
రోలింగ్ ఫోర్క్ పట్టణంలో టోర్నడోతో దెబ్బతిన్న ప్రాంతంలో మాట్లాడుతున్న బైడెన్
లిటిల్‌రాక్ (యూఎస్): అమెరికాలో వారం క్రితం మిసిసిపి, పరిసర ప్రాంతాలను అల్లాడించిన ప్రాణాంతక టోర్నడో శుక్రవారం దక్షిణ, పశ్చిమమధ్య ప్రాంతాలను వణికించింది. అర్కన్సాస్, ఇల్లినాయీతో పాటు ఇండియానా, అలబామా రాష్ట్రాల్లోనూ పెను విధ్వంసం సృష్టించింది. గంటకు 100 కిలోమీటర్ల పై చిలుకు వేగంతో వచ్చి పడ్డ పెనుగాలుల ధాటికి ఎక్కడ చూసినా నేలమట్టమైన ఇళ్లు, షాపింగ్ సెంటర్లు తదితర భవనాలతో పరిస్థితి భయానకంగా మారింది.
టోర్నడో బారిన పడి 18 మందికి పైగా మరణించగా డజన్ల మంది గాయపడ్డారు. అయోవా, ఓక్లహామా రాష్ట్రాల్లోనూ భారీ నష్టం సంభవించింది. దాదాపు 3 లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. పెనుగాలుల కారణంగా పలుచోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అత్యవసర, విపత్తు స్పందన బృందాలు రంగంలోకి దిగాయి. వచ్చే బుధవారం మరికొన్ని భారీ తుపాన్లు, టోర్నడోలు రావచ్చని వాతావరణ విభాగం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment