సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) మరిన్ని విద్యుత్ బస్సులు (ఈ–బస్సులు) కొనుగోలు దిశగా కార్యాచరణకు సంసిద్ధమవుతోంది. కొత్తగా 1,500 ఈ–బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీసుల కోసం 100 ఈ–బస్‌లను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలకూ వీటి సేవలను విస్తరించాలని నిర్ణయించింది. అందుకోసం రెండో దశ కింద 1,500 ఈ–బస్‌లను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్‌ఎల్)తో కలిసి ఆర్టీసీ ఈ బస్సులను తీసుకురానుంది.
డీజిల్ బస్సుల స్థానంలో ఈ–బస్‌లు..
సీఈఎస్‌ఎల్, ఆర్టీసీ సంయుక్తంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్కో బస్సుకు రూ.కోటి చొప్పున రూ.1,500 కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్టును ఆమోదించాయి. డీజిల్ బస్సుల స్థానంలో ఈ–బస్‌లను ప్రవేశపెట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు 27 శాతం నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ఇక తొమ్మిది మీటర్ల పొడవుండే ఈ–బస్‌లు అయితే కి.మీ.కు రూ.39.21, అదే 12 మీటర్ల పొడవున్న ఈ–బస్ అయితే కి.మీ.కు రూ.43.49 వ్యయం అవుతుందని అంచనా వేశారు.
జిల్లా కేంద్రాల మధ్య ఈ–బస్ సర్వీసులు
రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాల్లో ఈ–బస్ సేవలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అందుకే సమీపంలో ఉన్న జిల్లా కేంద్రాల మధ్య ఈ సర్వీసులను నిర్వహించాలని నిర్ణయించారు. మొదటగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు డిపోలకు వాటిని కేటాయించనున్నారు.
ఆ డిపో కేంద్రాలు ఉన్న జిల్లా కేంద్రాల నుంచి రానూపోనూ 250 కి.మీ. దూరంలో ఉన్న జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాలకు వీటిని నడుపుతారు. ఎందుకంటే ఈ–బస్‌లకు ఓసారి చార్జింగ్ పెడితే గరిష్టంగా 250 కి.మీ. వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందుకోసం ఆయా డిపోల్లో చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటుచేస్తారు. ఇక ఆర్టీసీకి వెయ్యి ఈ–బస్‌లను అద్దె విధానంలో అందించేందుకు సీఈఎస్‌ఎల్ త్వరలో టెండర్ల ప్రక్రియ నిర్వహించనుంది. అనంతరం ఈ ఏడాది చివరి నాటికి వాటిని ఆర్టీసీకి అందజేస్తుంది.
కొత్తగా ఈ–బస్సులు
Published Mon, Sep 4 2023 5:26 AM | Last Updated on Mon, Sep 4 2023 5:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment