ముంబై: చార్జింగ్ స్టేషన్లపరమైన కొరత, ఇతరత్రా రిస్కులు ఉన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ బస్సుల (ఈ–బస్సులు) అమ్మకాలు రెండింతలు పెరగవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. పాలసీలు, వ్యయాలపరంగా సానుకూలత దన్నుతో మొత్తం బస్సుల విక్రయాల్లో వాటి వాటా 8 శాతానికి చేరవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఇది 4 శాతంగా ఉంది. ప్రజా రవాణా వ్యవస్థలో కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుండటం విద్యుత్ బస్సులకు సానుకూలమని క్రిసిల్ వివరించింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ పథకం కింద టెండర్ల ద్వారా రాష్ట్రాల ప్రజా రవాణా సంస్థలు ఈ–బస్సులను కొనుగోలు చేస్తున్నాయి.
మరోవైపు, సాంప్రదాయ ఇంధనాలు, సీఎన్‌జీతో నడిచే బస్సులతో పోలిస్తే ఈ–బస్సుల కొనుగోలు వ్యయం ప్రాథమికంగా ఎక్కువగానే ఉన్నప్పటికీ స్థానికంగా తయారీ, బ్యాటరీ ఖరీదు తగ్గుదల, విస్తృతంగా తయారీ తదితర అంశాల కారణంగా వ్యయాలు తగ్గొచ్చని క్రిసిల్ డైరెక్టర్ సుశాంత్ సరోదే తెలిపారు. ఈ–బస్సుల ఓనర్íÙప్ వ్యయాలు పెట్రోల్/డీజిల్ లేదా సీఎన్‌జీ బస్సులతో పోలిస్తే 15–20 శాతం తక్కువగానే ఉంటాయన్నారు. వాటి జీవితకాలం 15 ఏళ్లు ఉండగా.. ఆరు–ఏడేళ్లలోనే బ్రేక్‌ఈవెన్ (లాభనష్ట రహిత స్థితి) సాధించవచ్చని (సగటున 330 రోజుల పాటు రోజుకు 250 కి.మీ. రన్ రేట్‌తో) సుశాంత్ వివరించారు.
సవాళ్లూ ఉన్నాయి..
ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి సానుకూలాంశాలు ఉన్నా, దానికి తగ్గట్లే సవాళ్లు కూడా ఉన్నాయని క్రిసిల్ వివరించింది. రాష్ట్రాల రవాణా సంస్థల ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటం వల్ల అంతిమంగా ఈ–బస్ ప్రాజెక్టులకు రుణదాతలు రుణాలివ్వడానికి వెనుకాడేలా చేస్తోందని పేర్కొంది. బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత రెండో సవాలని వివరించింది.
నగరాల మధ్య బస్సులు నడిపే ఆపరేటర్లకు చార్జింగ్ సదుపాయాలే కీలకం. ఇటీవల ప్రకటించిన పీఎం–ఈ–బస్5 సేవా స్కీముతో చెల్లింపులపరంగా రుణదాతలకు కాస్త భరోసా లభించగలదని క్రిసిల్ రేటింగ్స్ టీమ్ లీడర్ పల్లవి సింగ్ తెలిపారు. ఈ–బస్ ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు రుణదాతలు సానుకూలంగా ఉండొచ్చని పేర్కొన్నారు. పీఎం–ఈబస్ సేవా స్కీము కింద కేంద్రం 169 నగరాల్లో 10,000 పైచిలుకు ఈ–బస్సులను వినియోగంలోకి తేవడం, 181 నగరాల్లో చార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment