houses collapse
-
USA: హెలెన్ విధ్వంసం
ఫ్లోరిడా: అమెరికాను తాకిన భీకర హెలెన్ తుపాను ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అమెరికాలో అపారమైన విధ్వంసం సృష్టించింది. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియాల్లో వరదలు, ఇళ్లు కూలిన ఘటనల్లో 72 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. వరద నష్టం 15 నుంచి 26 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. టెన్నెసీలోని యునికోయ్ కౌంటీ హాస్పిటల్లోకి వరద చేరడంతో మొత్తం 54 మంది భవనంపైకి చేరారు. వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడారు. న్యూపోర్టు సమీపంలో జలాశయం పొంగిపొర్లుతుండటంతో 7 వేల మందిని తరలించారు. నార్త్ కరోలినాలో వందేళ్లలోనే రికార్డు స్థాయిలో వరదలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. అట్లాంటాలో 48 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 28.24 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక్కడ 1878 తర్వాత ఈ స్థాయి వర్షం ఇదే మొదటిసారని జార్జియా వాతావరణ విభాగం ప్రకటించింది. వరదల ధాటికి పార్కు చేసిన కార్లన్నీ మునిగిపోయాయి. ఈ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఫ్లోరిడాలో పలు ప్రాంతాలకు చేరేందుకు పడవలే దిక్కయ్యాయి. ఫ్లోరిడా, జార్జియా, కరోలినాల్లో 30 లక్షల ఇళ్లు, వ్యాపారసంస్థలకు కరెంటు నిలిచిపోయింది. ఇటీవలి ఇడాలియా, డెబ్బీ తుపాన్లను మించిన నష్టం కలిగిందని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీ శాంటిస్ తెలిపారు. తుపాను తీవ్రత తగ్గినా కుండపోత కొనసాగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. -
మణిపూర్‌లో మిలిటెంట్ల దాడులు..
ఇంఫాల్: మణిపూర్‌లోని కౌట్రుక్, కడంగ్బాండ్ ప్రాంతాల్లో ఆదివారం అనుమానాస్పద మిలిటెంట్ల దాడుల్లో ఇద్దరు చనిపోగా, 9 మంది గాయపడ్డారు. మిలిటెంట్ల దాడులు, ఇళ్లు, ఆస్తుల విధ్వంసం నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆ ప్రాంతంలోకి భద్రతా బలగాలను తరలించారు. క్షతగాత్రుల్లో ఐదుగురికి బుల్లెట్ గాయాలు, మిగతా వారికి బాంబు పేలుడు గాయాలను గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు. -
అమెరికాలో టోర్నడోల బీభత్సం
హూస్టన్: అమెరికాలో పలు ఓవైపు ఎండలు మండుతుంటే మరోవైపు టోర్నడోలు ప్రతాపం చూపుతున్నాయి. గాలుల తీవ్రతకు ఇళ్లు కూలడం, చెట్లు పడిపోవడం వంటి ఘటనల్లో 28 మందికి పైగా చనిపోయారు. వేలాదిగా ఇళ్లు నేల మట్టమయ్యాయి. టెక్సాస్, ఒక్లహామా, అర్కన్సాస్ సహా 16 రాష్ట్రాల్లో 6 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు టెక్సాస్, ఆస్టిన్, డాలస్, న్యూ మెక్సికో, ఒక్లహామా, అరిజోనా, కొలరాడో రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇలినాయీ, మిస్సోరీ, కెంటకీ, టెన్నెస్సీల్లో తీవ్రమైన గాలి తుఫాన్లు వీస్తాయని చెబుతున్నారు. -
90 ఏళ్ల మృత్యుంజయురాలు
టోక్యో: జపాన్‌లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదం మిగిలి్చంది. వంద మందికిపైగా జనం మరణించారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నారు. 90 ఏళ్లకుపైగా వయసున్న ఓ వృద్ధురాలు శిథిలాల నుంచి ప్రాణాలతో క్షేమంగా బయటపడడం ఆశ్చర్యం కలిగింది. ఇషికావా జిల్లాలోని సుజు సిటీలో భూకంపం వల్ల కూలిపోయిన రెండంతస్తుల భవన శిథిలాలను తొలగిస్తుండగా ఆదివారం సాయంత్రం ఈ వృద్ధురాలు బయటకు వచి్చంది. ఆహారం, నీరు లేక బలహీనంగా మారిన బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స ప్రారంభించారు. ఏకంగా 124 గంటలపాటు ఆమె ఈ శిథిలాల కిందే ఉండిపోయింది. బాధితురాలి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, మాట్లాడగలుతోందని, ఆమె కాళ్లకు గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. జపాన్‌లో ఆరు రోజుల క్రితం సంభవించిన భూకంపంలో కనీసం 126 మంది మృత్యువాతపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. -
Video: హిమాచల్‌లో వర్ష బీభత్సం.. చూస్తుండగానే ఇళ్లు నేలమట్టం
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం బీభత్సం కొనసాగుతోంది. గతకొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. కులు జిల్లాలోని అన్నీ అనే ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. చూస్తూండగానే పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. బస్టాండ్ సమీపంలోని ఏడు పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల శిథిలాల కింద అనేకమంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో..బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల కుప్పకూలడం, భారీగా దుమ్ము లేవడం కనిపిస్తోంది. వెన్నులో వణుకు పుట్టించే దృశ్యాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక కులు జిల్లాలోని అన్నీ టౌన్లో ఉన్న భారీ బిల్డింగ్లు కూలిపోయాయి. అయితే భవనాలకు పగుళ్లు ఏర్పడటంతో మూడు రోజుల క్రితమే ఆ బిల్డింగ్‌ల నుంచి జనాన్ని తరలించారు. కులు-మండి హైవేపై భారీ వర్షం వల్ల వాహనాలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎస్ వంటి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌కు భారత వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నేటి నుంచి మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇళ్లు కూలిన ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందించారు. కులులో కొండచరియలు విరిగిపడటంతో భారీ భవనాలు కూలిపోతున్న దృశ్యాలు కలవరపరిచాయని తెలిపారు. అయితే రెండు రోజుల ముందే ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు.ఆ బిల్డింగ్‌ల నుంచి ప్రజలను వేరే ప్రాంతానికి తరలించారని ట్విటర్లో పేర్కొన్నారు. #WATCH | Himachal Pradesh: Several buildings collapsed due to landslides in Anni town of Kullu district. (Visuals confirmed by police) pic.twitter.com/MjkyuwoDuJ — ANI (@ANI) August 24, 2023 -
అమెరికాలో టోర్నడో బీభత్సం
లిటిల్‌రాక్ (యూఎస్): అమెరికాలో వారం క్రితం మిసిసిపి, పరిసర ప్రాంతాలను అల్లాడించిన ప్రాణాంతక టోర్నడో శుక్రవారం దక్షిణ, పశ్చిమమధ్య ప్రాంతాలను వణికించింది. అర్కన్సాస్, ఇల్లినాయీతో పాటు ఇండియానా, అలబామా రాష్ట్రాల్లోనూ పెను విధ్వంసం సృష్టించింది. గంటకు 100 కిలోమీటర్ల పై చిలుకు వేగంతో వచ్చి పడ్డ పెనుగాలుల ధాటికి ఎక్కడ చూసినా నేలమట్టమైన ఇళ్లు, షాపింగ్ సెంటర్లు తదితర భవనాలతో పరిస్థితి భయానకంగా మారింది. టోర్నడో బారిన పడి 18 మందికి పైగా మరణించగా డజన్ల మంది గాయపడ్డారు. అయోవా, ఓక్లహామా రాష్ట్రాల్లోనూ భారీ నష్టం సంభవించింది. దాదాపు 3 లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. పెనుగాలుల కారణంగా పలుచోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అత్యవసర, విపత్తు స్పందన బృందాలు రంగంలోకి దిగాయి. వచ్చే బుధవారం మరికొన్ని భారీ తుపాన్లు, టోర్నడోలు రావచ్చని వాతావరణ విభాగం హెచ్చరించింది. -
‘జోషిమఠ్’పగుళ్లపై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పట్టణంగా పేరున్న జోషిమఠ్( చమోలీ జిల్లా)లో భూభాగం కుంగిపోతూ వస్తోంది. వందల సంఖ్యలో ఇళ్లకు బీటలువారాయి. సుమారు 600 కుటుంబాలను ఖాళీ చేసేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జోషిమఠ్‌లోని ప్రస్తుత పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చింది ప్రధానమంత్రి కార్యాలయం. కేబినెట్ సెక్రెటరీ సహా కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ విభాగం అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రెటరీ పీకే మిశ్రా సమీక్ష నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ ఉన్నతాధికారులతో పాటు జోషిమఠ్ జిల్లా అధికారులు సైతం హాజరుకానున్నారు. జోషిమఠ్‌లో భూమి కుంగిపోయి ఇళ్లకు బీటలు వస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. శనివారం జోషిమఠ్‌లో పర్యటించారు. ప్రభావితమైన 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జోషిమఠ్ ప్రజలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: Joshimath Sinking: జోషీ మఠ్‌లో వందలాది ఇళ్లకు పగుళ్లు.. తక్షణం 600 కుటుంబాలు ఖాళీ! ఏమిటీ జోషీమఠ్ ? -
జోషీ మఠ్‌లో ఇళ్లకు పగుళ్లు.. తక్షణం 600 కుటుంబాలు ఖాళీ!
జోషిమఠ్. చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు చిరపరిచితమైన పేరు. ఉత్తరాఖండ్‌లో అత్యంత పురాతమైన పట్టణం పూర్తిగా కనుమరుగయ్యే రోజులు దగ్గరకొస్తున్నాయి. జోషిమఠ్‌లో వందలాది ఇళ్లు బీటలు వారాయి. కొన్ని చోట్ల భూమిలోంచి నీళ్లు ఉబుకుబుకి పైకి వస్తున్నాయి. ఈ పట్టణం నిట్టనిలువుగా భూమిలోకి కుంగిపోవడమే దీనికి కారణం. ఏదో ఒక రోజు జోషిమఠ్ మునిగిపోవడం ఖాయమని దశాబ్దాల క్రితమే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని జోíషీమఠ్‌లో ప్రజలు గత కొద్ది రోజులుగా ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. దాదాపుగా 600 ఇళ్లు బీటలు వారాయి. నేలకింద నుంచి ఇళ్లల్లోకి నీరు వచ్చేస్తోంది. భూమి కింద నుంచి శబ్దాలు వస్తూ ఉండడంతో స్థానికులు వణికిపోతున్నారు. చార్ధామ్ యాత్రికుల కోసం హెలాంగ్ నుంచి మార్వారి వరకు రోడ్డుని వెడల్పు చేసే ప్రాజెక్టు పనులు ముమ్మరంగా చేస్తూ ఉండడంతో ప్రస్తుతం ఈ ముప్పు ముంచుకొచ్చింది. దీంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రంగంలోకి దిగారు. రహదారి నిర్మాణాలన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. జోషీమఠ్ పరిస్థితిపై శుక్రవారం అధికారులతో సమీక్షించారు. అక్కడి 600 కుటుంబాలను తక్షణం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. శనివారం అక్కడ పర్యటించనున్నారు. దాంతో విపత్తు సహాయక బృందాలు ప్రజల్ని తరలిస్తున్నాయి. ఎందుకీ ముప్పు ? జోషీమఠ్ పట్టణం కొండల్లో ఏటవాలుగా ఉన్నట్టు ఒకవైపు ఒరిగి ఉంటుంది. అత్యంత పురాతనమైన కొండచరియలపై ఇళ్లు నిర్మించడంతో పునాదులు బలంగా లేవు. అడపా దడపా భూ ప్రకంపనలు పలకరిస్తూనే ఉంటాయి. రైని ప్రాంతంలోని అలకనంద నదికి వరదలు వచ్చినప్పుడల్లా జోíషీమఠ్‌లో మట్టిని బలహీనపరుస్తోంది. ఈ ప్రాంతంలో భారీ నిర్మాణాలు చేపట్టవద్దని ఎందరో నిపుణులు హెచ్చరించినా మన ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. అభివృద్ధి కార్యక్రమాల కోసం కొండల్ని పేల్చేయడం, ఇష్టారాజ్యంగా తవ్వకాలు, చెట్లు నరికేయడం వంటి చర్యలు జోíషీమఠ్ పట్టణాన్ని ప్రమాదంలో పడేశాయి. ఎన్టీపీసికి చెందిన తపోవన్ విష్ణుగఢ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం అతి పెద్ద ముప్పుగా పరిణమించింది. గత ఏడాది ఈ ప్రాజెక్టు దగ్గర ఆకస్మిక వరదలు సంభవించి 200 మంది మరణించిన విషయం తెలిసిందే. ఏడాది పొడవునా చార్ధామ్ యాత్ర చేయడానికి వీలుగా హెలోంగ్ నుంచి మార్వారి వరకు 20కి.మీ. మేర చేపట్టిన రహదారి వెడల్పు చేసే ప్రాజెక్టు ముప్పుని మరింత పెంచింది. ప్రస్తుతం ఈ నిర్మాణాలన్నీ తాత్కాలికంగా ప్రభుత్వం నిలిపివేసింది. సమస్యకి శాశ్వతమైన పరిష్కారాలు కనుగొనే వరకు చిన్నపాటి తవ్వకాలు కూడా చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది జోషీమఠ్‌కి ముప్పుని తొలిసారి గుర్తించారు. చమోలిలో ప్రమాదకరంగా కొండచరియలు విరిగిపడినప్పుడు జోíషీమఠ్‌లో ఇళ్లు బీటలు వారాయి. అప్పట్నుంచి ఏదో ఒక రూపంలో ప్రమాదాలు వస్తూనే ఉన్నాయి. దీనికి గల కారణాలపై బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తల బృందం ఈ పట్టణం ఉన్న ప్రాంతంలో సహజసిద్ధంగా వచ్చే ముప్పుతో పాటు మానవ తప్పిదాలు కారణమని తేల్చింది. 50 ఏళ్ల క్రితమే ప్రమాదం గుర్తించిన నిపుణులు జోషీమఠ్ పూర్తిగా మునిగిపోతుందని 50 ఏళ్ల క్రితమే నిపుణులు అంచనా వేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో తరచూ వరదలు రావడానికి గల కారణాలు అన్వేషించడానికి ఏర్పాటు చేసిన మిశ్రా కమిటీ 1976లో ఇచ్చిన నివేదికలో జోíషీమఠ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ విషయాన్ని ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వృద్ధులు కథలుగా చెబుతున్నారు. జోషిమఠ్ కనుమరుగైపోతుందా అన్న ఆందోళనలో స్థానికులు దినమొక గండంగా బతుకుతున్నారు. కుప్పకూలిన జోషిమఠ్ ఆలయం జోషీమఠ్: హిమాలయాల్లో ఉన్న ఉత్తరాఖండ్‌లోని జోíషీమఠ్‌లో ఓ ఆలయం శుక్రవారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని స్థానికులు చెప్పారు. ఆలయ గోడలు పగుళ్లు వారుతుండటంతో 15 రోజుల క్రితమే మూసివేసినట్లు చెప్పారు. సింగ్‌ధర్ వార్డులోని చాలా ఇళ్లు బీటలు వారుతుండటంతో 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. అదేవిధంగా, అక్కడికి సమీపంలోనే ఉన్న జల విద్యుత్ కేంద్రంలో పనిచేసే 60 కుటుంబాలను కూడా మరో చోటికి తరలించారు. మర్వారీలోని జలాశయం బీటలు వారి నీరు ధారాళంగా మూడు రోజులుగా దిగువకు వస్తుండటంతో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. చార్‌ధామ్‌లో కొనసాగుతున్న బైపాస్ రోడ్డు, జల విద్యుత్ ప్రాజెక్టు పనులను, ఔలి రోప్ వే సేవలను నిలిపివేశారు. ఆ ప్రాంతంలో ఏడాది కాలంగా భూమి కుంగిపోతోంది. పక్షం రోజులు గా భూమి కుంగుబాటు మరీ ఎక్కువైంది. ఏమిటీ జోషీమఠ్ ? హిమాలయాల్లోని ప్రకృతి అందాలకు నెలవు ఈ పట్టణం. చమోలి జిల్లాలో బద్రీనాథ్, హేమ్‌కుంద్ సాహిబ్ మధ్య 6 వేల అడుగుల ఎత్తులో జోషీ మఠ్ ఉంది. కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రికులకు స్వాగతం చెబుతున్నట్టుగా ఈ పట్టణం ఉంటుంది. జగద్గురు ఆదిశంకరాచార్యుడు ఎనిమిదో శతాబ్దంలో జోíషీమఠ్‌లోనే జ్ఞానోదయం పొందారని ప్రతీతి. ఇప్పటికే అత్యధిక భూకంపం ముప్పు ఉన్న కేటగిరి జోన్–5లో ఈ ప్రాంతం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కడలి కన్నెర్ర
సాక్షి, కొత్తపల్లి (తూర్పుగోదావరి) : నిండు గంభీరంగా ఉండే సముద్రుడే ఎగసిపడితే.. తట్టుకోవడం కష్టమే. అదే జరిగింది పొన్నాడ శివారు కోనపాపపేటలో. వారం రోజులుగా సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో తీర ప్రాంతం కడలికోతకు గురైంది. సుమారు 10 మత్స్యకారుల గృహాలు కూలిపోయాయి. అనేకమంది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. తీరంలోని రోడ్డు, చెట్లు సాగర గర్భంలో కలిశాయి. కోతకు గురైన ఈ గృహాలను ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు పరిశీలించి ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలను మంజూరు చేయడమే కాకుండా ఇంటి రుణాలను మంజూరు చేసి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
భారీ వర్షం.. ఇళ్లకు నష్టం
వర్షానికి తడిసిన పురాతన ఇళ్లు చాలాచోట్ల ధ్వంసం.. రోడ్డున పడ్డ నిరుపేదలు పునరావాసం కోసం ఎదురు చూపులు మెదక్ రూరల్/జగదేవ్‌పూర్/గజ్వేల్: భారీ వర్షాల కారణంగా పురాతన ఇళ్లు ధ్వంసమయ్యాయి. మెదక్, గజ్వేల్, జగదేవ్‌పూర్, చిన్నశంకరంపేట తదితర ప్రాంతాల్లో ఇళ్లకు నష్టం వాటిల్లింది. దీంతో నిరుపేదలు ఆశ్రయం లేక వీధిన పడ్డారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మెదక్ మండలం రాజ్‌పల్లి పంచాయతీ బొల్లారం(బాలనగర్) గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలతో మంగళవారం మూడు ఇళ్లు నేలకూలాయి. దీంతో కొంట భిక్షపతి, కొంట సాయిలు, కొంట భాష కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. కొంట భిక్షపతి తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రలో ఉండగా ఇల్లు కూలింది. పక్కగది పైకప్పు కూలడంతో ప్రాణాపాయం తప్పింది. నిలువ నీడను కోల్పోయిన తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. కూలిన ఏడు ఇళ్లు జగదేవ్‌పూర్ మండలంలోని ఇటిక్యాల, వట్టిపల్లి, చిన్నకిష్టాపూర్ తదితర గ్రామాల్లో వర్షానికి ఏడు ఇళ్లు దెబ్బతిన్నాయి. గజ్వేల్ మండలం దిలాల్‌పూర్‌తోపాటు పలుచోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. -
వరద ముప్పుతో 15 మంది మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరద దాటికి తట్టుకోలేక ఇప్పటికే 11 మంది మృతిచెందారు. ఒక్క రోజులోనే బుదేల్ఖండ్లోని వందల ఇళ్లు మట్టికొట్టుకుపోయాయి. బాందా జిల్లాలోని కల్వాన్గంజ్ ప్రాంతం, మహోమాల్లో ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గంగా నది, డేంజర్ లెవల్స్‌లో పయనిస్తున్నట్టు వెల్లడించారు. ఉప్పొంగుతున్న వరదలతో కాన్పూరులో ఓ ఇళ్లు కుప్పకూలి, ఇద్దరు పిల్లలతో కలిపి, నలుగురు ప్రాణాలు విడిచారని తెలిపారు. భారీ వరద పోటెత్తడంతో శుక్రవారం రిహంద్ ఆనకట్ట ఐదు గేట్లు తెరిచి వరద దాటిని తగ్గించుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్లలో నీరు సైతం గత 24 గంటల్లో 20 అడుగులు పెరిగినట్టు తెలుస్తోంది. అలహాబాద్‌లో గంగా నది ఉప్పొంగుతుందని, డేంజర్ లెవల్ దాటి పయనిస్తుందని, స్థానిక ప్రాంతాలన్నీ వరదనీటి మయమవుతున్నట్టు ఏఎన్ఐ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వరద ముప్పులో ఇళ్లు కొట్టుకుపోయి 12 ఏళ్ల బాలిక ప్రాణాలు విడించిందని, సితాపుర్లో ఇంటి పైకప్పు కూలి మరో వ్యక్తి మరణించినట్టు అధికారులు తెలిపారు. వరద ముప్పు ప్రాంతాల్లో వెంటనే రెస్క్యూ, రిలీఫ్ చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, అధికారులను ఆదేశించారు. వరద బాధిత కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కూడా సీఎం ప్రకటించారు. 2500 హ్యాండ్ పంప్స్‌ను ఏర్పాటుచేసి ప్రజలకు తాగునీటి సౌకర్యాలు అందించాలని ఆదేశించినట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.