శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఐటీ కారిడార్‌కు వెళ్లే మార్గంలో నానల్‌నగర్, రేతిబౌలి వద్ద రెండు ఫ్లైఓవర్లు.. ఓ అండర్ పాస్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈమేరకు రూ.170 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. అనుమతి రాగానే వెంటనే పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటి నిర్మాణం పూర్తయితే... దాదాపు పది జంక్షన్లలో ఇక ట్రాఫిక్ తిప్పలు ఉండవు. సిగ్నల్స్ వద్ద వేచి చూసే బాధా తప్పుతుంది. ఈ మార్గంలో సగటు వాహన వేగం గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
– సాక్షి, సిటీబ్యూరో
సాక్షి, హైదరాబాద్: అటు శంషాబాద్ విమానాశ్రయం, ఆరాంఘర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మెహదీపట్నం.. ఇటు గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్ అత్యంత రద్దీ ప్రాంతాలు. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు ఆయా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ అవస్థలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంతో సమయం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. వీటికి పరిష్కారంగా ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించేందుకు నానల్‌నగర్, రేతిబౌలి జంక్షన్ల వద్ద రెండు ఫ్లై ఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. తద్వారా రెండు వైపులా సాఫీ ప్రయాణానికి వీలవుతుందని అంచనా వేశారు.
ఇందులో భాగంగా టోలిచౌకి మార్గంలోని ఫోర్ సీజన్స్ రెస్టారెంట్ దగ్గర మొదలయ్యే రెండు లేన్ల ఫ్లై ఓవర్.. ఒక లెవెల్‌లో నానల్‌నగర్ చౌరస్తా వద్ద కుడివైపు (లంగర్‌హౌస్)వైపు తిరిగి కేకే ఫంక్షన్‌హాల్ వరకు కొనసాగుతుంది. అదే ఫ్లై ఓవర్ మెహదీపట్నం మార్గంలో కొనసాగుతూ రేతిబౌలి జంక్షన్ దగ్గర రెండో లెవెల్‌లో పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేను క్రాస్ చేస్తూ అత్తాపూర్ రింగ్‌రోడ్డు దగ్గర్లో దిగుతుంది. అత్తాపూర్ వైపు నుంచి మెహదీపట్నం వైపు వచ్చే వారికి మరో ఫ్లై ఓవర్ నిర్మిస్తారు. వీటితోపాటు నానల్‌నగర్ దగ్గర ఒక అండర్‌పాస్ మెహదీపట్నం నుంచి టోలిచౌకి వైపు నేరుగా వెళ్లేందుకు నిర్మించనున్నారు. వీటిద్వారా వాహనాల వేగం గంటకు కనీసం 40 నుంచి 50 కి.మీగా ఉండగలదని అంచనా వేశారు.
ఇవీ మార్గాలు..
ఫ్లై ఓవర్ 1: అత్తాపూర్ వైపు నుంచి మెహదీపట్నం వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్. దీని వెడల్పు 8.5 మీటర్లు. రేతిబౌలి జంక్షన్ వద్ద కనీస వేగం 50 కేఎంపీహెచ్ వరకు ఉండొచ్చు.
ఫ్లై ఓవర్ 2: టోలిచౌకి అప్రోచ్ నుంచి రెండు లేన్ల ఫ్లై ఓవర్ ఫస్ట్ లెవెల్‌లో నానల్‌నగర్ జంక్షన్ వరకు కొనసాగుతుంది. అక్కడి వరకు 8.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. క్రమేపీ ముందుకు సాగుతూ రేతిబౌలి జంక్షన్ దగ్గర రెండో లెవెల్ ఫ్లై ఓవర్‌గా మారుతుంది. అక్కడ ఏడు మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఒక డౌన్ ర్యాంప్ లంగర్‌హౌస్ వైపు వెళ్తుంది. మరొకటి పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేను రెండో లెవెల్‌లో క్రాస్ చేస్తుంది. వీటి మీద వాహనాల కనీస వేగం 40 కేఎంపీహెచ్ వరకు సాధ్యమవుతుంది.
3 లేన్ల అండర్‌పాస్: రేతిబౌలి జంక్షన్ నుంచి టోలిచౌకి వైపు వెళ్లేందుకు నానల్‌నగర్ జంక్షన్ వద్ద అండర్‌పాస్. మూడు లేన్లతో ఒన్‌వేగా ఉంటుంది. వాహన కనీస వేగం 50 కేఎంపీహెచ్ వరకు ఉంటుంది.
వ్యయం రూ.170 కోట్లు..
వీటి నిర్మాణానికి దాదాపు రూ.170 కోట్లు ఖర్చు కాగలదని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ పాలకమండలి సర్వసభ్య సమావేశం ఆమోదించడంతో ప్రభుత్వ అనుమతి కోసం నివేదించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రేతిబౌలి వద్ద రద్దీ సమయంలో గంటకు 12,501 వాహనాలు, నానల్ నగర్ వద్ద 10,317 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. తద్వారా నానల్‌నగర్ నుంచి రేతిబౌలి వరకు, అక్కడి నుంచి మెహదీపట్నం బస్టాప్, రైతుబజార్ల వరకు తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment