ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు కేంద్రం శుభవార్త అందించింది. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహన రంగం కోసం అంతే వేగంగా మౌలిక సదుపాయాలను కల్పించడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం విధి విధానాలు గల ఒక హ్యాండ్ బుక్ ను నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఈ హ్యాండ్ బుక్ ను నీతి ఆయోగ్, విద్యుత్ మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ, వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ ఇండియా కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసింది.
ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. "భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అనేక మంది పోటీదారులు ఛార్జింగ్ మౌలిక సదుపాయాల మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ హ్యాండ్ బుక్ ప్రభుత్వ & ప్రైవేట్ భాగస్వాములతో కలిసి ఈవి ఛార్జింగ్ నెట్ వర్క్ లను ఏర్పాటు చేయడంలో కలిసి పనిచేయడానికి సహకరిస్తుంది. ఈవి ఛార్జింగ్ నెట్ వర్క్ లను అమలు చేయడంలో వివిధ స్థానిక అధికారులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ హ్యాండ్ బుక్ పరిష్కరిస్తుంది" అని అన్నారు.
ఈవి ఛార్జింగ్ సౌకర్యాలను సులభతరం చేయడానికి ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఈవిలకు ఛార్జింగ్ అందించడం వల్ల డిస్కమ్లపై కొత్త రకం పవర్ డిమాండ్ ఏర్పడుతుంది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరకు అంతరాయం లేని పవర్ సప్లైని అందించడానికి ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ల సామర్ధ్యం పెంచేలా ఈ పుస్తకంలో మార్గానిర్దేశం చేసినట్లు కేంద్రం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment