ముంబై : ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ మూసివేయనున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇన్‌స్ట్రూమెంట్ లాండింగ్ సిస్టమ్(ఐఎల్‌ఎస్)ను అప్‌గ్రేడ్ చేయడం కోసం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల పాటు విమానాశ్రయం ప్రధాన రన్‌వేను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దట్టమైన మంచు, భారీ వర్షం పడుతున్న సందర్భాల్లో రన్‌వే స్పష్టంగా కనిపించక పోవడం వల్ల విమానాలను ల్యాండ్ చేయడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ‘ఐఎల్‌ఎస్’ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు.
గ్రౌండ్ బెస్డ్ ఇన్‌స్ట్ర్‌మెంట్ సిస్టమ్ ఆధారంగా, రేడియో సిగ్నల్స్‌తో పనిచేసే ఈ వ్యవస్థ విమానాలు ల్యాండ్ అయ్యే ప్రాంతానికి(రన్‌వే) సంబంధించిన పూర్తి సమాచారాన్ని పైలెట్‌కు తెలియజేస్తుంది. దానివల్ల విమానం సురక్షితంగా రన్‌వే మీద ల్యాండ్ అవుతుంది. మే18 నుంచి జరుగుతున్న ఈ ఐఎల్‌ఎస్ అప్‌గ్రేడ్ వల్ల ఈ మధ్య తరచుగా విమానాలు ఆలస్యం అవుతున్నాయి. గత నెలలో కూడా వర్షాకాలం ప్రారంభానికి ముందుగానే ప్రీ మాన్‌సూన్ పనులను పరిశీలించడానికి గాను ప్రధాన రన్‌వేను 6 గంటల పాటు మూసివేశారు. దానివల్ల ఒక్క రోజులోనే 200 విమానాలు రద్దయ్యాయి. మన దేశంలో నిత్యం బాగా రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఛత్రపతి శివాజీ విమానాశ్రయం రెండో స్ధానంలో ఉంది. దీని ప్రధాన రన్‌వే మీద గంటకు 48 విమానాలు టేక్ ఆఫ్, ల్యాండ్ అవుతుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment