
మెదక్ రూరల్: కూలిన ఇంటిని చూపుతున్న సాయిలు
- వర్షానికి తడిసిన పురాతన ఇళ్లు
- చాలాచోట్ల ధ్వంసం.. రోడ్డున పడ్డ నిరుపేదలు
- పునరావాసం కోసం ఎదురు చూపులు
మెదక్ రూరల్/జగదేవ్‌పూర్/గజ్వేల్: భారీ వర్షాల కారణంగా పురాతన ఇళ్లు ధ్వంసమయ్యాయి. మెదక్, గజ్వేల్, జగదేవ్‌పూర్, చిన్నశంకరంపేట తదితర ప్రాంతాల్లో ఇళ్లకు నష్టం వాటిల్లింది. దీంతో నిరుపేదలు ఆశ్రయం లేక వీధిన పడ్డారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
మెదక్ మండలం రాజ్‌పల్లి పంచాయతీ బొల్లారం(బాలనగర్) గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలతో మంగళవారం మూడు ఇళ్లు నేలకూలాయి. దీంతో కొంట భిక్షపతి, కొంట సాయిలు, కొంట భాష కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. కొంట భిక్షపతి తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రలో ఉండగా ఇల్లు కూలింది. పక్కగది పైకప్పు కూలడంతో ప్రాణాపాయం తప్పింది. నిలువ నీడను కోల్పోయిన తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
కూలిన ఏడు ఇళ్లు
జగదేవ్‌పూర్ మండలంలోని ఇటిక్యాల, వట్టిపల్లి, చిన్నకిష్టాపూర్ తదితర గ్రామాల్లో వర్షానికి ఏడు ఇళ్లు దెబ్బతిన్నాయి. గజ్వేల్ మండలం దిలాల్‌పూర్‌తోపాటు పలుచోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి.