సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ తిరుమల, తిరుపతిల్లో ఈ–బస్సులకు ఆర్టీసీ రైట్‌రైట్ చెప్పింది. తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో 50, తిరుపతి ఇంటర్ సిటీ సర్వీసుగా 50 ఈ–బస్సులను అద్దె ప్రాతిపదికన ప్రవేశపెట్టడానికి టెండర్లను బుధవారం ఆమోదించింది. ఏసీ డీజిల్ అద్దె బస్సుల ధరకే ఏసీ ఈ–బస్సులను ప్రవేశపెట్టడానికి ఆమోదిస్తూ టెండర్లు ఖరారు చేసింది. దేశంలోనే అతి తక్కువ ధరకు ఈ–బస్సుల టెండర్లను ఖరారు చేసిన సంస్థగా ఆర్టీసీ గుర్తింపు పొందింది. రాష్ట్రంలో తిరుమల–తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరులలో 350 ఏసీ ఈ–బస్సులను ప్రవేశపెట్టేందుకు 5 ప్యాకేజీల కింద ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. టెక్నికల్ బిడ్‌లో ఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అశోక్ లేలాండ్ కంపెనీలు అర్హత సాధించి ఫైనాన్సియల్ బిడ్లు దాఖలు చేశాయి.
ఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3 ప్యాకేజీలలో ఎల్–1గా నిలవగా, అశోక్ లేలాండ్ 2 ప్యాకేజీలలో ఎల్–1గా వచ్చింది. అధిక ధరలు కోట్ చేస్తే సమ్మతించేది లేదని ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ ఉన్నతాధికారులకు విస్పష్టంగా చెప్పారు. ఆర్టీసీ డీజీల్ బస్సుల రేట్లకే ఈ–బస్సులను టెండర్లు ఖరారు చేయాలన్నారు. అందుకు సాధ్యం కాకపోతే ఏకంగా టెండర్ల ప్రక్రియ నిలిపేయాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆ రెండు సంస్థలతో పలు దఫాలుగా చర్చించారు. తిరుమల, తిరుపతిల్లో ఈ–బస్సుల అంశంలో డీజిల్ బస్సుల ధరలకు దగ్గరగా రావడంతో ఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టెండర్లు ఖరారు చేశారు. అధిక ధరలు కోట్ చేయడంతో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరుల్లో ఈ–బస్సుల టెండర్ల అంశాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు. ఆర్టీసీపై ఆర్థికభారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తిరుమల–తిరుపతిలో ప్రవేశపెట్టే ఈ–బస్సుల పనితీరును సమీక్షించడంతోపాటు రానున్న ఏడాదిలో ఈ–బస్సుల ధరలు మరింతగా తగ్గితే ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది.
కిలోమీటరుకు రూ.52.52
తిరుమల–తిరుపతిల్లో 100 ఈ–బస్సులకు టెండర్లను ఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఖరారు చేశారు. తిరుమల–తిరుపతి ఘాట్‌రోడ్డులో 50 బస్సులు, తిరుపతి సిటీ సర్వీసు కింద 50 బస్సులను ప్రవేశపెడతారు. ఘాట్‌రోడ్డులో తిరిగే ఈ–బస్సులకు విద్యుత్ ఖర్చులతో కలిపి కిలోమీటరుకు రూ.52.52 చొప్పున చెల్లిస్తారు. దీన్లో బస్సు చార్జీలు రూ.45.76, విద్యుత్ చార్జీలు రూ.6.76. తిరుపతి సిటీ సర్వీసులో తిరిగే ఈ–బస్సులకు విద్యుత్ ఖర్చులతో కలిపి కిలోమీటరుకు రూ.44.95 చొప్పున చెల్లిస్తారు. దీన్లో బస్సు చార్జీలు రూ.38.19, విద్యుత్ చార్జీలు రూ.6.76.
దేశంలోనే అత్యంత తక్కువ ధర
దేశంలోనే అతి తక్కువ ధరకు ఈ–బస్సుల టెండర్లను ఆర్టీసీ ఖరారు చేసింది. ఘాట్‌రోడ్డు, సాధారణ రోడ్డులలో ఈ–బస్సులకు దేశంలో ఇప్పటివరకు తక్కువ ధరకు ఖరారైన టెండర్లను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. దేశంలో ఘాట్‌రోడ్లపై ఇప్పటివరకు అతి తక్కువ ధరకు ఈ–బస్సుల టెండర్లను డెహ్మాడూన్‌లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఖరారు చేసింది. విద్యుత్ చార్జీలతో కలిపి కిలోమీటరుకు రూ.66.78కి టెండర్లు ఆమోదించారు. మన రాష్ట్రంలో తిరుమల–తిరుపతి ఘాట్‌రోడ్డులో ఈ–బస్సుల టెండర్లను విద్యుత్ చార్జీలతోసహా కేవలం రూ.52.52కే ఆర్టీసీ ఆమోదించింది.
డెహ్రాడూన్‌లో 27+1 కెపాసిటీ బస్సులను ప్రవేశపెట్టారు. అంతకంటే తక్కువ ధరకు తిరుమల–తిరుపతిలో 35+1 కెపాసిటీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. దేశంలో సాధారణ రోడ్లపై ఇప్పటికి అతి తక్కువ ధరకు ఈ–బస్సుల టెండర్లను మహారాష్ట్రలోని నవీ ముంబాయి కార్పొరేషన్ ఖరారు చేసింది. విద్యుత్ చార్జీలతోసహా అక్కడ కిలోమీటరుకు రూ.52.20కు టెండర్లు ఆమోదించారు. అంతకంటే తక్కువగా ఆర్టీసీ తిరుపతి ఇంటర్ సిటీ సర్వీసుల కోసం ఈ–బస్సుల టెండర్లను కిలోమీటరుకు కేవలం రూ.44.95కే ఖాయం చేయడం విశేషం. నవీ ముంబాయిలో 27+1 కెపాసిటీ ఈ–బస్సులను ప్రవేశపెట్టగా అంతకంటే తక్కువ ధరకు తిరుపతిలో ఇంటర్ సిటీ సర్వీసుల కోసం 35+1 కెపాసిటీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు.
నాలుగు నెలల్లో రోడ్లపైకి బస్సులు
టెండర్లు ఖరారు చేయడంతో తిరుమల, తిరుపతిల్లో ఈ–బస్సులు త్వరలో రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఈవై ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బస్సులను సమకూర్చుకున్న తరువాత వాటిని రాష్ట్ర రహదారులపై పరీక్షిస్తారు. ప్రమాణాల మేరకు ఉన్నట్టు నిర్ధారించిన తరువాతే అనుమతిస్తారు. నాలుగు నెలల్లో ప్రయాణికులకు ఈ–బస్సుల సేవలు అందుతాయని ఆర్టీసీ భావిస్తోంది.
తిరుమల–తిరుపతిల్లో ఈ–బస్సులకు రైట్‌రైట్
Published Thu, Jul 8 2021 3:24 AM | Last Updated on Thu, Jul 8 2021 3:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment