ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతోంది. శ్రీసత్యసాయి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తోంది. ప్రత్యేక రాయితీలు అందిస్తూ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే శ్రీసత్యసాయి జిల్లాలో మెగా పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థ ‘వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్’ ఎలక్ట్రిక్ బస్సు తయారీ యూనిట్ ఏర్పాటు పనులను ముమ్మరం చేసింది.
అనంతపురం టౌన్: భారీ పరిశ్రమలకు శ్రీసత్యసాయి జిల్లా కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే కియా కార్ల తయారీ పరిశ్రమతోపాటు అనేక అనుబంధ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. దీంతో పాటు నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్) సంస్థ శిక్షణ కేంద్రం రూపుదిద్దుకుంటోంది. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం గుడిపల్లిలో ఎలక్ట్రిక్ బస్సుల బాడీ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు ‘వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్’ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సదురు కంపెనీకి 124 ఎకరాల భూమిని కేటాయించింది. కంపెనీ ప్రతినిధులు దాదాపు రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా చేపడుతున్నారు. రానున్న రెండేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేసి పరిశ్రమను ప్రారంభించనున్నారు.
వేలాది మందికి ఉపాధి..
వీర వాహన ఉద్యోగ్ కంపెనీ తొలుత రూ.600కోట్ల పెట్టుబడితో బస్సుల తయారీ పరిశ్రమ ప్రారంభించి, దశల వారీగా రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. స్థానికంగా దాదాపు 8వేల మంది కార్మికులకు ప్రత్యక్ష్యంగా ఉద్యోగ అవకాశాలు దక్కడంతో పాటు పరోక్షంగా మరో 15వేల మందికి ఉపాధి లభించనుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వీర వాహన ఉద్యోగ్ సంస్థ తయారు చేసే బస్సులను ఇప్పటికే దేశ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. కంపెనీ విస్తరణలో భాగంగా ‘ఈ– బస్సు’ బాడీ తయారీ యూనిట్‌ను శ్రీసత్యసాయి జిల్లాలో నెలకొల్పుతోంది. గుడిపల్లి యూనిట్‌లో ఎలక్ట్రికల్ బస్సులతో పాటు ఏసీ, నాన్ ఏసీ బస్సు బాడీలను తయారు చేయనున్నారు.
సోమందేపల్లి మండలం గుడిపల్లి వద్ద బస్సుల బాడీ తయారీ ప్లాంట్ కోసం జరుగుతున్న పనులు
ఏడాదికి 3 వేల బస్సుల తయారీ..
రానున్న రోజులు ఎలక్ట్రిక్ రంగానిదే. ఈ – వాహనాల తయారీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అన్ని కంపెనీలు ‘ఈ – వాహనాల’ తయారీపై దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగానే ‘వీర వాహన ఉద్యోగ్’ బస్సుల తయారీ పరిశ్రమ సైతం అటువైపు అడుగులు వేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం గుడిపల్లి సమీపంలో ఏర్పాటు చేస్తున్న వీర వాహన ఉద్యోగ్ పరిశ్రమలో ఈ వాహనాలతోపాటు అన్ని రకాల బస్సులను తయారు చేయనున్నారు. ఏడాదికి మూడు వేల బస్సులు తయారు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.
చదవండి: (ఆర్‌ఆర్‌బీ అభ్యర్థులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్..)
త్వరలో మరిన్ని పరిశ్రమలు
పారిశ్రామికంగా శ్రీసత్యసాయి జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే జిల్లాలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు అందించి ప్రోత్సహిస్తోంది. వీర వాహన బస్సుల తయారీ పరిశ్రమతోపాటు రానున్న రోజుల్లో మరిన్ని భారీ పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు భారీ పరిశ్రమల నిర్వాహకులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటోంది. రెండేళ్లలో వీర వాహన ఉద్యోగ్ పరిశ్రమలో బస్సులు తయారీ ప్రారంభం కానుంది.
– మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్
వేగవంతంగా పనులు
కోవిడ్ పరిస్థితుల కారణంగా ‘వీర వాహన’ పరిశ్రమ ఏర్పాటు పనులు ఏడాదికి పైగా ఆగిపోయాయి. ప్రస్తుతం పనులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే 30 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని వీర వాహన బస్సుల తయారీ పరిశ్రమ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ అండగా నిలుస్తోంది. సకాలంలో వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం.
– నాగభూషణం, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment