ముంబై: విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్‌వే పక్కనే నేలపై కూర్చుని భోజనంచేసిన ఘటనలో ఇండిగో విమానయాన సంస్థ, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఆగ్రహం వ్యక్తంచేసి జరిమానా విధించాయి. ప్రయాణికుల అసౌకర్యానికి కారణమైన ఇండిగో సంస్థపై రూ.1.5 కోట్ల జరిమానా, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై రూ.90 లక్షల జరిమానా విధించాయి.
ఒక పౌరవిమానయాన సంస్థపై ఇంతటి భారీ జరిమానా పడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారికావడం గమనార్హం. జనవరి 15వ తేదీన గోవా నుంచి బయల్దేరిన విమానం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగమంచు కారణంగా ఢిల్లీకి బదులు ముంబైలో దిగింది.
చాలాసేపు విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులు విసిగిపోయి కిందకు దిగొచ్చి రన్‌వే పక్కనే కూర్చుని భోజనాలు చేశారు. ఈ ఘటనను పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. బీసీఏఎస్ అడిగేదాకా ఈ విషయంలో ఇండిగో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. రన్‌వేపై ప్రయాణికుల కదలికలను నియంత్రించకుండా ముంబై ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారని డీజీసీఏ ఆక్షేపించింది.
Comments
Please login to add a commentAdd a comment