానాశ్రయంలో రద్దీని నివారించడం, ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడం లక్ష్యంగా డీజీసీఏ ఈ సిఫార్సులు చేసినట్లు వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, విమాన రద్దును పరిగణించాలి. ఈ సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. విమాన సంబంధిత విమానయాన సంస్థ వెబ్సైట్లో విమాన ఆలస్యం గురించి ఖచ్చితమైన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి. ముందస్తు సమాచారం తప్పనిసరిగా ప్రయాణీకులకు ఎస్సెమ్మెస్గానీ, వాట్సాప్ ద్వారాగానీ, లేదంటే ఈ-మెయిల్ రూపంలో గానీ తెలియజేయాలి. ప్రయాణీకులకు ఆలస్యం గురించి నిర్దిష్ట సమాచారం అందించాలి. ప్రయాణికులకు సలహాలు, సూచనలు అందించడానికి సిబ్బందిని ఏర్పాటు చేయాలి అని DGCA పేర్కొంది. -
బెంబేలెత్తిస్తున్న పొగమంచు.. ఢిల్లీ అతలాకుతలం
ఢిల్లీ: ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో.. చలిగాలుల ప్రభావం దేశమంతటా కనిపిస్తోంది. దేశ రాజధానిలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దట్టంగా పొగమంచు కమ్మేయడంతో(zero visibility) రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సుమారు 100 దాకా విమానాలు, పలు రైళ్లు రద్దు అయ్యాయి. ఇక రెండు వారాల తర్వాత ఇవాళ స్కూల్స్ తెరుచుకోవాల్సి ఉండగా.. చలి కారణంగా వేళల్లో మార్పులు చేశారు. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి.. పొగ మంచు తోడు కావడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఉదయం 11 గంటలకైనా సూర్యుడి కనిపించడం లేదు. పొగమంచుతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. సోమవారం ఉదయం వంద విమాన సర్వీసులు రద్దు కాగా.. మరో 128 సర్వీసులు గంటకు తక్కువ కాకుండా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో సంయమనం పాటించాలని ప్రయాణికులను ఢిల్లీ ఎయిర్పోర్ట్ కోరుతోంది. మరోవైపు ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ వద్ద కొనసాగుతోంది. శుక్రవారం అది రికార్డు స్థాయిలో 3.9గా.. శనివారం ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్ నమోదు అయిన సంగతి తెలిసిందే. మరోవైపు వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. -
పొగమంచు ఎఫెక్ట్: స్కూల్స్ బంద్, విమానాలు ఆలస్యం
ఢిల్లీ: ఉత్తరాదిన పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీగా కురుస్తున్న పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు కారణంగా పలు చోట్ల విద్యాసంస్థలను సెలవు కూడా ప్రకటించారు. ఇక, వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, ఐఎండీ అంచనాల ప్రకారం.. మరో రెండు రోజులు కూడా ఈ చలి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. ఉత్తరాదితోపాటు తూర్పు భారతదేశంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. రానున్న రెండు, మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక మధ్య భారతంలో చలి తీవ్రత రాబోయే మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. VIDEO | Visibility reduces to near-zero in Uttar Pradesh's Rae Bareli due to dense #fog in the region.#WeatherUpdate pic.twitter.com/BnF3A5HtTL — Press Trust of India (@PTI_News) January 4, 2024 వివరాల ప్రకారం.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, త్రిపుర, జమ్మూ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. గురువారం తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం ఏడు గంటలు దాటినా రోడ్డు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు, పొగమంచు ప్రభావం అటు విమానాలు, రైళ్ల రాకపోకలపై కూడా పడుతుండటంతో పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు విమానాలు ఆలస్యంగా ప్రయాణించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా, దక్షిణ భారతంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శీతల గాలుల కారణంగా చలి తీవ్రత పెరిగింది. VIDEO | Dense fog cover shrouds parts of Rajasthan's capital #Jaipur as severe cold conditions prevail in the region.#WeatherUpdate (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/Na1zKoMbVG — Press Trust of India (@PTI_News) January 4, 2024 -
ఉత్తరాదిని కమ్మేసిన దట్టమైన పొగమంచు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. రహదారులపై వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ప్రయాణాలు నిలిచిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నాలుగు రాష్ట్రాలలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా శుక్రవారం దేశవ్యాప్తంగా 274 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 80కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
337 విమానాలు ఆలస్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీని పొగమంచు కష్టాలు వదలట్లేవు. వరుసగా నాలుగో రోజు దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 337 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. కొన్ని విమానాలను సమీపంలోని ఇతర ఎయిర్‌పోర్టులకు దారి మళ్లించారు. ఈ ఎయిర్ పోర్టు నుంచి ప్రతి రోజు దాదాపు 1200ల విమానాలు రాకపోకలు సాగిస్తాయి. కాగా.. పొగమంచు కారణంగా విమానాల రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తితే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా లేదా రద్దు చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రతి ఏడాది చలి కాలంలో నెల నుంచి నెలన్నర రోజులు ఇలాంటి పరిస్థితి తలెత్తడం సాధారణం. -
పొగమంచు గుప్పిట్లో ఉత్తర భారతం
న్యూఢిల్లీ/బాగ్పట్: ఉత్తర భారతదేశం పొగ మంచు గుప్పిట్లో చిక్కుకుంటోంది. దారులన్నీ దట్టమైన పొగ మంచుతో మూసుకుపోతున్నాయి. ముందున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచుకుతోడు చలి తీవ్ర నానాటికీ పెరుగుతోంది. నగరంలో నగరంలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా బుధవారం 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్నింటిని ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. ఢిల్లీకి చేరుకోవాల్సిన 25 రైళ్లు ఆలస్యంగా వచ్చాయి. ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యంగా నడుస్తుండడంపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ప్రయాణికులు తమ టికెట్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే రీషెడ్యూల్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చని సూచించింది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో పొగమంచు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో విజిబిలిటీ లెవెల్ 25 మీటర్లుగా నమోదైంది. హరియాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోనూ విజిబిలిటీ స్థాయి పడిపోయింది. ఆగ్రా, బరేలీ, భటిండాలో విజిబిలిటీ లెవెల్ సున్నాకు పడిపోవడం గమనార్హం. పొగ మంచు, కాలుష్యం వల్ల ఉత్తరాదిన వాయు నాణ్యత కూడా క్షీణిస్తోంది. తాజాగా సగటు వాయు నాణ్యత 381గా రికార్డయిం్యంది. ఇది ‘వెరీ పూర్’ కేటగిరీలోకి వస్తుందని అధికారులు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. పొగమంచు వల్ల 8 మంది మృతి విపరీతమైన పొగమంచు వల్ల దారి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారులపై వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొంటున్నాయి. ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం అర్ధరాత్రి తర్వాత, బుధవారం ఉదయం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మరణించారు. మరో 25 మందికిపైగా గాయాలపాలయ్యారు. బరేలీ జిల్లాలోని హఫీజ్‌గంజ్‌లో మోటార్ సైకిల్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. -
అమెరికాలో టోర్నడో బీభత్సం
లిటిల్‌రాక్ (యూఎస్): అమెరికాలో వారం క్రితం మిసిసిపి, పరిసర ప్రాంతాలను అల్లాడించిన ప్రాణాంతక టోర్నడో శుక్రవారం దక్షిణ, పశ్చిమమధ్య ప్రాంతాలను వణికించింది. అర్కన్సాస్, ఇల్లినాయీతో పాటు ఇండియానా, అలబామా రాష్ట్రాల్లోనూ పెను విధ్వంసం సృష్టించింది. గంటకు 100 కిలోమీటర్ల పై చిలుకు వేగంతో వచ్చి పడ్డ పెనుగాలుల ధాటికి ఎక్కడ చూసినా నేలమట్టమైన ఇళ్లు, షాపింగ్ సెంటర్లు తదితర భవనాలతో పరిస్థితి భయానకంగా మారింది. టోర్నడో బారిన పడి 18 మందికి పైగా మరణించగా డజన్ల మంది గాయపడ్డారు. అయోవా, ఓక్లహామా రాష్ట్రాల్లోనూ భారీ నష్టం సంభవించింది. దాదాపు 3 లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. పెనుగాలుల కారణంగా పలుచోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అత్యవసర, విపత్తు స్పందన బృందాలు రంగంలోకి దిగాయి. వచ్చే బుధవారం మరికొన్ని భారీ తుపాన్లు, టోర్నడోలు రావచ్చని వాతావరణ విభాగం హెచ్చరించింది. -
9/11 తర్వాత మళ్లీ ఇప్పుడే!
వాషింగ్టన్: ఒక చిన్న సాంకేతిక సమస్య తలెత్తడంతో.. కనివినీ ఎరుగని రీతిలో అగ్రరాజ్యంలో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం ఏకంగా 5,400 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరో 900 విమానాలు రద్దు అయినట్లు తెలుస్తోంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్అవేర్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. కంప్యూటర్ సిస్టమ్‌లో తలెత్తిన సమస్య ఈ గందరగోళానికి కారణమైంది. ఎయిర్ మిషన్స్ సిస్టమ్(NOTAM)లో సమస్యను గుర్తించిన వెంటనే గ్రౌండ్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. నోటామ్.. విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు చేర్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రమాదాల గురించి విమాన సిబ్బందిని అప్రమత్తం చేయడానికి పని చేస్తోంది. దీంతో.. విమానాలన్నీ ఎక్కడికక్కడే రన్‌వేపై ల్యాండ్ అయ్యాయి. హవాయ్ నుంచి వాషింగ్టన్, టెక్సాస్ నుంచి పెన్సిల్వేనియా రూట్లలో విపరీతమైన ప్రయాణికుల తాకిడి ఉంటుంది. విమానాల రాకపోకల నిలిపివేత, ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 9/11 అమెరికా దాడుల తర్వాత.. ఈ స్థాయిలో విమాన సర్వీసుల ఇబ్బందులు తలెత్తడం ఇదేనని పౌరవిమానయాన నిపుణులు పర్వేజ్ దామానియా తెలిపారు. ఈ పరిణామం నమ్మశక్యంగా లేదని, దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఇక విమాన సేవలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. గంటల తరబడి పడిగాపులు గాస్తున్నామని, అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే.. క్రమక్రమంగా సర్వీసులను పునరుద్ధరించినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్. మరోవైపు దేశీయ విమాన సర్వీసులను రెండు గంటలపాటు ఎక్కడికక్కడే నిలిపివేశారు. సమస్యను ఇంకా గుర్తించలేదని, మరోసారి ఇలాంటి సమస్య తలెత్తకుండా చూస్తామని ఎఫ్ఏఏ తాజాగా ప్రకటించింది. Update 6: We are continuing a thorough review to determine the root cause of the Notice to Air Missions (NOTAM) system outage. Our preliminary work has traced the outage to a damaged database file. At this time, there is no evidence of a cyber attack. (1/2) — The FAA ✈️ (@FAANews) January 11, 2023 -
భారీ సాంకేతిక లోపం.. అమెరికా అంతటా నిలిచిపోయిన విమానాలు
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో విమాన సర్వీసులకు ఆటంకం తలెత్తింది. దీంతో అమెరికా వ్యాప్తంగా దాదాపు 400 విమానాలు నిలిచిపోయాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య ఏర్పడటంతో యునైటెడ్ స్టేట్స్ అంతటా విమాన సర్వీసులు నిలిచిపోయినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు, చేర్పులు, వాతావరణ సమస్యలు, ప్రమాదాల గురించి పైలెట్లు, విమాన సిబ్బందిని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేసేందుకు ఎఫ్ఏఏ ఇచ్చే నోటామ్ (నోటీస్ టు ఎయిర్‌మిషన్)లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఎక్కడి విమానాలు అక్కడే అగిపోవడంతో దేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ‘ఫ్లైట్ అవేర్ యూఎస్’ ప్రకారం ఉదయం 5:31 గంటలకు యునైటెడ్ స్టేట్స్లో 400 విమానాలు ఆలస్యమైనట్లు తెలిపింది. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ సిస్టమ్‌ను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు ఎఫ్ఏఏ ఓ ప్రకటనలో తెలిపింది. జాతీయ గగనతల వ్యవస్థ అంతటా కార్యకలాపాలు ప్రభావితమవుతాయని పేర్కొంది. ఎప్పుడు పునరుద్ధరించబడుతుందనే ప్రశ్నకు సమయాన్ని వెల్లడించకపోవడం గమనార్హం. చదవండి: కోవిడ్ దెబ్బకు కుదేలవుతున్న చైనా! చికిత్స అందిచేందుకు కూడా.. -
చెన్నైలో భారీ వర్షాలు.. హైదారాబాద్, కర్నూల్ సహా 8 విమానాలు రద్దు
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో మదురై, హైదరాబాద్, కర్నూలు సహా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 8 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు.. చెన్నై డొమెస్టిక్ టెర్మినల్ నుంచి వెళ్లాల్సిన పలు సర్వీసులు నిలిపివేశారు. చెన్నై నుంచి ఫ్రాంక్ఫర్ట్, శ్రీలంక, పారిస్, దోహా, షార్జా, దుబాయ్, అండమాన్లకు వెళ్లే విమానాలు కూడా ఒక గంట ఆలస్యంగా నడిచాయి. వర్షం కారణంగా విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేయడంతో ఎలాంటి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఆలస్యంగా సమాచారం అందించామని వెల్లడించారు. ఇదీ చదవండి: తమిళనాడులో కుండపోత.. నిండుకుండలా చెన్నై.. సెలవు ప్రకటన.. హెచ్చరికలు -
హైదరాబాద్‌లో ఈదురు గాలులతో వర్ష బీభత్సం.. విమానాల దారి మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌లోని పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. కాసేపటికే వర్షంతో పాటు భారీగా ఈదురు గాలులు వీయడంతో పలు కాలనీల్లో కరెంట్ సప్లై నిలిచిపోయింది. pic.twitter.com/AhQYuP9TwH — IMD_Metcentrehyd (@metcentrehyd) April 21, 2022 ఇదిలా ఉండగా.. ఈదురు గాలులు బలంగా వీయడంతో వాతావరణం అనుకూలించక శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. ఇప్పటికే నాలుగు విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. రెండు విమానాలను ఏపీలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు మళ్లించగా.. ఢిల్లీ, ముంబై నుంచి రావాల్సిన విమానాలను బెంగళూరుకు మళ్లించారు. Wow..Rain Start..🌧️🌧️#Hyderabad #Office#Ramoji Film City#rain @HiHyderabad @Hyderabad_Bot @swachhhyd @Ramoji_FilmCity pic.twitter.com/nzBXNC0VCv — Priyanka Sahoo (@Priyank41223414) April 21, 2022 ఇది చదవండి: కంట్రోల్లోనే కరోనా.. మాస్క్‌లు ధరించాల్సిందే!: తెలంగాణ డీహెచ్ -
పొగమంచు.. గంట నుంచి గాల్లోనే విమానం చక్కర్లు
విజయవాడ: గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు కప్పేయడంతో ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‌కు అధికారులు సిగ్నల్ ఇవ్వకపోవడంతో గంట నుంచి స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. 67 మంది ప్రయాణికులతో స్పైస్ జెట్ SG3417 విమానం బెంగుళూరు నుంచి గన్నవరంకు వచ్చింది. అయితే ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడటంతో గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన ఎయ్ర్ ఇండియా విమానం సైతం పొగమంచు కారణంగా ల్యాండింగ్ అవ్వలేదు. దీంతో ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ రెండు విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. సుమారు గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన అనంతరం గన్నవరం ఎయర్‌పోర్ట్‌లో రెండు విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. దాదాపు 4 రౌండ్లు అనంతరం ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గన్నవరంలో ల్యాండ్ అయ్యింది. -
రెండోరోజూ విమానాల్లో జాప్యం
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా చెక్ ఇన్ సాఫ్ట్వేర్ శనివారం ఐదు గంటల పాటు నిలిచిపోవడం పెను ప్రభావం చూపుతోంది. ఆదివారం రెండో రోజు సైతం 137 విమానాల రాకపోకల్లో జాప్యం నెలకొంటుందని ఎయిర్ ఇండియా పేర్కొంది. విమానాల సగటు జాప్యం 197 నిమిషాలుగా అంచనా వేసినట్టు ఎయిర్‌లైన్ ప్రతినిధి వెల్లడించారు. కాగా, శనివారం ఉదయం 3.30 నుంచి 8.45 గంటల వరకూ ఎయిర్ ఇండియా పాసింజర్ సర్వీస్ సిస్టం (పీఎస్ఎస్) సాఫ్ట్వేర్ పనిచేయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టుల్లో వేలాది ప్రయాణీకులు నిలిచిపోయారు. సాఫ్ట్వేర్ షట్‌డౌన్‌తో శనివారం 149 విమానాల్లో జాప్యం చోటుచేసుకుందని ఆ ప్రతినిధి వెల్లడించారు. -
ఎయిరిండియాకు సాఫ్ట్వేర్ షాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ‘ఎయిరిండియా’ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వేలాది మంది ప్రయాణికుల సహనాన్ని పరీక్షించింది. శనివారం వేకువజాము నుంచి ఉదయం వరకు 155 విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో దేశ, విదేశాల్లో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. శనివారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఎయిరిండియా చెక్–ఇన్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య కారణంగా ప్రయాణికుల గుర్తింపు, బ్యాగేజి, రిజర్వేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా, దేశ, విదేశాల్లోని ఎయిరిండియా సిబ్బంది ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ జారీ చేయలేకపోయారు. దీంతో ఇందుకు అవసరమైన పాసింజర్ సర్వీస్ సిస్టం(పీఎస్ఎస్) సేవలందించే అమెరికాలోని అట్లాంటాకు చెందిన ‘సిటా’ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ యంత్రాంగం లోపాన్ని సరిదిద్దటానికి దాదాపు ఐదుగంటల సమయం తీసుకుంది. అనంతరం 8.45 గంటలకు ఎయిరిండియా తిరిగి సర్వీసులను పునరుద్ధరించింది. ఈ విషయమై ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) అశ్వనీ లొహానీ మాట్లాడుతూ.. ‘సాఫ్ట్వేర్ సమస్యలో లోపంపై సిటా విచారణ జరుపుతోంది. సాఫ్ట్వేర్ షట్డౌన్కు వైరస్‌నా లేక మరేదైనా కారణమా తెలుసుకునేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన తెలిపారు. ‘ఎక్కడ లోపం తలెత్తినా మేం పీఎస్ఎస్ వ్యవస్థను వాడుకుంటాం. కానీ, పీఎస్ఎస్లోనే సమస్య వచ్చింది. అందుకే వేరే మార్గాల్లో ప్రయాణికులకు వెంటనే సమాచారం అందించలేకపోయాం’ అని ఆయన వివరించారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను కమ్మేసిన పొగమంచు
సాక్షి, హైదరాబాద్: పెథాయ్ ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్ నగర శివార్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నుడుస్తున్నాయి. మరికొన్నింటిని బెంగళూరుకు మళ్లించారు. -
ముంబై ఎయిర్‌పోర్టు మూసివేత
ముంబై : ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ మూసివేయనున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇన్స్ట్రూమెంట్ లాండింగ్ సిస్టమ్(ఐఎల్ఎస్)ను అప్‌గ్రేడ్ చేయడం కోసం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల పాటు విమానాశ్రయం ప్రధాన రన్‌వేను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దట్టమైన మంచు, భారీ వర్షం పడుతున్న సందర్భాల్లో రన్‌వే స్పష్టంగా కనిపించక పోవడం వల్ల విమానాలను ల్యాండ్ చేయడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ‘ఐఎల్ఎస్’ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. గ్రౌండ్ బెస్డ్ ఇన్స్ట్ర్మెంట్ సిస్టమ్ ఆధారంగా, రేడియో సిగ్నల్స్‌తో పనిచేసే ఈ వ్యవస్థ విమానాలు ల్యాండ్ అయ్యే ప్రాంతానికి(రన్‌వే) సంబంధించిన పూర్తి సమాచారాన్ని పైలెట్‌కు తెలియజేస్తుంది. దానివల్ల విమానం సురక్షితంగా రన్‌వే మీద ల్యాండ్ అవుతుంది. మే18 నుంచి జరుగుతున్న ఈ ఐఎల్ఎస్ అప్‌గ్రేడ్ వల్ల ఈ మధ్య తరచుగా విమానాలు ఆలస్యం అవుతున్నాయి. గత నెలలో కూడా వర్షాకాలం ప్రారంభానికి ముందుగానే ప్రీ మాన్సూన్ పనులను పరిశీలించడానికి గాను ప్రధాన రన్‌వేను 6 గంటల పాటు మూసివేశారు. దానివల్ల ఒక్క రోజులోనే 200 విమానాలు రద్దయ్యాయి. మన దేశంలో నిత్యం బాగా రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఛత్రపతి శివాజీ విమానాశ్రయం రెండో స్ధానంలో ఉంది. దీని ప్రధాన రన్‌వే మీద గంటకు 48 విమానాలు టేక్ ఆఫ్, ల్యాండ్ అవుతుంటాయి. -
చెన్నైను కమ్మేసిన పొగమంచు..
సాక్షి, చెన్నై : చెన్నై నగరాన్ని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో పొగమంచు భారీగా పేరుకుపోవడంతో అధికారులు.. 12 విమానాలను దారి మళ్లించారు. అలాగే చెన్నై విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన మరో 30 విమానాలు ఆలస్యంగా వెళ్లనున్నాయి. విమానాలు బయలుదేరడానికి కనీసం 400 మీటర్ల మేర విజిబులిటి ఉండాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం పొగమంచు కారణంగా 50 మీటర్ల విజిబులిటి మాత్రమే ఉండటంతో విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులు...విమానాశ్రయంలో పడిగాపులు పడుతున్నారు. మరోవైపు చెన్నై నుంచి ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి నాలుగు విమానాలు రావల్సి ఉండగా, వెలుతురు సరిగా లేకపోవడంతో ఆ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.