ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు చార్జింగ్ స్టేషన్ల కోసం యాపిల్ అన్వేషణ కొనసాగిస్తుందట. ఈ విషయమై చార్జింగ్ స్టేషన్ కంపెనీలతో చర్చలు సాగిస్తుందట. అదేవిధంగా ఈ ఫీల్డ్ లో నిపుణులైన ఇంజనీర్లను యాపిల్ నియమించుకుంటుందని తెలుస్తోంది. ఏడాదిన్నరకు పైగా ఈ సిలికాన్ వ్యాలీ దిగ్గజం ఎలక్ట్రిక్ కార్లను తయారీకి కావాల్సిన వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ప్రస్తుతం ఈ కార్ల తయారీకి గ్రౌండ్ లెవల్ గా కావాల్సిన మౌలిక సదుపాయాలను, సాప్ట్ వేర్లను యాపిల్ అభివృద్ధి చేస్తోందని తెలుస్తోంది. అయితే యాపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోసం అధ్యయం చేస్తుందని రాయిటర్స్ గతేడాదే నివేదించాయి. ఐఫోన్ బ్రాండ్ కు నెమ్మదించిన మార్కెట్ తో యాపిల్ రెవెన్యూల కోసం కొత్త మార్గాన్ని అన్వేషిస్తుందని రాయిటర్స్ అప్పట్లో తెలిపింది.
ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో తక్కువగా ఉండటానికి ప్రధానమైన కారణం బ్యాటరీని నింపుకోవడం కష్టతరమవుతుండటమేనని యాపిల్ పేర్కొంది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉండటం, కారుకు చార్జింగ్ పెట్టుకోవడంలో సమయం వృధా అంశాలను పరిగణలోకి తీసుకుని సులభతరమైన డిజైన్లో యాపిల్ ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావడం ఓ అవకాశంగా భావిస్తోంది. వారికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం యాపిల్ చార్జింగ్ స్టేషన్ కంపెనీలతో సంప్రదింపులు చేసినట్టు ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయంపై చార్జింగ్ కంపెనీలు సైతం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే టెస్లా సూపర్ చార్జర్ నెట్ వర్క్ మాదిరిగానే యాపిల్ కూడా స్వంత టెక్నాలజీనే అభివృద్ధి చేసుకోనుందా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
మరోవైపు యాపిల్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోసం నలుగురిని చార్జింగ్ నిపుణులను ఇప్పటికే కంపెనీ ఉద్యోగులుగా నియమించుకుంది. మాజీ బీఎమ్ డబ్ల్యూ ఉద్యోగి రోనాన్ బ్రెన్నాన్ ను, ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు వైర్ లెస్ చార్జింగ్ కోసం పరిశోధిస్తున్న నాన్ లియును, గూగుల్ లో మాజీ చార్జింగ్ నిపుణుడు కర్ట్ అడెల్ బర్గర్ ను యాపిల్ ఇటీవలే తన ఉద్యోగులుగా చేర్చుకుంది. అయితే ఈ కారు ప్రాజెక్టు గురించి యాపిల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.