సాక్షి, నిజామాబాద్: రాష్ట్రంలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. రాజధానిలో ఆకాశం మేఘావృతమై ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం, నాంపల్లిలో జల్లులు పడుతున్నాయి.
అల్పపీడన ప్రభావంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ నేడు సెలవు ప్రకటించారు. భారీ వానలతో పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
అత్యధికంగా మోపాల్ మండలంలో 15.7 సెంటీమీటర్లు, ఇందల్వాయిలో 14.8, డిచ్‌పల్లి మండలం గన్నారంలో 14 సెంటీమీటర్ల వర్షం పడింది. 10 మండలాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సిరికొండ మండలం తుంపల్లిలో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. చీమన్ పల్లి, గన్నారం, దర్పల్లి, కమ్మర్ పల్లి, మెండోరా , మోర్తాడ్ లో 5 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదైంది. ఇక జిల్లాలో కురుస్తున్న కుండపోత వానలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజులపాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది
కామారెడ్డి జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి, బిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, రాజంపేట సదాశివనగర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాల ధాటికి పలు మండలాల్లో వరి పంట నీట మునిగింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు చెరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
చదవండి: మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో పోస్టర్లు
తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో వాగు పొంగిపొర్లుతోంది. వాగు ప్రవహించడంతో టేక్రియాల్, బ్రాహ్మణపల్లి, సంగోజి వాడి, కాలోజివాడి, చందాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేగాక తాడ్వాయి మండలం సంతయిపేట గ్రామ శివారులోని భీమేశ్వర వాగు, పాల్వంచ మండలం వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మెదక్ జిల్లా కౌడిపల్లిలో 8.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
అయిదు రోజులు వర్షాలు
అల్పపీడన ప్రభావంతో వచ్చే అయిదు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశముందని హైదాబాద్ వాతావరణశాఖ తెలిపింది. నేడు, రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నారాయణపేట, నిజామాబాద్,పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.అదిలాబాద్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల్,కొమరం భీం, మహబూబబాద్,మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నిర్మల్, రంగా రెడ్డి, సిద్దిపేట, సూర్యా పేట, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి ఎల్లో అలెర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment