సాక్షి, అమరావతి: ప్రయాణికులపై అదనపు చార్జీల భారం లేకుండానే దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు చెప్పారు. దశాబ్దకాలం తరువాత ఇలా అదనపు చార్జీలు లేకుండా ఆర్టీసీ దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించడం ఇదే తొలిసారని తెలిపారు. విజయవాడలోని బస్‌భవన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ ఏడాది దసరా రద్దీ దృష్ట్యా 4,500 ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తామని చెప్పారు. దసరా ఉత్సవాల ముందు ఈ నెల 29 నుంచి అక్టోబరు 4 వరకు 2,100 బస్సులు, దసరా తరువాత అక్టోబరు 5 నుంచి 9 వరకు 2,400 బస్సులు నడుపుతామని తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతోపాటు రాష్ట్రంలోని 21 నగరాలు, ముఖ్య పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు.
అన్ని సర్వీసుల్లోను యూటీఎస్ విధానాన్ని అమలు చేస్తూ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్లు, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా టికెట్లు తీసుకోవచ్చని వివరించారు. అన్ని బస్సులను జీపీఎస్ ట్రాకింగ్ విధానంతో అనుసంధానించి కంట్రోల్ రూమ్ నుంచి 24/7 పర్యవేక్షిస్తామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేటు బస్సులను నిరోధించేందుకు పోలీసు, రవాణా శాఖలతో కలసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ–బస్ సర్వీసులు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్టీసీ ఈ–బస్ సర్వీసులను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 10 ఈ–బస్సులను నడుపుతామన్నారు. అనంతరం దశలవారీగా డిసెంబర్ నాటికి తిరుమల–తిరుపతి ఘాట్‌రోడ్డులో 100 ఈ–బస్ సర్వీసులను ప్రవేశపెడతామని చెప్పారు. తిరుమల ఘాట్‌రోడ్‌తోపాటు రాష్ట్రంలో దూరప్రాంత సర్వీసుల కోసం కొత్తగా 650 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
గత ఏడాది 1,285 బస్సులను ఫేస్‌లిఫ్ట్ విధానంలో నవీకరించామని ఈ ఏడాది రూ.25 కోట్లతో మరో 1,100 బస్సులను నవీకరిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తామన్నారు. ఇటీవల పదోన్నతులు పొందిన దాదాపు రెండువేల మందికి సాంకేతికపరమైన అంశాలను పూర్తిచేసి నవంబర్ 1 నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఈడీ (కమర్షియల్) కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎస్‌ఆర్టీసీ: అదనపు చార్జీల్లేకుండానే దసరా స్పెషల్
Published Fri, Sep 23 2022 5:23 AM | Last Updated on Fri, Sep 23 2022 11:09 AM
Comments
Please login to add a commentAdd a comment