సాక్షి, హైదరాబాద్
భాగ్యనగరం నుంచి గగన ప్రయాణం చేసే వారి సంఖ్య ఏటేటా భారీగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా విమానాల రాకపోకలూ పెరుగుతున్నాయి. నిత్యం హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 400 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తుండగా.. సగటున 50 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే 2016–17లో ఎయిర్ ట్రాఫిక్ 23 శాతం, ప్రయాణికుల సంఖ్య 21.9 శాతం పెరిగినట్లు తెలిపాయి. ఆ ఏడాదిలో 1.52 కోట్ల మంది ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారని పేర్కొన్నాయి. అదే 2002–03లో హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించిన దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య 19.10 లక్షలు మాత్రమేనని, ఈ లెక్కన 15 ఏళ్లలో విమాన ప్రయాణీకులు ఎనిమిది రెట్లు పెరిగారని వెల్లడించాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభమైన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అప్పటినుంచి శరవేగంగా అభివృద్ధి చెందుతూనే ఉండడం గమనార్హం.
దిగొచ్చిన ధరలతో..
విమాన టికెట్ల ధరలు మధ్య తరగతికి కూడా అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు, విమాన సర్వీసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు అసలు భరించలేని స్థాయిలో ఉన్న విమాన టికెట్ల ధరలు.. ప్రస్తుతం రైల్లో ఏసీ కోచ్‌లో చార్జీల స్థాయికి తగ్గాయి. కొంచెం ముందుగా బుక్ చేసుకుని ప్రయాణిస్తే.. తక్కువ ధరలోనే విమాన ప్రయాణం చేసే వీలు దొరికింది. మరోవైపు హైదరాబాద్ పర్యాటక, వాణిజ్య హబ్‌గా మారడం కూడా విమానాల ట్రాఫిక్ పెరిగేందుకు కారణమవుతోంది. వ్యాపార, వాణిజ్యాలు కూడా వేగంగా విస్తరిస్తుండడంతో దేశ, విదేశాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు పెరిగాయి.
విమానాశ్రయం విస్తరణకు ప్రణాళికలు
ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో.. అందుకు తగినట్లుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విస్తరించే పనులు చేపట్టారు. జీఎంఆర్ సంస్థ వర్గాలు ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలసిన సందర్భంగా విమానాశ్రయంలో అదనపు టెర్మినల్, మరో రన్‌వేలను నిర్మించేదిశగా ప్రతిపాదనలు సమర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నుంచి ఏటా 1.52 కోట్ల మంది ప్రయాణిస్తుండగా.. త్వరలో రెండు కోట్ల మంది ప్రయాణించేందుకు వీలుగా విమానాశ్రయ నిర్వహణ సంస్థ జీఎంఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయం నుంచి 9 దేశీయ, 17 అంతర్జాతీయ విమానయాన సంస్థలు విమానాలను నడుపుతున్నాయి. దేశంలోని 39 నగరాలకు, అంతర్జాతీయంగా 17 ప్రధాన నగరాలకు హైదరాబాద్ నుంచి విమాన కనెక్టివిటీ ఉంది. ‘ఫ్లై వయా హైదరాబాద్’నినాదంతో దేశంలోని పలు నగరాల మధ్య విమాన సర్వీసులు నడుపుతుండడం గమనార్హం. అంతేకాదు ఇక్కడి నుంచి నేరుగా విదేశాలకు వెళ్లే సర్వీసులు కూడా ఏటా పెరుగుతున్నాయి.
ఎయిర్ ట్రాఫిక్‌తో ఏరోసాల్ కాలుష్యం!
ఏటేటా విమానాల రాకపోకలు పెరుగుతుండడంతో వాటివల్ల ‘ఏరోసాల్’కాలుష్యం కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. విమానాల్లో ఇంధనంగా వినియోగించే గ్యాసోలిన్, పలు రసాయన పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, సరిగా మండని పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలు, జీవ ఇంధనాలు, బయోమాస్‌ను బహిరంగంగా తగలబెట్టడం వంటివాటితో ఏరోసాల్స్ కాలుష్యం ఉత్పన్నమౌతుంది. బ్లాక్ కార్బన్, ఇతర హానికారక వాయువులు, ఆవిరులు, ధూళి కణాలను కలిపి ఏరోసాల్స్‌గా చెప్పవచ్చు. ఈ కాలుష్యాన్ని గణించేందుకు హైదరాబాద్‌లో ‘సిస్టం ఆఫ్ ఏరోసాల్ మానిటరింగ్ అండ్ రీసెర్చి–ఎస్‌ఏఎంఏఆర్’ను ఏర్పాటు చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖను వాతావరణ శాఖ కోరినట్లు తెలిసింది. 16 ఎథలోమీటర్స్, 12 స్కై రేడియోమీటర్స్, 12 నెఫిలో మీటర్లను హైదరాబాద్ నలుమూలలా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. గాలిలో ఏరోసాల్స్ మోతాదు పెరగడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని.. శ్వాసకోశ వ్యాధులు, ఇతర అనారోగ్యాలు తలెత్తే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ నుంచి ఏటా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, ప్రయాణీకుల సంఖ్య..
సంవత్సరం సర్వీసులు ప్రయాణికులు
2012–13 200 83.66 లక్షలు
2013–14 250 87.28 లక్షలు
2014–15 300 1.05 కోట్లు
2015–16 350 1.24 కోట్లు
2016–17 400 1.52 కోట్లు
పలు మెట్రో నగరాల్లో రోజూ విమాన సర్వీసుల తీరు...
దేశంలో టాప్–10 విమానాశ్రయాలివీ..
Comments
Please login to add a commentAdd a comment