Bureau of Civil Aviation Security
-
ఇండిగో, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు జరిమానా
ముంబై: విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్‌వే పక్కనే నేలపై కూర్చుని భోజనంచేసిన ఘటనలో ఇండిగో విమానయాన సంస్థ, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఆగ్రహం వ్యక్తంచేసి జరిమానా విధించాయి. ప్రయాణికుల అసౌకర్యానికి కారణమైన ఇండిగో సంస్థపై రూ.1.5 కోట్ల జరిమానా, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై రూ.90 లక్షల జరిమానా విధించాయి. ఒక పౌరవిమానయాన సంస్థపై ఇంతటి భారీ జరిమానా పడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారికావడం గమనార్హం. జనవరి 15వ తేదీన గోవా నుంచి బయల్దేరిన విమానం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగమంచు కారణంగా ఢిల్లీకి బదులు ముంబైలో దిగింది. చాలాసేపు విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులు విసిగిపోయి కిందకు దిగొచ్చి రన్‌వే పక్కనే కూర్చుని భోజనాలు చేశారు. ఈ ఘటనను పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. బీసీఏఎస్ అడిగేదాకా ఈ విషయంలో ఇండిగో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. రన్‌వేపై ప్రయాణికుల కదలికలను నియంత్రించకుండా ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారని డీజీసీఏ ఆక్షేపించింది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాడీ స్కానర్లు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. ప్రయాణికుల తనిఖీకి ఇటీవల అధునాతన బాడీ స్కానర్లను ప్రవేశపెట్టారు. కేవలం రెండు, మూడు సెకన్లలో పూర్తిగా తనిఖీ చేసే ఈ స్కానర్లను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ట్రయల్‌రన్ ప్రారంభించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సూచనల మేరకు ఈ స్కానర్లను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టులోని డొమెస్టిక్ టెర్మి నల్ వద్ద ఏర్పాటు చేసిన వీటిని 3 నెలల పాటు పరిశీలిస్తారు. ట్రయల్స్‌లో భాగంగా డిపార్చర్ గేట్ నం.3 వద్ద ఉన్న ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెక్ లేన్ వద్ద స్కానర్‌ను ఏర్పాటు చేశారు. ట్రయల్స్ విజయవంతమైతే సంబంధిత రెగ్యులేటరీ అనుమతుల మేరకు టెర్మినల్ అంతటా ఏర్పాటు చేస్తారు. ఇమేజ్ ఫ్రీ స్కానింగ్ టెక్నిక్ మీద పనిచేసే ఈ స్కానర్ వల్ల ఎలాంటి హానీ ఉండదు. ప్రయాణికుల ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల అనుమతితోనే వారిని స్కానింగ్ చేస్తారు. పలు యూరోప్ దేశాలు, అమెరికాలోని అనేక విమానాశ్రయాల్లో ఇప్పటికే భద్రతా తనిఖీల నిమిత్తం బాడీ స్కానర్లను వినియోగిస్తున్నారు. -
'కారు బాంబులతో దాడి చేయవచ్చు'
న్యూఢిల్లీ : దేశంలోని అన్ని ప్రధాన అన్ని విమానాశ్రయాలకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని విమానాశ్రయాలకు భద్రతను పెంచటంతో పాటు కట్టుదిట్టం చేయాలని సూచించింది. కారు బాంబులతో తీవ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఉన్నతాధికారులు హైదరాబాద్ సహా అన్ని ఎయిర్‌పోర్ట్‌లకు భద్రతను పెంచారు. హెచ్చరికలు నేపథ్యంలో పోలీసులు అన్ని విమానాశ్రయల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే రోజుల కొద్దీ పార్క్ చేసిన వాహనాలను తొలగించాలని ఆదేశించారు.