సాక్షి, అమరావతి: డీజిల్ బస్సులకు టాటా చెబుతూ.. ఇ–బస్సులను స్వాగతించేందుకు రాష్ట్ర ప్రజా రవాణా విభాగం(ఆర్టీసీ) ముందడుగు వేస్తోంది. పర్యావరణ పరిరక్షణ, నిర్వహణ వ్యయం తగ్గింపునకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు (ఇ–బస్సులు)ను ప్రవేశపెట్టేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే తిరుమల–తిరుపతి మధ్య 150 ఇ–బస్సులను ప్రవేశపెట్టేందుకు టెండర్లు ఖరారు చేసింది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ ఇ–బస్సులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ ర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో కొత్త ఇ–బస్సులను ప్రవేశపెట్టడం భారీ వ్యయంతో కూడినది కావడంతో.. పాత డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్పు చేసేందుకు సిద్ధపడుతోంది. ఇందుకోసం రెట్రోఫిట్‌మెంట్ (పునర్నిర్మాణ) ప్రాజెక్టును చేపట్టనుంది.
ప్రాజెక్టు ఇలా..
డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ రెట్రోఫిట్‌మెంట్ ప్రాజెక్టుపై కసరత్తును ఆర్టీసీ ముమ్మరం చేసింది. పైలట్ ప్రాజెక్ట్‌గా ఒక డీజిల్ బస్సును ఇటీవల రెట్రోఫిట్ చేసి ఇ–బస్సుగా మార్చింది. డీజిల్ ఇంజన్ చాసిస్ ఉన్న బస్సులో బ్యాటరీతో పనిచేసే ఇంజన్‌ను ఏర్పాటు చేశారు. చాసిస్‌ను అలానే ఉంచి ఇ–బస్సుకు అనుగుణంగా రీ బాడీ బిల్డింగ్ చేశారు. దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం పుణేలోని ‘సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (సీఐఆర్‌టీ)’కి పంపిస్తారు. ఆ బస్సును అక్కడి నిపుణులు పరీక్షించి అన్ని ప్రమాణాల మేరకు ఉన్నాయని భావిస్తే సర్టిఫికెట్ జారీ చేస్తారు. అనంతరం ఆర్టీసీ డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మారుస్తారు.
దశలవారీగా ఇ–బస్సులుగా మార్పు
ప్రస్తుతం ఆర్టీసీ వద్ద మరో పదేళ్ల జీవిత కాలం ఉన్న 2 వేల డీజిల్ బస్సులు ఉన్నాయి. వాటిని ముందుగానే దశల వారీగా ఇ–బస్సులుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకోసం నీతి ఆయోగ్, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మార్గనిర్దేశాల ప్రకారం కసరత్తు చేస్తోంది. కొత్తగా కొనుగోలు చేసే ఇ– బస్సులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. 12 మీటర్ల బస్సులకు రూ.55 లక్షలు, 9 మీటర్ల బస్సులకు రూ.45 లక్షల చొప్పున రాయితీ ఇస్తోంది. డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్చి నప్పుడు అదే రీతిలో రాయితీ ఇవ్వాలని ఆర్టీసీ కేంద్రాన్ని కోరనుంది. పుణేలోని సీఐఆర్‌టీ నుంచి సర్టిఫికేషన్ వచ్చిన తరువాత ఈ దిశగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనుంది.
ప్రస్తుతం అమలు చేస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల తరహాలో ఈ రెట్రోఫిట్‌మెంట్ ప్రాజెక్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం టెండర్లు పిలిచి బిడ్డర్లను ఎంపిక చేస్తుంది. డీజిల్ బస్సులను దశలవారీగా ఇ–బస్సులుగా మార్చే దిశగా రెట్రోఫిట్‌మెంట్ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నామని ఆర్టీసీ ఈడీ (ఇంజినీరింగ్) కృష్ణమోహన్ ‘సాక్షి’కి తెలిపారు. దీనివల్ల కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment