
మంచు ముసుగు
ఉదయం వరకూ వీడని ఛాయలు
ఏడు విమానాలు ఆలస్యం
సిటీబ్యూరో: గ్రేటర్ నగరాన్ని శుక్రవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. వాతావరణం మేఘావృతమవడంతో భూ వాతావరణం నుంచి తేమ పైకి వెళ్లకపోవడం వల్లే పొగమంచు అధికంగా ఉందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్త సీతారాం తెలిపారు. శీతాకాలంలో ఇది సాధారణమేనన్నారు.
విమానాలు ఆలస్యం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం 5.55 నుంచి 7.10 గంటల మధ్య చేరుకోవాల్సిన ఏడు విమానాలు 9.10 గంటలకు చేరుకున్నాయి. వీటిలో ఆల్‌దుబాయ్, ఆల్‌ఢిల్లీ, ఒమన్ ఎయిర్ మస్కట్, ఇండిగో-చెన్నై, బెంగళూరు, బ్లూడార్ట్ ముంబయి, ఎయిర్ కోస్టా చెన్నై విమానాలు ఉన్నాయి.
రామాంతాపూర్‌లో...
ఉదయం 9 గంటల వరకూ దట్టంగా పొగమంచు కురిసింది. దగ్గరలో ఉన్న వారు కూడా కనిపించనంత స్థాయిలో మంచు కమ్ముకుంది. రామంతాపూర్‌లోని మూసీ పరీవాహక ప్రాంతం బైపాస్ రోడ్డు, ఉప్పల్ మెట్రో బ్రిడ్జి రోడ్డుల్లో వాహనదారులు లైట్ల వెలుగులో ముందుకు వెళ్లాల్సి వచ్చింది.
ఏఎస్‌రావు నగర్‌లో...
ఏఎస్ రావు నగర్ పరిసర ప్రాంతాల్లోనూ శుక్రవారం ఉదయం మంచు ముసుగేసింది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు కొద్ది దూరంలో ఉన్న వ్యక్తులు, వస్తువులు సైతం కనబడకుండా మంచు కమ్ముకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా హిమం కురవడంతో జనం ఇళ్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది.