Tirumala: ఇక ఫ్లయింగ్‌ జోన్‌గానే తిరుమల? | Plane Flies Over Tirumala Temple Devotees Express Anger, Know More Details Inside | Sakshi
Sakshi News home page

ఆలయం మీదుగా మళ్లీ.. ఇక ఫ్లయింగ్‌ జోన్‌గానే తిరుమల!!

Published Fri, Mar 14 2025 9:10 AM | Last Updated on Fri, Mar 14 2025 12:39 PM

Plane Flies Over Tirumala Temple Devotees Express Anger

తిరుపతి, సాక్షి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన చోట.. పదే పదే అపచారం జరుగుతోంది. ఆనంద నిలయం మీదుగా మళ్లీ విమానాలు వెళ్తుండడంతో భక్తులు ఒకింత ఆందోళన.. అదే సమయంలో ఆగ్రహానికి లోనవున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకోరా? అని ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. 

తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలు ఈ మధ్యకాలంలో ఇది మరీ ఎక్కువైపోయాయి. ఆగమ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ప్రతిరోజు శ్రీవారి ఆలయం మీద నుంచి విమానాలు వెళ్తుండడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తిరుమలను నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించాలనే డిమాండ్‌ కొత్తేం కాదు. 

ఈ అంశంపై కేంద్రానికి పలుమార్లు తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రభుత్వాలు లేఖలు రాసినా స్పందన లేకుండా పోయింది. తిరుపతిలో విమానాల రాకపోకలకు అంతరాయం కలగొచ్చంటూ కేంద్రం అప్పట్లో వివరణ ఇచ్చుకుంది. అంతెందుకు గతంలో టీడీపీ తరఫున అశోక గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా చర్చ జరిగింది. కానీ, అడుగులు ముందుకు పడలేకపోయాయి. అయితే.. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి కావడం, పైగా రాష్ట్రానికి చెందిన రామ్మోహన్‌నాయుడు విమానయానశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సానుకూల స్పందన రావొచ్చని భక్తులు భావించారు. కానీ, అదీ జరగడం లేదు.

తాజాగా విమానయాన శాఖ మంత్రికి టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఓ లేఖ రాశారు. తిరుమలపై విమాన రాకపోకలు నిషేధించాలని లేఖలో కోరారు.  ఈ లేఖకు మంత్రి రామ్మోహన్‌నాయుడు స్పందించారు. తిరుమలకు నో ఫ్లయింగ్‌ జోన్‌ ఇవ్వడం సాధ్యం కాదని, అలాంటి హోదా ఇవ్వడానికి నిబంధనలు లేవని అన్నారు. పైగా దేశంలో ఇప్పటికే చాలా ఆధ్యాత్మిక ప్రాంతాల నుంచి ఇలాంటి వినతులు వస్తున్నాయని చెప్పారు.  అయితే తిరుమల గగనతలంపైకి విమానాలు రాకుండా, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ విభాగాలతో చర్చించి చర్యలు తీసుకుంటాం అని మాత్రం  హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినా.. ఇప్పుడు మళ్లీ విమానాలు తిరుగుతున్నాయి. ఇంతటి అపచారం జరుగుతున్నా.. తిరుమలను ఫ్లయింగ్‌ జోన్‌గానే కొనసాగిస్తారా? అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అగమశాస్త్రం ఏం చెబుతోందంటే.. 

దేవాలయాలపైన ఎవరూ సంచరించకూడదని అగమశాస్త్రం చెబుతోంది. ఆలయాలు ఉన్నత ప్రాంతాలు. భగవంతుడి కంటే ఎత్తులో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. దైవానికి నివేదన చేసేటప్పుడు.. గంటానాదం, ఢమరుకం, వాయిద్యాలు తప్పించి.. మరేయితర శబ్ధాలు వినిపించకూడదు. అలా జరిగితే అది అపచారం. 

కావున అగమశాస్త్రం ప్రకారం విమానాలు, రాకెట్లు ఆలయం మీదుగా వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. పైగా తిరుమలలాంటి స్వయంవ్యక్త క్షేత్రం కోట్లాదిమంది భక్తుల విశ్వాసాలకు ప్రతీక కాబట్టి సముచితమైన రీతిలో కాపాడుకోవాలని పిలుపు ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement