జ్యోతినగర్ (రామగుండం): రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ (ఇ.వి) కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో 178 ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ప్రజారవాణాలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యతనిచ్చే లక్ష్యంతో ఫేమ్– ఇండియా పథకం కింద రెండు దశల్లో ఈ ఆమోదం లభించింది. ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ల స్థాపనకు తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌ఆర్‌ఈడీకో) నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఒకేసారి మూడు కార్లను చార్జ్ చేయగల ప్లగ్ పాయింట్లతో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్‌లోనే అధికం
ఫేమ్–1లో హైదరాబాద్ ప్రాంతంలోని పట్టణ స్థానిక సంస్థల కోసం 118 స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. వరంగల్‌లో 10, కరీంనగర్‌లో మరో 10 మొత్తం 138 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఈ స్టేషన్లన్నీ ప్రభుత్వరంగ సంస్థ ఆధ్వర్యంలోనే స్థాపించి నిర్వహి స్తాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ), రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్ (ఆర్‌ఈఐఎల్), ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) స్థాపిస్తాయి. ఫేమ్–2లో మరో 40 ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ స్టేషన్లన్నీ హైదరాబాద్ చుట్టు్టపక్కల ప్రాంతంలోనే ఏర్పాటు చేయనున్నారు.
సంస్థల వారీగా..
ఎన్టీపీసీ సంస్థ సొంతంగా 32 ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్ (ఆర్‌ఈఐఎల్) 57, ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) 49 స్టేషన్లు ఏర్పాటు చేసి నిర్వహిస్తాయి. వరంగల్, కరీంనగర్‌లో ఏర్పాటు చేసే 20 యూనిట్లను ఆర్‌ఈఐఎల్ నిర్వహిస్తుంది. ఫేజ్–2లో అనుమతి పొందిన 40 కేంద్రాల ఏర్పాటు బాధ్యత ఇంకా ఎవరికీ అప్పగించలేదు.
యూనిట్‌కు రూ. 6
ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే సంస్థల నుంచి యూనిట్‌కు రూ.6 వసూలు చేయడానికి డిస్కమ్‌లు ముందుకొచ్చాయి. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే వినియోగదారుల నుంచి వసూలు చేయవలసిన రేట్లను టీఎస్‌ఆర్‌ఈడీకో త్వరలో ప్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment