ఉత్తరప్రదేశ్ను వరదలు ముంచెత్తుతున్నాయి.
లక్నో : ఉత్తరప్రదేశ్ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరద దాటికి తట్టుకోలేక ఇప్పటికే 11 మంది మృతిచెందారు. ఒక్క రోజులోనే బుదేల్ఖండ్లోని వందల ఇళ్లు మట్టికొట్టుకుపోయాయి. బాందా జిల్లాలోని కల్వాన్గంజ్ ప్రాంతం, మహోమాల్లో ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గంగా నది, డేంజర్ లెవల్స్లో పయనిస్తున్నట్టు వెల్లడించారు. ఉప్పొంగుతున్న వరదలతో కాన్పూరులో ఓ ఇళ్లు కుప్పకూలి, ఇద్దరు పిల్లలతో కలిపి, నలుగురు ప్రాణాలు విడిచారని తెలిపారు.
భారీ వరద పోటెత్తడంతో శుక్రవారం రిహంద్ ఆనకట్ట ఐదు గేట్లు తెరిచి వరద దాటిని తగ్గించుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్లలో నీరు సైతం గత 24 గంటల్లో 20 అడుగులు పెరిగినట్టు తెలుస్తోంది. అలహాబాద్లో గంగా నది ఉప్పొంగుతుందని, డేంజర్ లెవల్ దాటి పయనిస్తుందని, స్థానిక ప్రాంతాలన్నీ వరదనీటి మయమవుతున్నట్టు ఏఎన్ఐ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వరద ముప్పులో ఇళ్లు కొట్టుకుపోయి 12 ఏళ్ల బాలిక ప్రాణాలు విడించిందని, సితాపుర్లో ఇంటి పైకప్పు కూలి మరో వ్యక్తి మరణించినట్టు అధికారులు తెలిపారు. వరద ముప్పు ప్రాంతాల్లో వెంటనే రెస్క్యూ, రిలీఫ్ చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, అధికారులను ఆదేశించారు. వరద బాధిత కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా సీఎం ప్రకటించారు. 2500 హ్యాండ్ పంప్స్ను ఏర్పాటుచేసి ప్రజలకు తాగునీటి సౌకర్యాలు అందించాలని ఆదేశించినట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.