E-bus
-
భారత్‌లో ఫాక్స్‌కాన్ బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్
శ్రీపెరంబదూర్: భారత్‌లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్లీ ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంపై దృష్టితో బ్యాటరీ తయారీ వ్యాపార విస్తరణపై ఫాక్స్‌కాన్ దృష్టి సారించింది. ఈ సంస్థ ఈ–బస్‌ల కోసం తైవాన్‌లో ఇలాంటి ప్లాంట్ ఒకదాన్ని ఇప్పటికే ఏర్పాటు చేయగా, ఈ ఏడాదే ఉత్పత్తి మొదలు కానుంది. ‘‘3ప్లస్3 భవిష్యత్ పరిశ్రమ ఏర్పాటుకు వేచి చూస్తున్నాం. తమిళనాడులో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ఏర్పాటు విషయంలో సహకారం ఎలా అన్నదానిపై పరిశ్రమల మంత్రితో చర్చిస్తున్నా’’ అని యాంగ్లీ తెలిపారు. సోలార్, విండ్ టర్బయిన్ల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను నిల్వ చేసేందుకు బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు వీలు కలి్పస్తాయి. మన దేశం పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇస్తుండడం తెలిసిందే. దీంతో ఈ విభాగంలో అవకాశాలను సొంతం చేసుకునేందుకు ఫాక్స్‌కాన్ ఆసక్తిగా ఉన్నట్టు యాంగ్లీ మాటలను బట్టి తెలుస్తోంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిశగా ఫాక్స్‌కాన్ ప్రణాళికలు అమలు చేస్తోంది. త్వరలోనే ఈవీల తయారీ మొదలవుతుందని యాంగ్లీ తెలిపారు. భారత్‌లో ఇప్పటివరకు తాము 1.4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశామని, వ్యాపారం 10 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందినట్లు చెప్పారు. రానున్న ఏడాది కాలంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ప్రస్తుత భారత పర్యటనలో భాగంగా పలు రాష్ట్రాల సీఎంలతో యాంగ్లీ సమావేశం కావడం గమనార్హం. ఎన్నో రాష్ట్రాలను సందర్శించిన తర్వాత భారత్ వృద్ధి పథకంలో ఉందని అర్థమవుతోందంటూ.. ఈ ప్రయాణంలో ఫాక్స్‌కాన్ సైతం భాగస్వామి కావాలనుకుంటున్నట్టు యాంగ్లీ చెప్పారు. -
ఎలక్ట్రిక్ బస్సుల అమ్మకాలు రెండింతలు
ముంబై: చార్జింగ్ స్టేషన్లపరమైన కొరత, ఇతరత్రా రిస్కులు ఉన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ బస్సుల (ఈ–బస్సులు) అమ్మకాలు రెండింతలు పెరగవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. పాలసీలు, వ్యయాలపరంగా సానుకూలత దన్నుతో మొత్తం బస్సుల విక్రయాల్లో వాటి వాటా 8 శాతానికి చేరవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఇది 4 శాతంగా ఉంది. ప్రజా రవాణా వ్యవస్థలో కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుండటం విద్యుత్ బస్సులకు సానుకూలమని క్రిసిల్ వివరించింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ పథకం కింద టెండర్ల ద్వారా రాష్ట్రాల ప్రజా రవాణా సంస్థలు ఈ–బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు, సాంప్రదాయ ఇంధనాలు, సీఎన్జీతో నడిచే బస్సులతో పోలిస్తే ఈ–బస్సుల కొనుగోలు వ్యయం ప్రాథమికంగా ఎక్కువగానే ఉన్నప్పటికీ స్థానికంగా తయారీ, బ్యాటరీ ఖరీదు తగ్గుదల, విస్తృతంగా తయారీ తదితర అంశాల కారణంగా వ్యయాలు తగ్గొచ్చని క్రిసిల్ డైరెక్టర్ సుశాంత్ సరోదే తెలిపారు. ఈ–బస్సుల ఓనర్íÙప్ వ్యయాలు పెట్రోల్/డీజిల్ లేదా సీఎన్జీ బస్సులతో పోలిస్తే 15–20 శాతం తక్కువగానే ఉంటాయన్నారు. వాటి జీవితకాలం 15 ఏళ్లు ఉండగా.. ఆరు–ఏడేళ్లలోనే బ్రేక్ఈవెన్ (లాభనష్ట రహిత స్థితి) సాధించవచ్చని (సగటున 330 రోజుల పాటు రోజుకు 250 కి.మీ. రన్ రేట్‌తో) సుశాంత్ వివరించారు. సవాళ్లూ ఉన్నాయి.. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి సానుకూలాంశాలు ఉన్నా, దానికి తగ్గట్లే సవాళ్లు కూడా ఉన్నాయని క్రిసిల్ వివరించింది. రాష్ట్రాల రవాణా సంస్థల ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటం వల్ల అంతిమంగా ఈ–బస్ ప్రాజెక్టులకు రుణదాతలు రుణాలివ్వడానికి వెనుకాడేలా చేస్తోందని పేర్కొంది. బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత రెండో సవాలని వివరించింది. నగరాల మధ్య బస్సులు నడిపే ఆపరేటర్లకు చార్జింగ్ సదుపాయాలే కీలకం. ఇటీవల ప్రకటించిన పీఎం–ఈ–బస్5 సేవా స్కీముతో చెల్లింపులపరంగా రుణదాతలకు కాస్త భరోసా లభించగలదని క్రిసిల్ రేటింగ్స్ టీమ్ లీడర్ పల్లవి సింగ్ తెలిపారు. ఈ–బస్ ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు రుణదాతలు సానుకూలంగా ఉండొచ్చని పేర్కొన్నారు. పీఎం–ఈబస్ సేవా స్కీము కింద కేంద్రం 169 నగరాల్లో 10,000 పైచిలుకు ఈ–బస్సులను వినియోగంలోకి తేవడం, 181 నగరాల్లో చార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది. -
కొత్తగా ఈ–బస్సులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) మరిన్ని విద్యుత్ బస్సులు (ఈ–బస్సులు) కొనుగోలు దిశగా కార్యాచరణకు సంసిద్ధమవుతోంది. కొత్తగా 1,500 ఈ–బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీసుల కోసం 100 ఈ–బస్‌లను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలకూ వీటి సేవలను విస్తరించాలని నిర్ణయించింది. అందుకోసం రెండో దశ కింద 1,500 ఈ–బస్‌లను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్)తో కలిసి ఆర్టీసీ ఈ బస్సులను తీసుకురానుంది. డీజిల్ బస్సుల స్థానంలో ఈ–బస్‌లు.. సీఈఎస్ఎల్, ఆర్టీసీ సంయుక్తంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్కో బస్సుకు రూ.కోటి చొప్పున రూ.1,500 కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్టును ఆమోదించాయి. డీజిల్ బస్సుల స్థానంలో ఈ–బస్‌లను ప్రవేశపెట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు 27 శాతం నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ఇక తొమ్మిది మీటర్ల పొడవుండే ఈ–బస్‌లు అయితే కి.మీ.కు రూ.39.21, అదే 12 మీటర్ల పొడవున్న ఈ–బస్ అయితే కి.మీ.కు రూ.43.49 వ్యయం అవుతుందని అంచనా వేశారు. జిల్లా కేంద్రాల మధ్య ఈ–బస్ సర్వీసులు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాల్లో ఈ–బస్ సేవలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అందుకే సమీపంలో ఉన్న జిల్లా కేంద్రాల మధ్య ఈ సర్వీసులను నిర్వహించాలని నిర్ణయించారు. మొదటగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు డిపోలకు వాటిని కేటాయించనున్నారు. ఆ డిపో కేంద్రాలు ఉన్న జిల్లా కేంద్రాల నుంచి రానూపోనూ 250 కి.మీ. దూరంలో ఉన్న జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాలకు వీటిని నడుపుతారు. ఎందుకంటే ఈ–బస్‌లకు ఓసారి చార్జింగ్ పెడితే గరిష్టంగా 250 కి.మీ. వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందుకోసం ఆయా డిపోల్లో చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటుచేస్తారు. ఇక ఆర్టీసీకి వెయ్యి ఈ–బస్‌లను అద్దె విధానంలో అందించేందుకు సీఈఎస్ఎల్ త్వరలో టెండర్ల ప్రక్రియ నిర్వహించనుంది. అనంతరం ఈ ఏడాది చివరి నాటికి వాటిని ఆర్టీసీకి అందజేస్తుంది. -
పీఎం–ఈబస్ సేవాతో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 10,000 ఎలక్ట్రిక్ బస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పీఎం–ఈబస్ సేవా’ పథకం.. క్షేత్ర స్థాయిలో ఈవీల విస్తరణకు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాల్లో ఆశాభావం వ్యక్తమైంది. పట్టణాల్లో ఎలక్ట్రిక్ బస్ సేవలకు వీలుగా ఈ పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 169 పట్టణాలకు 10,000 బస్‌లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో కేటాయించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ కంపెనీలకు ప్రయోజనం కలిగించనుంది. ఈ పథకంపై జేబీఎం ఆటో వైస్ చైర్మన్, ఎండీ నిశాంత్ ఆర్య స్పందిస్తూ.. ప్రముఖ పట్టణాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పర్వత ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాలకు కేటాయింపులు చేయడంతో ఎలక్ట్రిక్ బస్‌లను క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన్టటు అవుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఈవీ ఎకోసిస్టమ్ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. పీఎంఐ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ సీఈవో ఆంచాల్ జైన్ సైతం దీన్ని నిర్ణయాత్మక, పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసే పథకంగా పేర్కొన్నారు. స్థానికంగా ఈబస్ల తయారీని ప్రోత్సహిస్తుందన్నారు. -
‘పీఎం విశ్వకర్మ’కు మంత్రివర్గం ఆమోదం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ‘ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ’ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న ఐదేళ్లలో అమలు చేయనున్న ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కింద రూ.13,000 కోట్లు ఖర్చు చేస్తారు. దేశవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. చేనేత కార్మికులు, స్వర్ణకారులు, వడ్రంగులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు, కుమ్మరులు, శిల్ప కళాకారులు, రాళ్లు కొట్టేవారు, తాపీ మేస్త్రీలు, బుట్టలు అల్లేవారు, చీపుర్లు తయారుచేసేవారు, తాళాలు తయారుచేసేవారు, బొమ్మల తయారీదారులు, పూలదండలు తయారుచేసేవారు, మత్స్యకారులు, దర్జీలు, చేపల వలలు అల్లేవారు తదితర సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి ప్రయోజనం కలి్పంచాలని నిర్ణయించారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెపె్టంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన వారికి ‘పీఎం విశ్వకర్మ సరి్టఫికెట్, గుర్తింపు కార్డు’ అందజేస్తారు. రూ.2 లక్షల దాకా రుణ సదుపాయం కలి్పస్తారు. వడ్డీ రేటు 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. లబి్ధదారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తారు. మార్కెటింగ్ మద్దతు సై తం ఉంటుంది. అంటే ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. శిక్షణ కాలంలో రోజుకి రూ.500 స్టైపెండ్ పీఎం విశ్వకర్మ పథకంలో బేసిక్, అడ్వాన్స్డ్ అనే రెండు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. లబి్ధదారులకు శిక్షణ కాలంలో రోజుకి రూ.500 చొప్పున స్టైపెండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఆధునిక యంత్రాలు, పరికరాలు కొనుక్కోవడానికి రూ.15,000 వరకూ ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. మొదటి ఏడాది 5 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని వివరించారు. గురు–శిష్య పరంపరను, కుటుంబ ఆధారిత సంప్రదాయ నైపుణ్యాలను బలోపేతం చేయడమే పథకం ఉద్దేశమని స్పష్టం చేశారు. తొలుత 18 రకాల సంప్రదాయ నైపుణ్యాలకు పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. నగరాల్లో ‘పీఎం ఈ–బస్ సేవ’ పర్యావరణ హిత రవాణా సాధనాలకు పెద్దపీట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత ప్రోత్సహం ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ‘పీఎం ఈ–బస్ సేవ’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. రవాణా సేవలు వ్యవస్థీకృతంగా లేని నగరాల్లో ఎలక్ట్రిక్సిటీ బస్సులను ప్రవేశపెట్టడమే ఈ కార్యక్రమ లక్ష్యమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) విధానంలో 169 నగరాల్లో 10,000 ఈ–బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అంచనా వ్యయం రూ.57,613 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.20,000 కోట్లు సమకూరుస్తుందని వివరించారు. హరిత పట్ణణ రవాణా కార్యక్రమాల్లో భాగంగా 181 నగరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. 7 మల్టి–ట్రాకింగ్ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ రైల్వే శాఖలో 7 మల్టి–ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.32,500 కోట్లు. ఈ భారాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 35 జిల్లాలు ఈ ప్రాజెక్టుల పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న లైన్ కెపాసిటీ పెంచుతారు. మన కళాకారులకు మరింత ప్రోత్సాహం: మోదీ పీఎం విశ్వకర్మ పథకంతో మన సంప్రదాయ కళాకారులకు, చేతి వృత్తిదారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన దేశంలో నైపుణ్యాలకు, సాంస్కృతి వైవిధ్యానికి కొదవ లేదన్నారు. మన విశ్వకర్మల్లోని వెలకట్టలేని నైపుణ్యాలను ముందు తరాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
AP: ఆర్టీసీలో ఇక అన్నీ ఈ-బస్సులే
సాక్షి,అమరావతి/గోపాలపట్నం/సింహాచలం: రాష్ట్ర ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) పూర్తిగా ఈ – బాట పట్టనుంది. ఆర్టీసీలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు (ఈ–బస్సులు) రానున్నాయి. కాలుష్య నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఈ–బస్సులను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ–బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ–బస్సుల కొనుగోలుపై చర్చించి కార్యాచరణను ఖరారు చేశారు. ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు సమర్పించారు. వాటిపై ముఖ్యమంత్రి సమీక్షించి, అనుమతినిచ్చారు. ఆర్టీసీ ఇప్పటికే తిరుమల–తిరుపతి మార్గంలో 100 ఈ–బస్సులను ప్రవేశపెట్టింది. వీటిపై ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఇప్పుడు రాష్ట్రమంతటా ఈ–బస్సులను ప్రవేశపెట్టనుంది. ఈ–బస్సును ఒకసారి చార్జింగ్ చేస్తే ఒక రూట్లో రానుపోనూ ప్రయాణించవచ్చని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. డిస్కంలతో కలిసి ఈ–బస్సులకు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మొదటి దశలో రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో, రెండో దశలో జిల్లా కేంద్రాల్లోని బస్ స్టేషన్లలో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. మూడో దశలో డివిజన్ కేంద్రాలు, రాష్ట్ర సరిహద్దు సమీపంలోని పట్టణాల్లోని బస్ స్టేషన్లలో ఏర్పాటు చేస్తారు. రెండు దశల్లో 4 వేల ఈ–బస్సులు ప్రస్తుతం ఆర్టీసీలో 11,214 డీజిల్ బస్సులున్నాయి. వాటి స్థానంలో దశల వారీగా ఈ–బస్సులను ప్రవేశపెడతారు. మొదటగా రెండు దశల్లో 4 వేల బస్సులు కొనాలని నిర్ణయించారు. 2023లో 2 వేల ఈ–బస్సులను ప్రవేశపెడతారు. ఇందుకోసం ఆర్టీసీ వచ్చే ఏడాది ప్రారంభంలో టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. 2024లో పరిస్థితిని సమీక్షించాక.. మరో 2 వేల బస్సులను ప్రవేశపెడతారు. అవసరమైతే ఆ సంఖ్యను పెంచుతారు. ముందుగా సిటీ సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, దూర ప్రాంతాలకు నడపాలని భావిస్తున్నారు. ఐదేళ్లలో ఆర్టీసీలో డీజిల్ బస్సు అన్నదే లేకుండా పూర్తిగా ఈ–బస్సులనే నడపాలన్నది లక్ష్యం. వీటి కోసం విశాఖ నగరానికి సమీపంలోని సింహాచలం వద్ద సింహపురి లే అవుట్లో ఉన్న ఆర్టీసీ స్థలంలో ప్రత్యేక డిపో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గురువారం పరిశీలించారు. -
AP: అదనపు చార్జీల్లేకుండానే దసరా స్పెషల్ బస్సులు
సాక్షి, అమరావతి: ప్రయాణికులపై అదనపు చార్జీల భారం లేకుండానే దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు చెప్పారు. దశాబ్దకాలం తరువాత ఇలా అదనపు చార్జీలు లేకుండా ఆర్టీసీ దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించడం ఇదే తొలిసారని తెలిపారు. విజయవాడలోని బస్‌భవన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది దసరా రద్దీ దృష్ట్యా 4,500 ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తామని చెప్పారు. దసరా ఉత్సవాల ముందు ఈ నెల 29 నుంచి అక్టోబరు 4 వరకు 2,100 బస్సులు, దసరా తరువాత అక్టోబరు 5 నుంచి 9 వరకు 2,400 బస్సులు నడుపుతామని తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతోపాటు రాష్ట్రంలోని 21 నగరాలు, ముఖ్య పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు. అన్ని సర్వీసుల్లోను యూటీఎస్ విధానాన్ని అమలు చేస్తూ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్లు, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా టికెట్లు తీసుకోవచ్చని వివరించారు. అన్ని బస్సులను జీపీఎస్ ట్రాకింగ్ విధానంతో అనుసంధానించి కంట్రోల్ రూమ్ నుంచి 24/7 పర్యవేక్షిస్తామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేటు బస్సులను నిరోధించేందుకు పోలీసు, రవాణా శాఖలతో కలసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ–బస్ సర్వీసులు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్టీసీ ఈ–బస్ సర్వీసులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 10 ఈ–బస్సులను నడుపుతామన్నారు. అనంతరం దశలవారీగా డిసెంబర్ నాటికి తిరుమల–తిరుపతి ఘాట్‌రోడ్డులో 100 ఈ–బస్ సర్వీసులను ప్రవేశపెడతామని చెప్పారు. తిరుమల ఘాట్రోడ్తోపాటు రాష్ట్రంలో దూరప్రాంత సర్వీసుల కోసం కొత్తగా 650 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. గత ఏడాది 1,285 బస్సులను ఫేస్‌లిఫ్ట్ విధానంలో నవీకరించామని ఈ ఏడాది రూ.25 కోట్లతో మరో 1,100 బస్సులను నవీకరిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తామన్నారు. ఇటీవల పదోన్నతులు పొందిన దాదాపు రెండువేల మందికి సాంకేతికపరమైన అంశాలను పూర్తిచేసి నవంబర్ 1 నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఈడీ (కమర్షియల్) కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒలెక్ట్రాకు 100 ఈ–బస్‌ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తాజాగా 100 ఈ–బస్‌లకు ఆర్డర్ అందుకుంది. అసోం రోడ్డు రవాణా సంస్థ నుంచి ఈ మేరకు లెటర్ ఆఫ్ అవార్డ్ స్వీకరించింది. డీల్ విలువ రూ.151 కోట్లు అని సంస్థ సీఎండీ కె.వి.ప్రదీప్ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీ తయారీ ఎలక్ట్రిక్ బస్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా 5 కోట్లకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాయని గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీకి ఇదే తొలి ఆర్డర్. తొమ్మిది నెలల్లో ఈ బస్సులను డెలివరీ చేయనుంది. ఒలెక్ట్రాను మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రమోట్ చేస్తోంది. కాగా, గ్రీన్‌టెక్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.800 కోట్ల వరకు నిధులను సమీకరించడానికి బోర్డ్ ఆమోదం తెలిపిందని ఒలెక్ట్రా పేర్కొంది. -
భారీ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా శ్రీసత్యసాయి జిల్లా
ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతోంది. శ్రీసత్యసాయి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తోంది. ప్రత్యేక రాయితీలు అందిస్తూ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే శ్రీసత్యసాయి జిల్లాలో మెగా పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థ ‘వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్’ ఎలక్ట్రిక్ బస్సు తయారీ యూనిట్ ఏర్పాటు పనులను ముమ్మరం చేసింది. అనంతపురం టౌన్: భారీ పరిశ్రమలకు శ్రీసత్యసాయి జిల్లా కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే కియా కార్ల తయారీ పరిశ్రమతోపాటు అనేక అనుబంధ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. దీంతో పాటు నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్) సంస్థ శిక్షణ కేంద్రం రూపుదిద్దుకుంటోంది. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం గుడిపల్లిలో ఎలక్ట్రిక్ బస్సుల బాడీ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు ‘వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్’ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సదురు కంపెనీకి 124 ఎకరాల భూమిని కేటాయించింది. కంపెనీ ప్రతినిధులు దాదాపు రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా చేపడుతున్నారు. రానున్న రెండేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేసి పరిశ్రమను ప్రారంభించనున్నారు. వేలాది మందికి ఉపాధి.. వీర వాహన ఉద్యోగ్ కంపెనీ తొలుత రూ.600కోట్ల పెట్టుబడితో బస్సుల తయారీ పరిశ్రమ ప్రారంభించి, దశల వారీగా రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. స్థానికంగా దాదాపు 8వేల మంది కార్మికులకు ప్రత్యక్ష్యంగా ఉద్యోగ అవకాశాలు దక్కడంతో పాటు పరోక్షంగా మరో 15వేల మందికి ఉపాధి లభించనుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వీర వాహన ఉద్యోగ్ సంస్థ తయారు చేసే బస్సులను ఇప్పటికే దేశ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. కంపెనీ విస్తరణలో భాగంగా ‘ఈ– బస్సు’ బాడీ తయారీ యూనిట్‌ను శ్రీసత్యసాయి జిల్లాలో నెలకొల్పుతోంది. గుడిపల్లి యూనిట్లో ఎలక్ట్రికల్ బస్సులతో పాటు ఏసీ, నాన్ ఏసీ బస్సు బాడీలను తయారు చేయనున్నారు. సోమందేపల్లి మండలం గుడిపల్లి వద్ద బస్సుల బాడీ తయారీ ప్లాంట్ కోసం జరుగుతున్న పనులు ఏడాదికి 3 వేల బస్సుల తయారీ.. రానున్న రోజులు ఎలక్ట్రిక్ రంగానిదే. ఈ – వాహనాల తయారీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అన్ని కంపెనీలు ‘ఈ – వాహనాల’ తయారీపై దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగానే ‘వీర వాహన ఉద్యోగ్’ బస్సుల తయారీ పరిశ్రమ సైతం అటువైపు అడుగులు వేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం గుడిపల్లి సమీపంలో ఏర్పాటు చేస్తున్న వీర వాహన ఉద్యోగ్ పరిశ్రమలో ఈ వాహనాలతోపాటు అన్ని రకాల బస్సులను తయారు చేయనున్నారు. ఏడాదికి మూడు వేల బస్సులు తయారు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. చదవండి: (ఆర్ఆర్బీ అభ్యర్థులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్..) త్వరలో మరిన్ని పరిశ్రమలు పారిశ్రామికంగా శ్రీసత్యసాయి జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే జిల్లాలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు అందించి ప్రోత్సహిస్తోంది. వీర వాహన బస్సుల తయారీ పరిశ్రమతోపాటు రానున్న రోజుల్లో మరిన్ని భారీ పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు భారీ పరిశ్రమల నిర్వాహకులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటోంది. రెండేళ్లలో వీర వాహన ఉద్యోగ్ పరిశ్రమలో బస్సులు తయారీ ప్రారంభం కానుంది. – మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ వేగవంతంగా పనులు కోవిడ్ పరిస్థితుల కారణంగా ‘వీర వాహన’ పరిశ్రమ ఏర్పాటు పనులు ఏడాదికి పైగా ఆగిపోయాయి. ప్రస్తుతం పనులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే 30 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని వీర వాహన బస్సుల తయారీ పరిశ్రమ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ అండగా నిలుస్తోంది. సకాలంలో వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం. – నాగభూషణం, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ -
డీజిల్ బస్సులకు టాటా.. ఇ–బస్సులకు స్వాగతం
సాక్షి, అమరావతి: డీజిల్ బస్సులకు టాటా చెబుతూ.. ఇ–బస్సులను స్వాగతించేందుకు రాష్ట్ర ప్రజా రవాణా విభాగం(ఆర్టీసీ) ముందడుగు వేస్తోంది. పర్యావరణ పరిరక్షణ, నిర్వహణ వ్యయం తగ్గింపునకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు (ఇ–బస్సులు)ను ప్రవేశపెట్టేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే తిరుమల–తిరుపతి మధ్య 150 ఇ–బస్సులను ప్రవేశపెట్టేందుకు టెండర్లు ఖరారు చేసింది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ ఇ–బస్సులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ ర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో కొత్త ఇ–బస్సులను ప్రవేశపెట్టడం భారీ వ్యయంతో కూడినది కావడంతో.. పాత డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్పు చేసేందుకు సిద్ధపడుతోంది. ఇందుకోసం రెట్రోఫిట్మెంట్ (పునర్నిర్మాణ) ప్రాజెక్టును చేపట్టనుంది. ప్రాజెక్టు ఇలా.. డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ రెట్రోఫిట్మెంట్ ప్రాజెక్టుపై కసరత్తును ఆర్టీసీ ముమ్మరం చేసింది. పైలట్ ప్రాజెక్ట్‌గా ఒక డీజిల్ బస్సును ఇటీవల రెట్రోఫిట్ చేసి ఇ–బస్సుగా మార్చింది. డీజిల్ ఇంజన్ చాసిస్ ఉన్న బస్సులో బ్యాటరీతో పనిచేసే ఇంజన్‌ను ఏర్పాటు చేశారు. చాసిస్‌ను అలానే ఉంచి ఇ–బస్సుకు అనుగుణంగా రీ బాడీ బిల్డింగ్ చేశారు. దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం పుణేలోని ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ (సీఐఆర్టీ)’కి పంపిస్తారు. ఆ బస్సును అక్కడి నిపుణులు పరీక్షించి అన్ని ప్రమాణాల మేరకు ఉన్నాయని భావిస్తే సర్టిఫికెట్ జారీ చేస్తారు. అనంతరం ఆర్టీసీ డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మారుస్తారు. దశలవారీగా ఇ–బస్సులుగా మార్పు ప్రస్తుతం ఆర్టీసీ వద్ద మరో పదేళ్ల జీవిత కాలం ఉన్న 2 వేల డీజిల్ బస్సులు ఉన్నాయి. వాటిని ముందుగానే దశల వారీగా ఇ–బస్సులుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకోసం నీతి ఆయోగ్, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మార్గనిర్దేశాల ప్రకారం కసరత్తు చేస్తోంది. కొత్తగా కొనుగోలు చేసే ఇ– బస్సులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. 12 మీటర్ల బస్సులకు రూ.55 లక్షలు, 9 మీటర్ల బస్సులకు రూ.45 లక్షల చొప్పున రాయితీ ఇస్తోంది. డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్చి నప్పుడు అదే రీతిలో రాయితీ ఇవ్వాలని ఆర్టీసీ కేంద్రాన్ని కోరనుంది. పుణేలోని సీఐఆర్టీ నుంచి సర్టిఫికేషన్ వచ్చిన తరువాత ఈ దిశగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల తరహాలో ఈ రెట్రోఫిట్మెంట్ ప్రాజెక్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం టెండర్లు పిలిచి బిడ్డర్లను ఎంపిక చేస్తుంది. డీజిల్ బస్సులను దశలవారీగా ఇ–బస్సులుగా మార్చే దిశగా రెట్రోఫిట్మెంట్ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నామని ఆర్టీసీ ఈడీ (ఇంజినీరింగ్) కృష్ణమోహన్ ‘సాక్షి’కి తెలిపారు. దీనివల్ల కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు. -
తిరుమల–తిరుపతిల్లో ఈ–బస్సులకు రైట్‌రైట్
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ తిరుమల, తిరుపతిల్లో ఈ–బస్సులకు ఆర్టీసీ రైట్‌రైట్ చెప్పింది. తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో 50, తిరుపతి ఇంటర్ సిటీ సర్వీసుగా 50 ఈ–బస్సులను అద్దె ప్రాతిపదికన ప్రవేశపెట్టడానికి టెండర్లను బుధవారం ఆమోదించింది. ఏసీ డీజిల్ అద్దె బస్సుల ధరకే ఏసీ ఈ–బస్సులను ప్రవేశపెట్టడానికి ఆమోదిస్తూ టెండర్లు ఖరారు చేసింది. దేశంలోనే అతి తక్కువ ధరకు ఈ–బస్సుల టెండర్లను ఖరారు చేసిన సంస్థగా ఆర్టీసీ గుర్తింపు పొందింది. రాష్ట్రంలో తిరుమల–తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరులలో 350 ఏసీ ఈ–బస్సులను ప్రవేశపెట్టేందుకు 5 ప్యాకేజీల కింద ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. టెక్నికల్ బిడ్‌లో ఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అశోక్ లేలాండ్ కంపెనీలు అర్హత సాధించి ఫైనాన్సియల్ బిడ్లు దాఖలు చేశాయి. ఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3 ప్యాకేజీలలో ఎల్–1గా నిలవగా, అశోక్ లేలాండ్ 2 ప్యాకేజీలలో ఎల్–1గా వచ్చింది. అధిక ధరలు కోట్ చేస్తే సమ్మతించేది లేదని ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఆర్టీసీ ఉన్నతాధికారులకు విస్పష్టంగా చెప్పారు. ఆర్టీసీ డీజీల్ బస్సుల రేట్లకే ఈ–బస్సులను టెండర్లు ఖరారు చేయాలన్నారు. అందుకు సాధ్యం కాకపోతే ఏకంగా టెండర్ల ప్రక్రియ నిలిపేయాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆ రెండు సంస్థలతో పలు దఫాలుగా చర్చించారు. తిరుమల, తిరుపతిల్లో ఈ–బస్సుల అంశంలో డీజిల్ బస్సుల ధరలకు దగ్గరగా రావడంతో ఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టెండర్లు ఖరారు చేశారు. అధిక ధరలు కోట్ చేయడంతో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరుల్లో ఈ–బస్సుల టెండర్ల అంశాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు. ఆర్టీసీపై ఆర్థికభారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తిరుమల–తిరుపతిలో ప్రవేశపెట్టే ఈ–బస్సుల పనితీరును సమీక్షించడంతోపాటు రానున్న ఏడాదిలో ఈ–బస్సుల ధరలు మరింతగా తగ్గితే ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. కిలోమీటరుకు రూ.52.52 తిరుమల–తిరుపతిల్లో 100 ఈ–బస్సులకు టెండర్లను ఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఖరారు చేశారు. తిరుమల–తిరుపతి ఘాట్‌రోడ్డులో 50 బస్సులు, తిరుపతి సిటీ సర్వీసు కింద 50 బస్సులను ప్రవేశపెడతారు. ఘాట్‌రోడ్డులో తిరిగే ఈ–బస్సులకు విద్యుత్ ఖర్చులతో కలిపి కిలోమీటరుకు రూ.52.52 చొప్పున చెల్లిస్తారు. దీన్లో బస్సు చార్జీలు రూ.45.76, విద్యుత్ చార్జీలు రూ.6.76. తిరుపతి సిటీ సర్వీసులో తిరిగే ఈ–బస్సులకు విద్యుత్ ఖర్చులతో కలిపి కిలోమీటరుకు రూ.44.95 చొప్పున చెల్లిస్తారు. దీన్లో బస్సు చార్జీలు రూ.38.19, విద్యుత్ చార్జీలు రూ.6.76. దేశంలోనే అత్యంత తక్కువ ధర దేశంలోనే అతి తక్కువ ధరకు ఈ–బస్సుల టెండర్లను ఆర్టీసీ ఖరారు చేసింది. ఘాట్‌రోడ్డు, సాధారణ రోడ్డులలో ఈ–బస్సులకు దేశంలో ఇప్పటివరకు తక్కువ ధరకు ఖరారైన టెండర్లను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. దేశంలో ఘాట్‌రోడ్లపై ఇప్పటివరకు అతి తక్కువ ధరకు ఈ–బస్సుల టెండర్లను డెహ్మాడూన్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఖరారు చేసింది. విద్యుత్ చార్జీలతో కలిపి కిలోమీటరుకు రూ.66.78కి టెండర్లు ఆమోదించారు. మన రాష్ట్రంలో తిరుమల–తిరుపతి ఘాట్‌రోడ్డులో ఈ–బస్సుల టెండర్లను విద్యుత్ చార్జీలతోసహా కేవలం రూ.52.52కే ఆర్టీసీ ఆమోదించింది. డెహ్రాడూన్‌లో 27+1 కెపాసిటీ బస్సులను ప్రవేశపెట్టారు. అంతకంటే తక్కువ ధరకు తిరుమల–తిరుపతిలో 35+1 కెపాసిటీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. దేశంలో సాధారణ రోడ్లపై ఇప్పటికి అతి తక్కువ ధరకు ఈ–బస్సుల టెండర్లను మహారాష్ట్రలోని నవీ ముంబాయి కార్పొరేషన్ ఖరారు చేసింది. విద్యుత్ చార్జీలతోసహా అక్కడ కిలోమీటరుకు రూ.52.20కు టెండర్లు ఆమోదించారు. అంతకంటే తక్కువగా ఆర్టీసీ తిరుపతి ఇంటర్ సిటీ సర్వీసుల కోసం ఈ–బస్సుల టెండర్లను కిలోమీటరుకు కేవలం రూ.44.95కే ఖాయం చేయడం విశేషం. నవీ ముంబాయిలో 27+1 కెపాసిటీ ఈ–బస్సులను ప్రవేశపెట్టగా అంతకంటే తక్కువ ధరకు తిరుపతిలో ఇంటర్ సిటీ సర్వీసుల కోసం 35+1 కెపాసిటీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. నాలుగు నెలల్లో రోడ్లపైకి బస్సులు టెండర్లు ఖరారు చేయడంతో తిరుమల, తిరుపతిల్లో ఈ–బస్సులు త్వరలో రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బస్సులను సమకూర్చుకున్న తరువాత వాటిని రాష్ట్ర రహదారులపై పరీక్షిస్తారు. ప్రమాణాల మేరకు ఉన్నట్టు నిర్ధారించిన తరువాతే అనుమతిస్తారు. నాలుగు నెలల్లో ప్రయాణికులకు ఈ–బస్సుల సేవలు అందుతాయని ఆర్టీసీ భావిస్తోంది. -
రోడ్డెక్కనున్న 5,595 ఎలక్ట్రిక్ బస్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా మరో 5,595 ఎలక్ట్రిక్ బస్‌లు రోడ్డెక్కనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఈ మేరకు ఫేమ్ ఇండియా స్కీం ఫేజ్–2 కింద ఆమోదం తెలిపింది. 64 నగరాల్లో ఇవి కొద్ది రోజుల్లో పరుగెత్తనున్నాయి. 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలు, స్మార్ట్ సిటీస్, రాజధాని నగరాలు, స్పెషల్ కేటగిరీ స్టేట్స్‌లోని నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆసక్తి వ్యక్తీకరణను డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కోరింది. 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 14,988 ఎలక్ట్రిక్ బస్‌ల కోసం 86 ప్రతిపాదనలు చేశాయి. వీటిని పరిశీలించిన ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, సాంక్షనింగ్ కమిటీ చేసిన సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం 5,595 బస్‌లను మంజూరు చేసింది. ఇందులో 5,095 బస్‌లు నగరాల్లో (ఇంట్రాసిటీ) నడిపేందుకు నిర్దేశించారు. నగరాల మధ్య (ఇంటర్సిటీ) కార్యకలాపాలు సాగించేందుకు మరో 400 బస్‌లు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం 100 బస్‌లను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు కేటాయించారు. కాంట్రాక్టు కాలంలో అన్ని బస్‌లు 400 కోట్ల కిలోమీటర్లు తిరగనున్నాయి. 120 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. ఫేజ్–2 కింద ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మొత్తం 350 ఎలక్ట్రిక్ బస్‌లను చేజిక్కించుకుంది. ఇందులో విశాఖపట్నం 100, విజయవాడ 50, అమరావతి 50, తిరుపతి 50, కాకినాడ 50 బస్‌లను దక్కించుకున్నాయి. అలాగే నగరాల మధ్య ప్రజా రవాణాకు 50 బస్‌లను కేటాయించారు. తెలంగాణలో హైదరాబాద్‌కు 300, వరంగల్‌కు 25 బస్‌లు అలాట్ అయ్యాయి. కాగా, ఫేజ్–2లో నాలుగు రాష్ట్రాల్లో లోయెస్ట్ బిడ్డర్‌గా హైదరాబాద్ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నిలిచినట్టు మార్కెట్ వర్గాల సమాచారం. అలాగే దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా సంస్థల టెండర్లలో ఈ కంపెనీ పోటీలో ముందున్నట్టు తెలుస్తోంది. 9, 12 మీటర్ల పొడవున్న బస్‌లను ఒలెక్ట్రా తయారు చేస్తోంది. ఇప్పటికే దేశంలో పలు నగరాల్లో 400కుపైగా ఒలెక్ట్రా ఈ–బస్‌లు విజయ వంతంగా పరుగెడుతున్నాయి. బ్యాటరీ మినహా బ స్కు కావాల్సిన విడిభాగాలన్నీ దేశీయంగా తయా రు చేస్తోంది. జడ్చర్ల వద్ద సంస్థకు ప్లాంటు ఉంది. -
హైదరాబాద్‌లో ఓలెక్ట్రా బస్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్‌ల తయారీలో ఉన్న ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద అంతర్జాతీయ స్థాయిలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే సంస్థకు జడ్చర్ల వద్ద తయారీ కేంద్రం ఉంది. ప్రతిపాదిత నూతన ప్లాంటు కోసం తెలంగాణ ప్రభుత్వం 300 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసింది. ఏడాదిన్నరలో తొలి దశ పూర్తి అవుతుంది. ఆ తర్వాత రెండేళ్లకు రెండు, మూడవ దశ పూర్తి చేస్తామని ఓలెక్ట్రాను ప్రమోట్ చేస్తున్న మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గ్రూప్ డైరెక్టర్ కె.వి.ప్రదీప్ తెలిపారు. బీవైడీ–ఓలెక్ట్రా తయారీ 40 ఎలక్ట్రిక్ బస్‌లను టీఎస్ఆర్టీసీ మంగళవారమిక్కడ ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ఫ్యాక్టరీకి రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించారు. అన్ని దశలు పూర్తి అయితే ప్రత్యక్షంగా 3,500 మందికి, పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ఏటా 10 వేల యూనిట్ల విపణి.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఉద్దే శించిన ఫేమ్–2 పథకంతో ఈ రంగానికి మంచి బూస్ట్‌నిస్తుందని ఓలెక్ట్రా ఎండీ ఎన్.కె.రావల్ తెలిపారు. ‘మూడేళ్లలో ఫేమ్–2 కింద 7,000 బస్‌లకు కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. రెండేళ్ల తర్వాత ఏటా భారత్‌లో 10,000 ఎలక్ట్రిక్ బస్‌లు రోడ్డెక్కుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ–బస్‌ల వినియోగాన్ని పెంచనున్నాయి. ప్రస్తుతం ఓలెక్ట్రా మూడు రకాల మోడళ్లలో బస్‌లను తయారు చేస్తోంది. మరిన్ని మోడళ్లను పరిచయం చేస్తాం. ప్రస్తుతం 120 బస్‌లకు ఆర్డర్ బుక్ ఉంది’ అని వివరించారు. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ బస్‌ల విభాగం కోసం మేఘా ఇంజనీరింగ్ రూ.800 కోట్లు ఖర్చు చేసింది. పెట్టుబడులు కొనసాగిస్తాం.. భారత్‌లో ఎలక్ట్రిక్ బస్‌ల రంగంలో రానున్న రోజుల్లో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఓలెక్ట్రా భాగస్వామి బీవైడీ ఇండియా ఎండీ లియో షోలియాంగ్ అన్నారు. దేశంలో ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెడతామని చెప్పారు. ఇప్పటి వరకు ఇక్కడ రూ.1,400 కోట్లు పెట్టుబడి పెట్టామని వెల్లడించారు. ఇలా పెట్టుబడులకు కొనసాగిస్తామని పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటికే ఓలెక్ట్రా రూపొందించిన 68 బస్సులు హిమాచల్ ప్రదేశ్, పుణే, కేరళ, ముంబైతోపాటు శంషాబాద్ విమానాశ్రయంలో పరుగెడుతున్నాయని ఓలెక్ట్రా ఈడీ ఎన్.నాగ సత్యం తెలిపారు. తాజాగా ప్రవేశపెట్టిన 40 బస్సులతో కలిపి వీటి సంఖ్య 108కి చేరుతుందని చెప్పారు. ఒక్కో బస్సు ఒకసారి చార్జింగ్‌తో 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ సీవోవో ఆనంద్ స్వరూప్ తెలిపారు. ఈ–బజ్ కే9 పేరుతో రూపొందిన ఈ మోడల్ ఏసీ బస్‌లు 12 మీటర్ల పొడవుంటాయి. డ్రైవరుతో కలిపి 40 మంది కూర్చోవచ్చు. ఇతర నగరాలకు ఈ–బస్‌లు.. మియాపూర్, జేబీఎస్ బస్టాండ్ నుంచి వివిధ మార్గాల ద్వారా శంషాబాద్‌కు ఈ 40 బస్‌లను నడుపుతారు. ఇన్ని ఎలక్ట్రిక్ బస్‌లు ఒకేసారి రోడ్డెక్కడం దేశంలో ఇదే ప్రథమమని రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీఎస్ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అన్నారు. ఈ–బస్‌ల విషయంలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించాల్సిందేనని తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు ఎలక్ట్రిక్ బస్‌లను ప్రవేశపెడతామని వెల్లడించారు. పెరుగుతున్న కాలుష్యం, ఇంధన ధరల కట్టడికి ఈ–బస్‌లు పరిష్కారమని అభిప్రాయపడ్డారు. -
‘ఈ’ బస్సు చాలా స్పెషల్ !
అధునాతనం: మనదేశంలో ఏదైనా కొత్తగా వస్తే అది ప్రపంచంలో బాగా పాపులర్ అనుకుంటాం. నిజానికి చాలా పెద్ద దేశాల్లోనూ ఈ-బస్సు లాంటివి ఇంకా ఇపుడిపుడే మొదలువుతున్నాయి! బైకు మీద రయ్యిన దూసుకెళ్తుంటాం. కాస్త స్లో చెయ్యగానే పక్క నుంచి సిటీ బస్సు ఓవర్టేక్ చేస్తుంది. సరిగ్గా మనం బస్సు వెనుకభాగంలో ఉంటాం. డ్రైవర్ మరింత వేగం పెంచుతాడు. అప్పుడు ఆ బస్సు గుప్పుమంటూ వదిలే పొగ మన ముఖాన్ని మాడ్చేసి, ఒక్క నిమిషం ఊపిరిసలపకుండా చేస్తుంది... ఇలాంటి బస్సులు ఒకటా రెండా? వేలల్లో ఉంటాయి. అవన్నీ వదిలే పొగకు నగరం ఏమవ్వాలి? వాతావరణం ఎంతగా కాలుష్యం కావాలి? ఇలాగే ఆందోళన చెందిన బెంగళూరు నగర రోడ్డు రవాణా సంస్థ.. ఎలక్ట్రానిక్ బస్సును రోడ్డుపైకి తెచ్చింది. పొగ లేదు.. శబ్దం లేదు.. కుదుపుల్లేవు.. సుఖవంతమైన ప్రయాణం. డీజిల్ పోయక్కర్లేదు. నిర్వహణ ఖర్చు తక్కువ. ఇలా ఎన్నో ప్రత్యేకతలు. రోడ్డు రవాణా వ్యవస్థకు సంబంధించి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా అందిపుచ్చుకోవడంలో కర్ణాటక ముందుంటుందన్నది తెలిసి విషయమే. దేశంలో ముందుగా వోల్వో బస్సులను ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో అది ఒకటి. సిటీలో ఏసీ బస్సుల్ని నడపడం కూడా కర్ణాటక ముందుగా చేసి చూపించింది. ఇపుడు దేశంలోనే తొలి ఎలక్ట్రానిక్ బస్సును ప్రవేశపెట్టింది. నగరంలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో బీఎంటీసీ చేసిన కొత్త ఆలోచన ఇది. చైనాకు చెందిన బీవైడీ అనే ఆటోమొబైల్ సంస్థ మూడు నెలల పాటు ట్రయల్ రన్ కోసం ఈ బస్సును ఉచితంగా ఇచ్చింది. అంతేగాక ఓ వ్యక్తిని ఆ బస్సుతో పాటు పరిశీలనకు నియమించింది. బస్సును మెజెస్టిక్-కడుగొడి మధ్య రోజూ ఆరు ట్రిప్పులు నడుపుతున్నారు. పొగ లేని ఈ బస్సులో ప్రయాణించడానికి బెంగళూరు ప్రజలు సరదా పడుతున్నారు. కొందరు అయితే ప్రయాణ అనుభూతి కోసమే బస్సెక్కుతున్నారట. మరి తొలి ఎలక్ట్రిక్ బస్సు కదా. ఇందులో ఛార్జీ కూడా వోల్వో బస్సు ఛార్జీనే. ట్రయల్న్ ్రవిజయవంతం కావడంతో త్వరలో ఇంకొన్ని బస్సుల్ని దిగుమతి చేసుకుని పూర్తి స్థాయిలో నడపాలని.. భవిష్యత్తులో వాటిని పెంచుతూ పోవాలని బీఎంటీసీ నిర్ణయించింది. బస్సు నడిపే వ్యయం తక్కువే కానీ కొనాలంటే బస్సు బాగా ఖరీదు. ఒక్కోటీ 2.7 కోట్ల రూపాయల విలువైన ఈ బస్సులను కొనడానికి ప్రభుత్వ సాయం కోరుతోంది బీఎంటీసీ. ఈ-బస్సు సంగతులు - వోల్వో బస్సు ధర ఇందులో మూడోవంతే. అయితే వోల్వో నిర్వహణ ఖర్చు కి.మీ.కు 16 రూపాయలు. ఎలక్ట్రిక్ బస్సు వ్యయం ఏడురూపాయలే. - కాలుష్యం జీరో. పూర్తి ఎయిర్ కండిషన్డ్. - అన్నీ కుషన్ సీట్లే. సామర్థ్యం 41. బస్సు మొత్తం సీసీ కెమెరాలుంటాయి. స్త్రీలకూ రక్షణ. - అగ్నిప్రమాద నివారణ జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. ఒకవేళ జరిగినా ఆర్పే పరికరాలన్నీ ఇన్‌బిల్ట్. - ఆరు గంటలు ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పొడవు 40 అడుగులు. బరువు 18 టన్నులు. లండన్‌లో మొదలయ్యాయి మనదేశంలో ఏదైనా కొత్తగా వస్తే అది ప్రపంచంలో బాగా పాపులర్ అనుకుంటాం. నిజానికి చాలా పెద్ద దేశాల్లోనూ ఈ-బస్సు లాంటివి ఇంకా ఇపుడిపుడే మొదలువుతున్నాయి! బ్రిటన్‌లోనూ ఇదే ఏడాది ఈ బస్సులు రోడ్డుపైకి వచ్చాయి. లండన్‌లో ఒకేసారి నాలుగు ఈ-బస్సులు ప్రారంభించారు. విశేషం ఏంటంటే అక్కడ ఈ ప్రాజెక్టు చేపట్టింది ఇండియాలో మొదలై ప్రస్తుతం లండన్ హెడ్‌క్వార్టర్‌గా నడుస్తున్న హిందుజా గ్రూప్ ఉప సంస్థ ఆప్టేర్. కాలుష్యం ఎక్కువ కావడం వల్లే లండన్ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించింది. మరో రెండేళ్లలో 20 శాతం బస్సులు ఇవే ఉండాలని అక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టారు. గుజరాత్‌కు రాబోతున్నాయి బెంగళూరులో ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందని తెలియగానే ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ర్టం వీటిపై దృష్టిసారించింది. దేశంలో పర్యావరణంపై ఎక్కువగా దృష్టిపెట్టిన రాష్ర్టం గుజరాత్. అందుకే ఈ-బస్సులను పైలట్ ప్రాజెక్టుగా గాంధీనగర్-అహ్మదాబాద్‌ల మధ్య ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు రచిస్తోంది. గుజరాత్ పవర్ కార్పొరేషన్ ఇందులో ప్రధాన భాగస్వామి. తొలి దశలో 15-20 బస్సులు తేనున్నారు. సోలార్ పవర్ ద్వారా వీటికి ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటుచేస్తారట. ప్రతి 35 కిలోమీటర్లకు ఈ పాయింట్లు ఏర్పాటుచేస్తారు. బ్యాటరీ ఇండికేటర్ సిగ్నల్స్‌ను బట్టి బస్సును మార్గమధ్యలో కూడా ఛార్జి చేసుకోవచ్చు. ఆరు నెలల్లో ఇది అమలు చేస్తారట. మన రాష్ర్టంలో కూడా ముఖ్యంగా నగరాల్లో వీటిని ప్రారంభించి కాస్త కాలుష్యాన్ని తగ్గిస్తే బాగుంటుంది.