ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అమెరికా అతలాకుతలం
తుపాను సంబంధిత ఘటనల్లో 72 మంది మృతి
ఫ్లోరిడా: అమెరికాను తాకిన భీకర హెలెన్ తుపాను ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అమెరికాలో అపారమైన విధ్వంసం సృష్టించింది. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియాల్లో వరదలు, ఇళ్లు కూలిన ఘటనల్లో 72 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. వరద నష్టం 15 నుంచి 26 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది.
టెన్నెసీలోని యునికోయ్ కౌంటీ హాస్పిటల్‌లోకి వరద చేరడంతో మొత్తం 54 మంది భవనంపైకి చేరారు. వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడారు. న్యూపోర్టు సమీపంలో జలాశయం పొంగిపొర్లుతుండటంతో 7 వేల మందిని తరలించారు. నార్త్ కరోలినాలో వందేళ్లలోనే రికార్డు స్థాయిలో వరదలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. అట్లాంటాలో 48 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 28.24 సెంటీమీటర్ల వర్షం నమోదైంది.
ఇక్కడ 1878 తర్వాత ఈ స్థాయి వర్షం ఇదే మొదటిసారని జార్జియా వాతావరణ విభాగం ప్రకటించింది. వరదల ధాటికి పార్కు చేసిన కార్లన్నీ మునిగిపోయాయి. ఈ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఫ్లోరిడాలో పలు ప్రాంతాలకు చేరేందుకు పడవలే దిక్కయ్యాయి. ఫ్లోరిడా, జార్జియా, కరోలినాల్లో 30 లక్షల ఇళ్లు, వ్యాపారసంస్థలకు కరెంటు నిలిచిపోయింది. ఇటీవలి ఇడాలియా, డెబ్బీ తుపాన్లను మించిన నష్టం కలిగిందని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీ శాంటిస్ తెలిపారు. తుపాను తీవ్రత తగ్గినా కుండపోత కొనసాగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment