అందుబాటులోకి కొత్త ఫీచర్లు
ఈవీ చార్జింగ్ స్టేషన్లు, ఇరుకు సందుల సమాచారం కూడా
ఓలా మ్యాప్స్ పోటీ ప్రభావం..
న్యూఢిల్లీ: దేశీయంగా ఓలా మ్యాప్స్ నుంచి పోటీ తీవ్రతరం కావడంతో గూగుల్ జోరు పెంచింది. భారత్‌లో యూజర్లను ఆకట్టుకోవడం కోసం గురువారం పలు సరికొత్త ఫీచర్లను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ స్టేషన్లు, ఫ్లైఓవర్లతో పాటు కారు డ్రైవర్లు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా ఏఐ ఆధారిత రూటింగ్ సమాచారం వంటివి ఇందులో ఉన్నాయి.
ఓలా ఫౌండర్, సీఈఓ భవీశ్ అగర్వాల్ దేశీ డెవలపర్ల కోసం ఓలా మ్యాప్స్‌ను అందుబాటులోకి తీసుకొచి్చన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, గూగుల్ మ్యాప్స్‌ను వాడొద్దని కూడా ఆయన పిలుపునివ్వడంతో మ్యాప్స్ వార్‌కు తెరలేచింది. దేశీ డెవలపర్లకు గాలం వేయడానికి ఏడాది పాటు ఓలా మ్యాప్స్‌ను ఉచితంగా వాడుకునే సదుపాయాన్ని కూడా అగర్వాల్ ప్రకటించడం విశేషం. దీంతో గూగుల్ కూడా వెంటనే రంగంలోకి దిగింది. గూగుల్ మ్యాప్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే డెవలపర్లకు ఆగస్ట్ 1 నుంచి 70 శాతం వరకు ఫీజులను తగ్గిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది.
దేశీ యూజర్లకు మేలు చేసేందుకే...
ఓలా పోటీ కారణంగానే ధరల కోత ప్రకటించాల్సి వచి్చందా అన్న ప్రశ్నకు గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్, జీఎం మిరియమ్ డేనియల్ స్పందిస్తూ... వాస్తవానికి పోటీ సంస్థలపై మేము దృష్టి సారించమని, తమ యూజర్లు, డెవలపర్ల ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘మా పార్ట్‌నర్స్ చాన్నాళ్లుగా ధరలను తగ్గించాలని కోరుతున్నారు.
మా యూజర్లతో పాటు డెవలపర్లకు మేలు చేయడంపై దృష్టి సారించాం. అందులో భాగంగానే రేట్ల కోతను ప్రకటించాం. వ్యాపార సంస్థలు, డెవలపర్లు, ప్రజలకు డిజిటల్ మ్యాపింగ్‌ను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడం కోసమే ఏఐ ఆధారిత రూటింగ్ తదితర కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాం’ అని వివరించారు. భారత్‌లో ఇరుకు రోడ్లు అనేవి కారు డ్రైవర్ల సహనానికి పరీక్ష పెడుతుంటాయని, అందుకే వాటిని తప్పించుకునే విధంగా ఏఐ ఆధారిత రూటింగ్ ఆల్గారిథమ్ వ్యవస్థను తీర్చిదిద్దామని చెప్పారు.
శాటిలైట్ చిత్రాలు, స్ట్రీట్ వ్యూతో పాటు భవనాల మధ్య దూరం, రోడ్ల రకాల వంటి సమాచారంతో రోడ్ల కచి్చతమైన వెడల్పును మ్యాప్స్‌లో చూడొచ్చని, తద్వారా సాధ్యమైనంత వరకు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా తప్పించుకునేందుకు వీలవుతుందని బ్లాగ్ పోస్ట్‌లో వివరించారు. మరోపక్క, బైకర్లు, పాదచారులు, ఇతర ప్రయాణికులు ఇప్పుడు ఈ ఇరుకు రోడ్లలో మరింత సురక్షితంగా, నమ్మకంగా వెళ్లొచ్చని చెప్పారు. అలాగే సంబంధిత రూట్లో ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు ఉన్నాయో కూడా ముందుగానే తెలియజేసే ఫీచర్ కూడా భారత్‌లో యూజర్లకు చాలా బాగా ఉపయోగపడుతుందన్నారు.
ముందుగా ఎనిమిది నగరాల్లో...
హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, ఇండోర్, భోపాల్, భువనేశ్వర్, గౌహతి మొత్తం 8 నగరాల్లో ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్ పరికరాల్లో ఈ వారంలోనే అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని నగరాలతో పాటు ఐఓఎస్, కార్‌ప్లే సపోర్ట్‌ను కూడా త్వరలో తీసుకొస్తామని గూగుల్ పేర్కొంది. టూవీలర్ ఈవీ యూజర్లు చార్జింగ్ స్టేషన్ల సమాచారాన్ని అందించేందుకు ఎలక్ట్రిక్ పే, అథర్, కాజామ్, స్టాటిక్ వంటి దిగ్గజ చార్జింగ్ ప్రొవైడర్లతో గూగుల్ జట్టు కట్టింది. తద్వారా 8,000 చార్జింగ్ స్టేషన్ల సమాచారం దేశీయంగా గూగుల్ మ్యాప్స్‌తో పాటు గూగుల్ సెర్చ్‌లో కూడా లభిస్తుంది. కాగా, ఈ ఫీచర్‌ను తొలిసారిగా భారత్‌లోనే ప్రవేశపెట్టడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment