Chhatrapati Shivaji International Airport
-
లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య..
ముంబై: ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో (ఏఐ129) సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్ది సమయానికే విమానాన్ని తిరిగి ముంబైకు దారి మళ్లించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. అనంతరం విమానానికి ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.‘ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI129లో సాంకేతిక సమస్య కారణంగా ముంబైకి తిరిగి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఊహించని ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము’ అని ఎయిర్ ఇండియా వెల్లడించింది.విమానయాన సంస్థ ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అంతేగాక విమాన టికెట్ రద్దుపై ప్రయాణీకులకు విమాన ఛార్జీల పూర్తి వాపసును కూడా అందించినట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రత, శ్రేయస్సుకు సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా సదరు అధికారి పేర్కొన్నారు. -
బూట్లు, పట్టు చీరల్లో నోట్ల కట్టలు.. పోలీసులు షాక్
ముంబై: అక్రమంగా విదేశీ కరెన్సీ రవాణా చేస్తున్న ఓ కుటుంబం.. ముంబై పోలీసులను షాక్‌కి గురి చేసింది. ఏకంగా దాదాపు ఐదు లక్షల డాలర్ల నగదును గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేసే ప్రయత్నం చేసింది. అయితే.. ముందుగా సమాచారం అందుకున్న పోలీసులు అనుమానంతో వెతకగా.. ఆ కుటుంబం నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. విదేశీ కరెన్సీ అక్రమ రవాణా గురించి ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(AIU)కు ముందుగానే సమాచారం అందింది. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచే ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు, ఏఐయూ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. గురువారం ఉదయం ముంబై ఛత్రపది శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ కుటుంబం కదలికలపై అధికారులకు అనుమానం వచ్చింది. ఇద్దరు వృద్ధులతో సహా ముగ్గురు ఉన్న ఆ కుటుంబం లగేజీని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాళ్ల సూట్‌కేసులో ఉన్న షూస్ లోపల, పట్టుచీరల మధ్య అమెరికన్ డాలర్లు ప్రత్యక్షం కావడంతో కంగుతిన్నారు. మొత్తం అమెరికన్ డాలర్ కరెన్సీ విలువ 4,97,000 డాలర్లుకాగా, మన కరెన్సీలో దాని విలువ రూ.4.10 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించారు జడ్జి. ఇంత డబ్బు ఎక్కడిది? ఎలా చేతులు మారింది? అనే విషయాన్ని తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. #WATCH | In a targeted op by AIU, Mumbai Airport Customs, a family of 3 Indian pax going to Dubai were intercepted. The baggage examination of the 3 led to seizure of foreign currency worth 4,97,000 USD (approx Rs 4.1 Cr). All 3 passengers were arrested: Customs (Source:Customs) pic.twitter.com/TdQVZd4wox — ANI (@ANI) November 3, 2022 -
ముంబై ఎయిర్‌పోర్టు మూసివేత
ముంబై : ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ మూసివేయనున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇన్స్ట్రూమెంట్ లాండింగ్ సిస్టమ్(ఐఎల్ఎస్)ను అప్‌గ్రేడ్ చేయడం కోసం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల పాటు విమానాశ్రయం ప్రధాన రన్‌వేను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దట్టమైన మంచు, భారీ వర్షం పడుతున్న సందర్భాల్లో రన్‌వే స్పష్టంగా కనిపించక పోవడం వల్ల విమానాలను ల్యాండ్ చేయడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ‘ఐఎల్ఎస్’ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. గ్రౌండ్ బెస్డ్ ఇన్స్ట్ర్మెంట్ సిస్టమ్ ఆధారంగా, రేడియో సిగ్నల్స్‌తో పనిచేసే ఈ వ్యవస్థ విమానాలు ల్యాండ్ అయ్యే ప్రాంతానికి(రన్‌వే) సంబంధించిన పూర్తి సమాచారాన్ని పైలెట్‌కు తెలియజేస్తుంది. దానివల్ల విమానం సురక్షితంగా రన్‌వే మీద ల్యాండ్ అవుతుంది. మే18 నుంచి జరుగుతున్న ఈ ఐఎల్ఎస్ అప్‌గ్రేడ్ వల్ల ఈ మధ్య తరచుగా విమానాలు ఆలస్యం అవుతున్నాయి. గత నెలలో కూడా వర్షాకాలం ప్రారంభానికి ముందుగానే ప్రీ మాన్సూన్ పనులను పరిశీలించడానికి గాను ప్రధాన రన్‌వేను 6 గంటల పాటు మూసివేశారు. దానివల్ల ఒక్క రోజులోనే 200 విమానాలు రద్దయ్యాయి. మన దేశంలో నిత్యం బాగా రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఛత్రపతి శివాజీ విమానాశ్రయం రెండో స్ధానంలో ఉంది. దీని ప్రధాన రన్‌వే మీద గంటకు 48 విమానాలు టేక్ ఆఫ్, ల్యాండ్ అవుతుంటాయి. -
ప్రయాణికులకు షాకిచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించి తన మార్కును చాటుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం భార్య, కూతురుతో కలిసి ఇతర ముఖ్యమంత్రుల్లా చార్టర్డ్ విమానంలో కాకుండా జెట్ ఎయిర్ వేస్ ఫ్లయిట్ విమానం ఎకానమీ క్లాస్ లో నాగపూర్ కు వెళ్లారు. దాంతో ఒక్కసారిగా తోటి ప్రయాణికులు, మీడియా వాళ్లు ఆశ్చర్యంలో మునిగిపోయారు. మహారాష్ట్ర చరిత్రలో ఓ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీలా ప్రయాణించడం ఇదే మొదటిసారని, ఏ ముఖ్యమంత్రీ సాధారణ వ్యక్తిలా అందరితో కలసి ఎకానమీ క్లాస్ లో వెళ్లలేదని ఓ ప్రయాణికుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఇది ఒక శుభ పరిమాణం అన్నారు. ఖజానాకు భారం తగ్గించడానికి అధికారులు, రాజకీయ నాయకులు ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించడం, ఫైవ్ స్టార్ హోటళ్లలో బస లాంటివి మానుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించిన సంగతి తెలిసిందే. -
అత్యాధునిక టెర్మినల్
సాక్షి, ముంబై: అంధేరిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ (సహార్) విమానాశ్రయం పక్కనే అత్యాధునిక హంగులతో నిర్మించిన టెర్మినల్-2ను శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముంబై మేయర్ సునీల్ప్రభును ఆహ్వానించకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఈ కొత్త టెర్మినల్ భద్రత పూర్తిగా సీఐఎస్ఎఫ్ చేతిలో ఉంటుంది. కొన్ని సాంకేతిక కారణాలవల్ల భద్రత దళాలకు ఆయుధాలు అందజేయడానికి మరో పక్షం రోజులు పట్టవచ్చు. ప్రస్తుతం ఈ టెర్మినల్‌ను ప్రారంభించినప్పటికీ ఇది పూర్తిగా పనిచేయాలంటే మరో 10-15 రోజుల సమయం పడుతుంది. డొమెస్టిక్ విమానాశ్రయం కార్యకలాపాలన్నీ 2015 వరకు టెర్మినల్-2లోకి మారుతాయి. ఆ తరువాత ఆ డొమెస్టిక్ విమానాశ్రయాన్ని కార్గో కోసం వినియోగించే అవకాశాలున్నాయి. ఇక ఈ కొత్త టెర్మినల్ ప్రత్యేకతలివి.. 3,000 సీసీ టీవీ కెమరాలు. గంటకు 42 విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ 21 వేల చదరపు మీటర్ల స్థలం వివిధ దుకాణాలకు కేటాయింపు. (ప్రస్తుతం ఐదు వేల చదరపు మీటర్లు ఉంది. తరువాత విస్తరిస్తారు.) ఆరో శతాబ్దం మొదలుకుని 18వ శతాబ్దం నాటి చరిత్రాత్మక సామగ్రి భద్రపరిచే మ్యూజియం ఏర్పాటు చేస్తారు. ఇందులో ఆరువేల వస్తువులు భద్రపర్చవచ్చు. 140 ఇమిగ్రేషన్ కౌంటర్లు. 60 డిపార్చర్ ఇమిగ్రేషన్ కౌంటర్లు. 72 అరైవల్ ఇమిగ్రేషన్ కౌంటర్లు. 188 చెకిన్ కౌంటర్లు. 124 తనిఖీ మార్గాలు 52 ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జిలు 44 లగేజీ బెల్టులు 101 టాయిలెట్లు 4,100 ఎనౌన్స్మెంట్ స్పీకర్లు