
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ప్యాసింజర్ వాహన రంగంలో వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–18 శాతానికి పరిమితం అవుతుందని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ తెలిపింది. పరిశ్రమ 18–22 శాతం వృద్ధి సాధిస్తుందని గతంలో అంచనా వేసినట్టు వివరించింది. ‘సెమికండక్టర్ల కొరత తాజా అంచనాల సవరణకు కారణం. వీటి కొరత వచ్చే ఏడాదీ కొనసాగనుంది. ఆగస్ట్, సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరు ఉత్పత్తిలో మెరుగుదల ఉంటుందని కొన్ని భారతీయ తయారీదార్లు భావించినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా చిప్స్‌కు డిమాండ్ పెరగడం, కొత్త సామర్థ్యాలను ఏర్పాటు చేయడానికి ఆలస్యం అవుతున్నందున సరఫరా పరిమితం అవుతుంది.
క్రిసిల్ సైతం..
ప్యాసింజర్ వాహన పరిశ్రమ వృద్ధి అంచనాలను 16–17 నుంచి 11–13 శాతానికి సవరిస్తున్నట్టు క్రిసిల్ వెల్లడించింది. ఉత్పత్తి అడ్డంకుల కారణంగా వాహనం కోసం వేచి ఉండే కాలం పెరుగుతున్నందున పరిశ్రమ పునరుద్ధరణను ఆలస్యం చేస్తోందని వివరించింది. మొత్తం పరిశ్రమలో 71 శాతం వాటా కైవసం చేసుకున్న మూడు కంపెనీలను ఆధారంగా చేసుకుని విశ్లేషించినట్టు తెలిపింది. సెమి కండక్టర్ల కొరతతో తయారీ సంస్థలు నష్టాలను చవిచూస్తున్నాయని, కొన్ని మోడళ్ల కోసం వేచి ఉండే కాలం 2–3 నెలల నుంచి ప్రస్తుతం 6–9 నెలలకు చేరిందని వివరించింది. మహమ్మారి కారణంగా వ్యక్తిగత వాహనాలకు అంచనాలను మించి డిమాండ్ ఏర్పడింది. చైనా కంపెనీలు చిప్‌లను నిల్వ చేసుకోవడం, వాహన తయారీ సంస్థలు ప్రణాళిక లేకుండా వ్యవహరించడం సమస్యకు కారణం అని క్రిసిల్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment