నీటిలో మునిగి కుళ్లిన మొక్కజొన్న పంట
పంటలన్నీ నీటి పాలు
ఆరుగాలం కష్టం.. వర్షార్పణం
కన్నీరుమున్నీరవుతున్న అన్నదాతలు
1.16 లక్షల ఎకరాల్లో పంటలు నష్టం
మెదక్: ‘చేతికొచ్చిన పంట నీటిపాలైంది.. ఆరుగాలం కష్టపడి బోరుబావి ఆధారంగా రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తే వరద ఉధృతికి పంటతో పాటు బోరుమోటార్‌సైతం కొట్టుకు పోయి మాకు బతుకు దెరవు లేకుండా పోయింది. మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి సారూ..’ అంటు మెదక్ మండలం అవుసులపల్లి గ్రామానికి చెందిన రైతు కొండపురం సిద్ధిరాములు కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఇలా సిద్ధిరాములు దుస్థితేకాదు జిల్లాలోని వేలాది మంది అన్నదాతల పరిస్థితి ఇలాగే ఉంది.
వారం రోజులుగా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురవటంతో చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లి లక్షలాది ఎకరాల పంటలు కొట్టుకుపోయాయి. జిల్లాలో మంజీర నది 120 కిలో మీటర్ల మేర ప్రవహిస్తుండగా, ఇందులో కౌడిపల్లి, పాపన్నపేట, మెదక్, కొల్చారం, మనూర్‌తోపాటు తదితర మండలాల పరిధిలోని వందల గ్రామాలను తాకుతూ ప్రవహిస్తుంది. దీని ఆధారంగా రైతులు వేలాది ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. మంజీర నదిని ఆనుకుని ఉన్న అనేక వరిపంటలు నీటి పాలయ్యాయి.
ఈయేడు అధికారిక లెక్కల ప్రకారం.. జిల్లాలో వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి తదితర పంటలు 9 లక్షల 69వేల ఎకరాల్లో సాగు చేయగా వరద ఉధృతికి లక్షా 16 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో కొన్ని పంటలు కొట్టుకు పోగా మరికొన్ని పంటలపై ఇసుకమేటలు కప్పాయి. కొన్ని పంటలు ఇంకానీటి ముంపులోనే చిక్కుకున్నాయి. గడిచిన రెండు సంవత్సరాల్లో తీవ్ర అనావృష్టితో వ్యవసాయం పూర్తిగా మరుగున పడగా పల్లెలు వదిలి రైతాంగం పొట్ట చేతపట్టుకుని పట్టణాలకు వలస వెళ్లారు.
ఖరీఫ్‌సీజన్‌లో పట్టణాలను వదిలి పల్లెలకు చేరుకుని బోరుబావుల ఆధారంగా కొందరు, వర్షాధారంగా మరికొందరు పంటలను సాగు చేశారు. అనేక కష్టనష్టాలకోర్చి పంటలను సాగు చేసే తీరా పంటలు చేతికందే సమయంలో వరదపాలయ్యాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మాకు బతుకు దెరవు ఏమిటని కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య తప్ప మరోమార్గంలేదని ఆవేదన చెందుతున్నారు.
3 ఎకరాలు కొట్టుకుపోయింది
ఎర్రకుంట వెనకాల ఉన్న 3 ఎకరాల పొలంలో రూ.60 వేల అప్పులు చేసి వరిపంట సాగు చేశాను. కుంటపొంగి వరిపంట పూర్తిగా కొట్టుక పోయింది. మరో నెలరోజుల్లో చేతికందుతుందనగా భారీవర్షాలతో పంటంతా నీటిపాలైంది. బతుకు దెరవు లేకుండా పోయింది. ప్రభుత్వమే ఆదుకోవాలి . - రైతు చెవిటి పోచయ్య, మక్తభూపతిపూర్
ప్రభుత్వం ఆదుకోవాలి
రెండు ఎకరాల వరి పంటను బోరుబావి ఆధారంగా సాగు చేశాను. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండి చేతికందిన వరిపంట పూర్తిగా నీటిలో మునిగి పోయింది. ప్రభుత్వం ఆదుకోంకుంటే ఆత్మహత్య తప్ప మరో మార్గంలేదు. - చిక్కుల గట్టయ్య, తిమ్మానగర్